logo

అతివలూ.. కాస్త శ్రమిస్తే ఆరోగ్యమస్తు

మగవారితో పోలిస్తే ఆడవారు తక్కువ సమయం వ్యాయామం చేసినా దీర్ఘకాలిక లాభాలు ఉంటాయట.. అమెరికాలో ఇటీవల తేలిన సర్వే సత్యమిది.

Updated : 03 Mar 2024 08:19 IST

మగవారితో పోలిస్తే ఆడవారు తక్కువ సమయం వ్యాయామం చేసినా దీర్ఘకాలిక లాభాలు ఉంటాయట.. అమెరికాలో ఇటీవల తేలిన సర్వే సత్యమిది.. కాలిఫోర్నియాలోని స్మిట్హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్ 1997 నుంచి 2019 వరకు ఏకంగా 4 లక్షల మందిని అధ్యయనం చేసి చెప్పిన సంగతి ఇది. మహిళలు తరచూ కొద్దిసేపు వ్యాయామం చేసినా మరణ ముప్పు 24 శాతం తగ్గుతుందట. ఇదే ఫలితం మగవారు పొందడానికి చాలా ఎక్కువ శ్రమించాలట. మరెందుకు ఆలస్యం..? అతివలు తమ ఆరోగ్యంపై శ్రద్ధపెడితే సత్ఫలితాలు సాధ్యమవుతాయి. -ఈనాడు, వరంగల్‌

మహిళలు ఇంటిల్లిపాది బాగోగులను చూసుకుంటారు. అమ్మగా, భార్యగా, బిడ్డగా అనేక పాత్రల్లో కుటుంబానికి ఎన్నో విధాలుగా తోడునీడలా నిలుస్తున్నారు. ఇంటి, వంట పనులు చేసుకుంటూనే కంగారుగా కార్యాలయానికి వెళ్లి పనిచేస్తారు. మళ్లీ ఇంటికొచ్చి విశ్రాంతి లేకుండా పనుల్లో నిమగ్నమవుతారు. తమ ఆరోగ్యంపై శ్రద్ధలేకుండా ఇలాంటి జీవనశైలితో గడిపితే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఉరుకుల పరుగుల జీవనంలో ఆరోగ్యం కోసం కొంతలో కొంత సమయాన్ని కేటాయించుకోవడం చాలా ముఖ్యం.

 చిన్న కసరత్తులైనా సరే..

 ప్రతి రోజూ వ్యాయామశాలకు వెళ్లి భారీ కసరత్తులు చేయడం సాధ్యం కాకపోవచ్చు.. అదెంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే మహిళలు రోజుకు కనీసం ఓ అరగంటయినా నడిస్తే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఓరుగల్లు నగరంతోపాటు పరకాల, నర్సంపేట, తొర్రూరు, మహబూబాబాద్‌, భూపాలపల్లి ఇలా చిన్న పట్టణాల్లో సైతం వ్యాయామం కోసం ఆయా పురపాలక సంస్థలు ప్రత్యేక పార్కులను తీర్చిదిద్దాయి. ఇక్కడ ఆడవారి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వాకింగ్‌ట్రాక్‌లతోపాటు చిన్నపాటి వ్యాయామాలు చేసేందుకు పరికరాలు అందుబాటులో పెట్టారు. హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌కు ప్రతిరోజూ ఉదయం పెద్దసంఖ్యలో మహిళలు వచ్చి కనీసం అరగంట కసరత్తులు చేసి వెళ్తున్నారు. కొద్ది సేపైనా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటామని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు దరిచేరవని సంధ్య అనే మహిళ వివరించారు.


ప్రతి రోజూ వ్యాయామం
- మానస, పస్రా, ములుగు జిల్లా

వ్యాయామం నా దినచర్యలో భాగంగా చేస్తా.. ప్రతి రోజూ కొంత సేపు నడక, కనీసం 45 నిముషాల పాటు చిన్నచిన్న కసరత్తులు చేయడంతో ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. శరీరం దృఢంగా ఉంటుంది. అలసట తెలియదు.  


అవగాహన అవసరం
- డాక్టర్‌ బి.విజయలక్ష్మి, గైనకాలజిస్టు, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి

ఆడవారు ఆరోగ్యంపై కచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. అమ్మాయిలు కౌమార దశకు వచ్చినప్పటి నుంచి పలు రకాల సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంది. ప్రధాన సమస్య రక్తహీనత.. హార్మోన్ల అసమతుల్యతతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్‌ డిజార్డర్‌, మధుమేహం, రక్తపోటు లాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలి. గ్రామాల్లో మహిళలకు వచ్చే రుగ్మతలపై వారికి అవగాహన చాలా తక్కువ.. ప్రతి ఆరు నెలల నుంచి ఏడాదికోసారి రక్తపరీక్షలు చేసుకొని అవసరమైన మందులు వాడుకోవాలి. సర్వైకల్‌ క్యాన్సర్‌ కూడా ఇటీవల ఎక్కువ మందిలో కనిపిస్తోంది. రిస్క్‌ను బట్టి కనీసం మూడేళ్లకోసారి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. అన్ని రకాల సమతుల ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.


సమయపాలన ఉండాలి

  •  అల్పాహారం - ఉదయం 8  గంటలకు (గుడ్డు, పాలు, మొలకొచ్చిన ధాన్యాలు)
  • భోజనం - మధ్యాహ్నం - 1.30 గంటలకు (తగిన మోతాదులో అన్నం, ఎక్కువ కూరగాయలు, పప్పులు, అప్పుడప్పుడు మాంసం, చేపలు)
  •  రాత్రి భోజనం - 8.30 గంటలకు (ఓట్్స, జొన్న, రాగి రొట్టె, ఉడికించిన కూరగాయలు)
  • ఇవి బాగా తినాలి

విటమిన్‌ - సి కలిగిన ఆహార పదార్థాలైన ఆకు కూరలు,  కూరగాయలు,  నిమ్మకాయ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు