logo

గొర్రెల పంపిణీ పథకం అమలయ్యేనా..?

తెలంగాణలో గత భారాస ప్రభుత్వం గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Published : 01 Mar 2024 03:09 IST

సుమారు 4వేల మంది ఎదురు చూపులు

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో గత భారాస ప్రభుత్వం గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2017లో ఈ పథకం ప్రారంభం కాగా.. ఒక్కో లబ్ధిదారునికి 20 ఆడ, ఒక పొట్టెలును కలుపుకొని  మొత్తం 21 గొర్రెలను అందించింది. మొదట్లో యూనిట్‌ విలువ రూ.1.25 లక్షలు కాగా, అందులో 75 శాతం ప్రభుత్వ రాయితీ 25 శాతం లబ్ధిదారుని వాటా చెల్లింపు చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 15,402 మంది లబ్ధిదారులకు గొర్రెలను అందించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో మరో 4వేల మందికి పైగా గొర్రెల యూనిట్లను అందించాల్సి ఉంది. రెండో విడత మాత్రం నత్తనడకన సాగింది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పథకం అమలుకు విరామం ఏర్పడింది. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పగ్గాలు చేపట్టడం.. పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న విషయాన్ని ప్రకటించి పశు, సంవర్ధక శాఖలో ఉన్నతాధికారులను బాధ్యులను చేయడం.. పథకం అమలుకు సర్కారు ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో గొర్రెల పంపిణీ పథకం అమలుపై డీడీలు చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

సష్టత ఇవ్వాలి..  
మంగ శ్రీను, (కోడూరు, రఘునాథపల్లి)

పథకం రెండో విడతలో లబ్ధిదారునిగా.. గత ఏప్రిల్‌ మాసంలో రూ.43,750లను చెల్లించాను. జీవాల పంపిణీకి గతంలో ఎన్నికల కోడ్‌ రావటంతో తాత్కాలికంగా ఆగిపోయింది. అనంతరం కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం పథకం అమలుపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలో 4వేల మందికి పైగా లబ్ధిదారులం ఆశగా ఎదురు చూస్తున్నాô.

ప్రభుత్వం నగదు బదిలీ చేయాలి.. : సాదం రమేశ్‌ (గొర్రెల, మేకల పెంపకందారుల జిల్లా కార్యదర్శి, జనగామ)

గొర్రెల పంపిణీలో అక్రమాల పేరు చెప్పి పథకాన్ని నిలిపి వేయడం సరి కాదు. ఏవైనా అవకతవకలు జరిగితే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలే తప్పా.. లబ్ధిదారులకు మొండి చేయి చూపవద్దు. నగదు బదిలీ చేయాలి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు: మనోహర్‌ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, జనగామ

జిల్లాలో రెండో విడతలో 4,499 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారు. ఇందులో 2,757 మంది డీడీలు చెల్లించగా.. 416 మంది లబ్ధిదారులకు గొర్రెలను అందించాం. మిగతా 2,341 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించి ఉన్నారు. ప్రభుత్వం పథకం అమలుపై ఎలాంటి ఆదేశాలు చేస్తారోనని ఎదురు చూస్తున్నాం. ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం.

జిల్లాలో పరిస్థితి ఇలా..

మొత్తం లబ్ధిదారుల సంఖ్య: 21,704
మొదటి విడత కింద : 16,275
లబ్ధిపొందిన వారు: 15,042
రెండో విడత కింద : 4,499
లబ్ధిపొందిన వారి సంఖ్య: 416

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని