logo

‘గ్రేటర్‌’లోనే ఎందుకిలా..

కరీంనగర్‌, ఖమ్మం నగరపాలక సంస్థలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. కారణం ఐఏఎస్‌ కమిషనర్లు రెండేళ్ల పాటు పనిచేస్తున్నారు.

Updated : 01 Mar 2024 06:33 IST

కమిషనర్ల బదిలీలతో పాలన అస్తవ్యస్తం

కరీంనగర్‌, ఖమ్మం నగరపాలక సంస్థలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. కారణం ఐఏఎస్‌ కమిషనర్లు రెండేళ్ల పాటు పనిచేస్తున్నారు. గ్రేటర్‌ వరంగల్‌లో పనిచేసేవారు ఏడాది దాటకముందే బదిలీలయ్యారు. గత పదేళ్లలో ఎనిమిది మంది కమిషనర్లు మారారు. వీరిలో ఏడుగురు ఐఏఎస్‌లు, ఒక్క నాన్‌ ఐఏఎస్‌ ఉన్నారు.  కొత్తగా వచ్చేవారికి మున్సిపల్‌ నిబంధనలు, వ్యవహారాలు తెలిసేందుకు 3-4 నెలల సమయం పడుతోంది. అన్ని తెలిసే లోపే బదిలీ బాట పడుతున్నారు.  

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే:  రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత రెండో పెద్ద నగరం వరంగల్‌. దేశంలో ఏ నగరానికీ  దక్కని స్మార్ట్‌సిటీ, అమృత్‌, స్మార్ట్‌సిటీ త్రీ ఇన్‌ వన్‌ పథకాలు దక్కాయి. చారిత్రక నగరాన్ని అభివృద్ధి పరిచేందుకు గొప్ప అవకాశం ఉంది. తరచూ గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్ల బదిలీలతో నగరాభివృద్ధి కుంటుపడుతోంది. కమిషనర్ల నియామకంలో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడం, ఏకాభిప్రాయం ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది.

ఐఏఎస్‌ అధికారి రిజ్వాన్‌ బాషా తొమ్మిది నెలలకే జనగామ పాలనాధికారిగా బదిలీ అయ్యారు. దీంతో గతంలో కమిషనర్‌గా పనిచేసిన వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్యను ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలొస్తున్నాయి. వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో)గా వ్యవహరిస్తారు. సుమారు రెండు నెలల పాటు తీరిక లేకుండా ఉంటారు. ఆమె వరంగల్‌ జిల్లా పాలనాధికారిగా, గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ బాధ్యతలు చూడాలి.

ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వరంగల్‌ పాలనాధికారి ప్రావీణ్య

వరంగల్‌ మహా నగరపాలక సంస్థ పూర్తి అదనపు బాధ్యతల కమిషనర్‌గా వరంగల్‌ జిల్లా పాలనాధికారి పి.ప్రావీణ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవోనంబరు 327 జారీ చేశారు. పూర్తిస్థాయి కమిషనర్‌ వచ్చే వరకు కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు వరంగల్‌ కలెక్టరేటులో ఇన్‌ఛార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదనపు కమిషనర్‌ రషీద్‌, ఇతర అధికారులు జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఇదీ పరిస్థితి..

  • వరంగల్‌ నగర విస్తీర్ణం 406 చదరపు కిలో మీటర్లు, 66 డివిజన్లు ఉన్నాయి. పూర్తిస్థాయి కమిషనర్‌ ఉంటే అన్ని సవ్యంగా సాగుతాయి. లేదంటే అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు.
  • వేసవి కాలం మొదలైంది. ఎండల తీవ్రత పెరగక ముందే కాలనీల్లో తాగునీటి సమస్య మొదలైంది. ఇంత వరకు వేసవి కాలంలో అనుసరించాల్సిన ప్రణాళిక ప్రతిపాదనల్లోనే ఉంది. అద్దె వాటర్‌ ట్యాంకర్లు కావాలి, లీకేజీలు అరికట్టాలి చేతి పంపుల మరమ్మతులపైనా ఇంకా నిర్ణయం తీసుకొలేదు.
  • వరంగల్‌ త్రినగరాలకు గత 15 ఏళ్లుగా ముంపు తప్పడం లేదు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లోని ప్రధానమైన నాలాల పూడికతీత పనులు చేపట్టాలి. ఇంత వరకు ప్రతిపాదనలే తయారు కాలేదు. 40 నాలాలు పూడిక తీయాలి. ఇంజినీరింగ్‌, ప్రజారోగ్య విభాగాల మధ్య సమన్వయం లేదు.
  • నగరంలోని 66 డివిజన్లలో సమస్యలున్నాయని ఇప్పటికే పార్టీల కతీతంగా కార్పొరేటర్లు ఏకమయ్యారు. సమస్యలపై చర్చించేందుకు రెండు రోజుల పాటు ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలని మేయర్‌ సుధారాణికి వినతి పత్రం ఇచ్చారు. డివిజన్లకు నిధులిస్తామంటేనే బల్దియా బడ్జెటు ఆమోదిస్తామని అల్టిమేట్టం ఇచ్చారు.
  • పట్టణ ప్రణాళిక, పన్నుల విభాగాల్లో దస్త్రాలు కదలడం లేదు. బహిరంగంగానే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజావాణి అర్జీలు పరిష్కారానికి చొరవ చూపడం లేదు. అన్ని విభాగాల్లో వందల సంఖ్యలో దస్త్రాలు పెండింగ్‌లో ఉన్నాయి.
  • ఆస్తి, నల్లా పన్నులు, ట్రేడ్‌ లైసెన్సు రుసుముల వసూళ్లలో పురోగతి లేదు. ప్రస్తుతం బల్దియా ఖజానా ఖాళీగా ఉంది. ఆదాయం చాలా అత్యవసరం. అధికారుల పర్యవేక్షణ లేక పన్నుల వసూళ్లు మందగించాయి.

‘కుడా’ ఎలా..

గత కొన్నేళ్లుగా పరిశీలిస్తే గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఇన్‌ఛార్జి వైస్‌ ఛైర్మన్‌గా ఉంటున్నారు. కమిషనర్లు బదిలీల ప్రభావం ‘కుడా’పైనా ఉంటుంది. అక్కడా పాలన అదుపు తప్పుతోంది. ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్యకు అదనపు బాధ్యతల ఉత్తర్వుల్లో ‘కుడా’ వీసీ బాధ్యతల ఊసే లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని