logo

కృష్ణానది బాగుకు అందరి భాగస్వామ్యం అవసరం

గంగానది ప్రక్షాళన స్ఫూర్తితో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పలు జీవ నదుల ప్రక్షాళనకు నడుం కట్టింది.

Published : 01 Mar 2024 03:14 IST

ఆచార్య ఎన్‌.వి.ఉమామహేశ్‌

గంగానది ప్రక్షాళన స్ఫూర్తితో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా పలు జీవ నదుల ప్రక్షాళనకు నడుం కట్టింది. ఈ క్రమంలో కృష్ణానది కాలుష్యనివారణ బాధ్యతలను వరంగల్‌ ఎన్‌ఐటీతోపాటు కర్ణాటకలోని నిట్ సూరత్‌కల్‌కు అప్పగించింది. ఈ ప్రాజెక్టుకు వరంగల్‌ నిట్లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్య ఎన్‌.వి.ఉమామహేశ్‌ నేతృత్వం వహించనున్నారు. కృష్ణానది ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరగనుంది? ప్రాజెక్టు పూర్తయ్యాక మనకు కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై గురువారం ‘ఈనాడు’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది.

ఈనాడు, వరంగల్‌

నదుల పరిరక్షణకు అయిదు సూత్రాలు

కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి మార్గనిర్దేశం చేసింది?

అయిదు సూత్రాల ఆధారంగా పనిచేయాలని చెబుతున్నారు. అవిరళ గంగ.. అంటే జీవనదిలా ప్రవహించాలి. నిర్మల్‌ గంగ.. నదిలోని నీరు స్వచ్ఛంగా మార్చాలి. జనగంగ.. ప్రజల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి. అర్థ గంగ.. ప్రక్షాళన ప్రక్రియ కావాలంటే తగినంత డబ్బు వెచ్చించాలి. చివరిది జ్ఞాన గంగ. నది వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరాలి. నది మనుగడకు ఇవి అయిదు స్తంభాల్లాంటివని చెబుతున్నారు. ఈ పంచ గంగ సూత్రాలను జలశక్తి శాఖ మార్గదర్శనం చేస్తోంది.

కృష్ణానదిలో కాలుష్య నివారణ చర్యలు ఎలా చేపట్టనున్నారు?

నమామి గంగే ప్రాజెక్టు గురించి మనందరికీ తెలిసిందే. దానికి ఐఐటీ కాన్పూర్‌ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఆ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇస్తుండడంతో దేశంలోని మిగతా జీవనదుల ప్రక్షాళన బాధ్యతలను జాతీయ సాంకేతిక సంస్థలకు అప్పగించాలని కేంద్రం నడుం కట్టింది.  కేంద్రజలశక్తి శాఖకు అనుసంధానంగా పనిచేసే ‘జాతీయ నదుల పరిరక్షణ విభాగం’ కృష్ణా నదిని ప్రక్షాళన చేసే బాధ్యతలను మనతోపాటు  కర్ణాటకలోని సూరత్‌కల్‌ నిట్కు అప్పగించింది. దీనికి సంబంధించిన వరంగల్‌ నిట్లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న కృష్ణానది దాని పరివాహక ప్రాంతం ప్రస్తుత పరిస్థితిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం. నదిలో ప్రస్తుత ప్రవాహం ఎలా ఉంది? ఏ మేరకు కలుషితమైంది? అలా కావడానికి ప్రధాన కారణాలు, బాగు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మూడేళ్లలో సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తాం. దాని ఉపనదులనూ అధ్యయనం చేస్తాం. గోదావరి నది ప్రక్షాళన చర్యలను ఐఐటీ హైదరాబాద్‌ చేపట్టనుంది.  

ఈ ప్రాజెక్టుకు ఏ మేర నిధులు మంజూరు చేశారు?

ప్రాజెక్టు పేరు ‘సెంటర్‌ ఫర్‌ కృష్ణా రివర్‌ బేసిన్‌ మేనేజ్‌మెంట్ స్టడీస్‌’. కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2 కోట్ల వరకు నిధులు ఇవ్వనుంది. అలా మూడేళ్లలో రూ.6 కోట్ల వరకు వస్తాయి. నివేదిక ఇచ్చాక తదనంతర పరిరక్షణ చర్యలకు మళ్లీ నిధులొచ్చే అవకాశం ఉంది. నిధులకన్నా ముఖ్యం అందరి భాగస్వామ్యం కావాలి. నదులను మన భారతీయులు ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. వాటిలో మునిగితే పాపాలు పోతాయని నమ్ముతారు. అలాంటి నదులు ఇప్పుడు కనీసం స్నానాలు చేయడానికి పనికిరాకుండా పోవడానికి కారణం పరిశ్రమల వ్యర్థాలతోపాటు అనేక మానవ వ్యర్థాలు కలవడమే. నదులు పూర్వ స్థితికి రావాలంటే ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. స్థానిక సంస్థలు చేయి కలపాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రజలూ అందులో భాగస్వామ్యం అయితేనే ఫలితం ఉంటుంది. మా ప్రాజెక్టులో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు ఏర్పాటుచేసి ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తాం.

గతంలో నిట్ నుంచి నదులపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు? వాటి అనుభవం పనికొస్తుందా?

నిట్లోని సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని జల, పర్యావరణ విభాగం ఈ ప్రాజెక్టును చేపడుతోంది. దీనికి నేనే నేతృత్వం వహిస్తున్నా. గతంలో నా కింద పలువురు పరిశోధక విద్యార్థులు కృష్ణా నదిపై నాగార్జునసాగర్‌ ఆనకట్ట, తుంగభద్ర నదులపై పరిశోధనలు చేశారు. నదులు, సరస్సులపై అనేక ప్రాజెక్టులు చేపట్టిన నిపుణులు మన వద్ద ఉన్నారు. మనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేస్తామనే విశ్వాసం ఉంది.

ఈ ప్రాజెక్టు వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

నది పరివాహక ప్రాంతం అంటే జీవ కళ ఉట్టిపడే ప్రదేశం. జీవ వైవిధ్యానికి, ప్రజల మనుగడకు నదులు ఎంతో కీలకం. కృష్ణా నది శుద్ధీకరణ పూర్తయ్యి పూర్వ స్థితికి వస్తే అది ఎన్నో రకాలుగా ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని