logo

గిరిజనుల సంక్షేమానికి భాజపా కృషి

దేశంలో అట్టడుగువర్గాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ బాబు అన్నారు.

Published : 01 Mar 2024 03:05 IST

శిల్పకళా సంపదను వీక్షిస్తున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే హరీశ్‌ బాబు, నాయకులు

ములుగు టౌన్‌, న్యూస్‌టుడే:  దేశంలో అట్టడుగువర్గాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ బాబు అన్నారు. భాజపా విజయ సంకల్పయాత్రను గురువారం మల్లంపల్లి నుంచి ప్రారంభించారు. మొదటగా నాయకులు గట్టమ్మతల్లికి మొక్కులు చెల్లించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన ములుగు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ పేరుతో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి రూ.900 కోట్లు కేటాయించడం గర్వకారణమని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. భారత్‌ను ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలిపే బలమైన నాయకుడు మోదీ మాత్రమేనని, అలాంటి నేతను మూడోసారి నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. విజయసంకల్ప యాత్ర ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ..  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కోట్లాది రూపాయలతో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టడంతో పాటు రామప్ప ఆలయ యునెస్కో గుర్తింపునకు కృషి చేశారని తెలిపారు. ప్రపంచానికి భారత్‌ దిక్సూచిగా మారాలంటే మరోసారి మోదీ సర్కారు రావాలన్నారు. వరంగల్‌, మహబూబాబాద్‌ సీట్లను భాజపా కైవసం చేసుకునేలా గిరిజన బిడ్డలు ఆశీర్వదించాలని కోరారు. భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, యాత్ర సహ ఇన్‌ఛార్జి చాడ వెంకటరెడ్డి, అసెంబ్లీ ఇన్‌ఛార్జి పి.నరోత్తం రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణవేణినాయక్‌, బీజేపీˆ ఎసీˆ్ట మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్‌ రెడ్డి, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్‌, నాయకులు శోభన్‌, జవహర్‌లాల్‌, కుమార్‌, కృష్ణాకర్‌ రావు, మహేందర్‌, మల్లేశ్‌, తేజరాజు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

మోదీ హయాంలోనే రామప్పకి యునెస్కో గుర్తింపు

వెంకటాపూర్‌: కాకతీయుల కాలం నాటి రాతి కట్టడమైన రామప్పకి యునెస్కో గుర్తింపు భాజపా కృషి వల్లే వరించిందని ఎమ్మెల్యే హరీశ్‌బాబు అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా జిల్లా పర్యాటనకు వచ్చిన ఆయన బస్సు యాత్రతో రామప్పకి వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఆయనకు స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలను, సంస్కృతి, సాంప్రదాయాలను, సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసం మోదీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అద్భుత శిల్పకళా సంపద కలిగిన రామప్పకి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందడం కోసం భాజపా కృషి వెలకట్టలేనిదని, రామప్ప పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం కూడా భాజపాతో సాధ్యమైందన్నారు. స్థానికులు వారసత్వ కట్టడాల రక్షణలో ప్రత్యేక పాత్ర వహించాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని