logo

Warangal: నేను మేడారం.. నన్ను బాగు చేయండి

అందరికీ శుభోదయం. నేనండి మీ మేడారాన్ని. తల్లులకు నెలవై... అన్ని వర్గాలకు కొలువై...కోటిన్నర మందిని అక్కున చేర్చుకున్నా. నా చెంత విధులు నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అమ్మల దర్శనానికి వచ్చిన ప్రముఖులతో పాటు భక్త జనానికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డా.

Updated : 02 Mar 2024 08:39 IST

అందరికీ శుభోదయం. నేనండి మీ మేడారాన్ని. తల్లులకు నెలవై... అన్ని వర్గాలకు కొలువై...కోటిన్నర మందిని అక్కున చేర్చుకున్నా. నా చెంత విధులు నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అమ్మల దర్శనానికి వచ్చిన ప్రముఖులతో పాటు భక్త జనానికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డా. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, హెలికాప్టర్లు, కాలినడకన... ఇలా ఎవరెలా చేరుకున్నా అందరినీ మళ్లీ సురక్షితంగా ఇళ్లకు పంపా. మహాజాతర అంగరంగ వైభవంగా జరిగింది. గత బుధవారం తిరుగువారం పండగతో జాతర ముగిసింది. అలాగని నన్ను ఇప్పుడు అనాథను చేయకండి. ఇప్పుడు నన్నే నమ్ముకుని ఉంటున్న గ్రామస్థుల బాగోగులు చూసుకోవాల్సిన గురుతర బాధ్యత నాపై ఉంది. ఇందుకు అధికార గణం, స్వచ్ఛంద సంస్థల సహకారం కావాలి. తిరుగువారం ముగిసినందున నాలుగు మాటలు చెబుదామని మీ ముందుకు వచ్చాను. నా సూచనలు, సలహాలు పాటిస్తూ నన్ను బాగు చేస్తారని ఆశిస్తున్నా...  

బాధ్యతగా పరిసరాలు శుభ్రం  

కోటిన్నర మంది వచ్చి పోయిన చోట మురుగు కాలువల స్వరూపం ఎలాగుంటుందనేది ఊహించండి. చెత్తా చెదారం పేరుకుపోయింది. కొన్ని చోట్ల దుర్వాసన వస్తోంది. దోమల బెడద అధికమైంది. నా ప్రజలు తీవ్ర మనోవేదనతో ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ నాదొక్కటే విన్నపం.. పరిసరాలు శుభ్రం చేయండి.  జాతరకు ముందు ఎలా ఉందో...ఇప్పుడలా తయారు చేయండి.

జంపన్న వాగును చూడండి

జంపన్న వాగులో లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. జలకాలాటలాడారు. పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. బాగు చేయండి. భవిష్యత్తు తరాలను నేను సమాధాన పరచాలి. ఇందుకు మీ తోడ్పాటు తప్పనిసరి

ఇంటింటా వైద్య పరీక్షలు తప్పనిసరి

జాతరప్పుడు ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి నడిపారు. పరిసరాల్లో వైద్య శిబిరాలు నెలకొల్పారు. ఆపదలో ఉన్న వారికి అత్యవసర చికిత్స అందించారు. ఇప్పుడిక ఎల్లవేళలా నా దగ్గర ఉండే ప్రజల అవసరాలు చూడాలి. ముందుగా అందరిని ఆరోగ్యవంతులు చేయాలి. ఇంటింటా వైద్య పరీక్షలు జరిపి అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేస్తే ఇది సాధ్యమవుతుంది. గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా శిబిరాలు నిర్వహించండి.

ప్లాస్టిక్‌తోనూ ముప్పుంది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా వస్త్ర సంచులు వినియోగించిన వారికి రుణ పడి ఉంటా. ప్లాస్టిక్‌తో పొంచి ఉన్న ముప్పు గురించి మీకు తెలియంది కాదు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎక్కడ ప్లాస్టిక్‌ ఉన్నా తొలగించండి. మీరు మేల్కొంటే అందరికి మంచి చేసిన వారవుతారు.

క‘న్నీటి’ కష్టాలు తొలగించండి

జాతర సమయంలో నీటి కోసం భక్తులు ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలం ఇంకి నీటికి కొరత ఏర్పడింది. ఇంకొన్ని ప్రదేశాల్లో నీరు వృథాగా పోయింది. ఇప్పుడు వేసవిలో అడుగు పెట్టాం. నా ప్రజల క‘న్నీటి’ కష్టాలు తొలగించండి. ఎక్కడైనా లీకేజీలుంటే నివారించండి. నీటి సరఫరా జరగని ప్రాంతాలుంటే గుర్తించండి. దాహార్తికి తోడు గ్రామస్థుల అవసరాలకు సరిపడే నీరు ఉండేలా చూడండి

ఆ తల్లుల దీవెనలు ఎప్పటికీ మీకు ఉండాలని కోరుకుంటూ..
మీ మేడారం.. 
న్యూస్‌టుడే, డోర్నకల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని