logo

రూ.27.97 కోట్లతో వార్షిక బడ్జెట్‌

భూపాలపల్లి పురపాలక సంఘం వార్షిక బడ్జెట్‌(2024-25) రూపకల్పన చేసి, గురువారం కౌన్సిల్‌ సమావేశంలో ప్రవేశపెట్టారు.

Published : 01 Mar 2024 03:07 IST

సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

న్యూస్‌టుడే, భూపాలపల్లి: భూపాలపల్లి పురపాలక సంఘం వార్షిక బడ్జెట్‌(2024-25) రూపకల్పన చేసి, గురువారం కౌన్సిల్‌ సమావేశంలో ప్రవేశపెట్టారు. రూ.27.97 కోట్లతో కూడిన బడ్జెట్‌ను మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణితో పాటు కౌన్సిలర్లంతా ఆమోదం తెలిపారు. సమావేశానికి ఛైర్మన్‌తో పాటు 11 మంది వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి పద్దును రూ.1.41 కోట్లు ఎక్కువగా చూపారు. పన్ను రాబడి గతేడాది రూ.4.63 కోట్లు చూపితే ఈ సారి రూ.4.71 కోట్ల వరకు పెంచారు. గత పదేళ్లలో ఆస్తి, నీటి పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ల ద్వారా వచ్చే ఆదాయానికి బాగా గండి పడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పన్ను రాబడిపై ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం కల్పించారు. పన్నేతర రాబడి, వివిధ గ్రాంటుల ద్వారా ఈ ఏడాది రూ.4.50 కోట్లు చూపించారు.  పారిశుద్ధ్య సిబ్బంది వేతనాల ఖర్చు ఈ సంవత్సరంలో ప్రతి నెలా రూ.35 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని, డీజిల్‌ ఖర్చు నెలకు రూ.4 లక్షలు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.  

ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలి : భూపాలపల్లి పురపాలక సంఘం ఆదాయాన్ని పెంచడానికి ఆయా వార్డుల కౌన్సిలర్లు, అధికారులు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ముఖ్యంగా ఆస్తి పన్నుతో పాటు నీటి పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌ల ద్వారా రూ.కోట్లలో ఆదాయం వస్తుందని.. గత పదేళ్లుగా నిర్లక్ష్యం చేశారన్నారు. సింగరేణి సంస్థతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రావల్సిన పన్ను బకాయిలను వసూలు చేయాలని, ఐదేళ్లుగా మున్సిపాలిటీకి రావాల్సిన స్టాంప్‌ డ్యూటీ నిధులు రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి రావడం లేదని తెలిపారు. ఈ ఏడాదిలో ఆస్తి పన్ను ఇప్పటివరకు కేవలం 34 శాతం వసూలు కావడంతో నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని, వంద శాతం పన్నుల వసూలు కోసం అధికారులు, పాలక సభ్యులు కృషి చేయాలని పేర్కొన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలతో పాటు, సింగరేణి సంస్థ చెల్లించాల్సిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్‌, ముంజాల రవీందర్‌, శిరుప అనిల్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి అధికారులతో మాట్లాడి, ఆస్తి పన్ను బకాయిలు వెంటనే చెల్లించేలా కృషి చేస్తానని, స్టాంప్‌ డ్యూటీ ద్వారా వచ్చే నిధుల విడుదల కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సీఎస్‌ఆర్‌, డీఎంఎఫ్‌టీ నిధులు ఈ జిల్లా అభివృద్ధికే కేటాయించాలని, ఇతర జిల్లాలకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలోనే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వేసవిలో మున్సిపాలిటీ పరిధిలోని ఏ కాలనీలోనూ తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌, మేనేజర్‌ స్వామి, ఆర్‌ఐ భాస్కర్‌, అకౌంట్‌ అధికారి అనితాదేవి, టీపీవో సునీల్‌, ఏఈ మానస, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నవీన్‌, శ్రీనివాస్‌ తదితర వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని