logo

నేడు మేడిగడ్డకు భారాస శ్రేణులు

 కాళేశ్వరం ప్రాజెక్టు లోపాల పుట్ట అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష భారాస శ్రేణులు శుక్రవారం చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టాయి.

Published : 01 Mar 2024 03:15 IST

సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా భారాస నేతలు

మహదేవపూర్‌, కాళేశ్వరం న్యూస్‌టుడే:  కాళేశ్వరం ప్రాజెక్టు లోపాల పుట్ట అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష భారాస శ్రేణులు శుక్రవారం చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని చేపట్టాయి. భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, భారాస ముఖ్య నేతలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. 200 మంది భారాస శ్రేణులు తరలిరానున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయమే తెలంగాణ భవన్‌ నుంచి బయలుదేరుతారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు.  తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అన్నారం బ్యారేజీని సందర్శిస్తారు. అనంతరం అన్నారం బ్యారేజీ వ్యూపాయింట్‌ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. వీడియో ప్రదర్శన కూడా ఉండే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొడతాం...

తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఆరోపించారు. చలో మేడిగడ్డ నేపథ్యంలో బ్యారేజీ వద్ద ఏర్పాట్లను వారిద్దరు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీలోని 85 గేట్లలో ఒక 20వ పిల్లర్‌ కుంగిపోతే, మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ నుంచి సుమారు ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్లిపోతుందని చెప్పారు. తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని భారాస అధినేత కేసీఆర్‌ నిర్ణయించారని తెలిపారు. ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రపంచానికి, తెలంగాణ సమాజానికి తెలయపర్చాలని క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కుట్ర బుద్ధి ప్రపంచానికి చెప్పడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఏ ప్రాంతంలో నాయకులు పరిశీలించాలో, తగిన ఏర్పాట్లపై నాయకులకు పలు సూచనలు చేశారు.

చలో మేడిగడ్డను జయప్రదం చేయాలి

హనుమకొండ కలెక్టరేట్‌: కాళేశ్వరంపై కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి, ప్రజలకు వాస్తవాలు వివరించడానికి శుక్రవారం చలో మేడిగడ్డ కార్యక్రమానికి భారాస పిలుపునిచ్చిందని, దీన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. గురువారం ఆయన హనుమకొండలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, జడ్పీ ఛైర్మన్లు, డీసీసీబీ ఛైర్మన్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఉమ్మడి వరంగల్‌ జిల్లా జనగామ నుంచి ప్రారంభమై, స్టేషన్‌ ఘన్‌పూర్‌, వరంగల్‌ బైపాస్‌, గుడెప్పాడ్‌, పరకాల, భూపాలపల్లి మీదుగా కొనసాగుతుందని చెప్పారు. దారి పొడవునా భద్రతా ఏర్పాట్లు చేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. తెలిసీ తెలియక మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని అర్థమయ్యేలా సజీవంగా చూపెడతామన్నారు. కార్యక్రమంలో శానమండలి డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, మాజీ స్పీకర్‌ మధుసూద]నాచారి, మాజీ మంత్రి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని