logo

పెరిగిన కొలువుల ఆశలు..!

రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించింది.. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేస్తూ.. అప్పటి పోస్టులకు మరిన్ని ఖాళీలను కలిపి గురువారం  ప్రకటన వెలువరించింది.

Published : 01 Mar 2024 03:13 IST

మెగా డీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఉత్సాహం

హనుమకొండలోని గ్రంథాలయంలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న ఉద్యోగార్థులు

రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించింది.. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేస్తూ.. అప్పటి పోస్టులకు మరిన్ని ఖాళీలను కలిపి గురువారం  ప్రకటన వెలువరించింది. దీంతో ఉమ్మడి వరంగల్‌లోని డీఎడ్‌, బీఎడ్‌ శిక్షణ పూర్తి చేసి..టెట్‌ అర్హత పొందిన వేలాది మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి.

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, ఎన్జీవోస్‌కాలనీ

పెరిగిన పోస్టులు: గత ప్రభుత్వ హయాంలో వచ్చి డీఎస్సీ ప్రకటనలో ఉమ్మడి జిల్లాలోని అన్ని విభాగాల్లో 532 ఖాళీలను చూపించారు. అవి కాకుండా ప్రస్తుతం 856 స్కూల్‌ అసిస్టెంట్లు, భాషాపండితులు, ఎస్‌జీటీలు, 131 స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీ ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులతో 1519 ఖాళీలను చూపించారు. వ్యాయామ ఉపాధ్యాయులు మినహా మిగిలిన విభాగాలన్నింటిలో పోస్టుల సంఖ్య పెరిగింది. పెంచిన ఖాళీల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్‌ 334, ఎస్‌జీటీలు 922, భాషాపండితులు 102, వ్యాయామ ఉపాధ్యాయులు 30, స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రత్యేక ఉపాధ్యాయులు 26, ఎస్‌జీటీ ప్రత్యేక ఉపాధ్యాయులు 105 పోస్టులను ఖాళీలుగా చూపారు.

తెరుచుకోనున్న బడులు: బడులు లేని ఊరు ఉండకూడదని.. ఆ మేరకు నియామకాలు చేపడుతామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా మెగా డీఎస్సీ ప్రకటన వెలువరించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త ఉపాధ్యాయులతో మూసివేసిన బడులు తెరుచుకోవడమేగాక ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత సమస్య కూడా తీరనుంది.

సంతోషంగా ఉంది : సుభద్ర, డీఎస్సీ అభ్యర్థిని వరంగల్‌

పోస్టులు పెంచడం సంతోషంగా ఉంది. ఎలాంటి చిక్కులు లేకుండా పరీక్షను త్వరితగతిన పూర్తి చేయాలి. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి బడికి వెళ్లేలా చూడాలి.

పలువురికి ప్రయోజనం: వెన్నెల, డీఎస్సీ అభ్యర్థిని, హనుమకొండ

స్కూల్‌ అసిస్టెంట్‌ బయోలాజికల్‌ సైన్స్‌ పోస్టు కోసం చదువుతున్నా. ప్రభుత్వం పోస్టులను పెంచుతూ ప్రకటన వెలువరించడం సంతోషంగా ఉంది. నిరుద్యోగులకు మేలు కలగనుంది.

పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి:పెండెం రాజు టీఎస్‌యూటిఎఫ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, హనుమకొండ

గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పోస్టులకు మరిన్ని కలుపుతూ కొత్తగా ప్రకటన వెలువరించడం హర్షణీయం. ఇప్పటికే బడుల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు నష్టపోయారు. ఈ డీఎస్సీ ద్వారా ఆ కొరత తీరబోతుంది. మారుమూల ప్రాంతాల్లో పోస్టులను భర్తీ చేయాలి. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి కాలయాపన చేయకుండా పోస్టింగ్‌లు ఇవ్వాలి. ప్రస్తుత ఉపాధ్యాయులకు వేసవిలో బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని