logo

TSRTC: ఆర్టీసీలో జీరో టికెట్ల తిర‘కాసు’!

ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది.

Updated : 30 Mar 2024 09:24 IST

హనుమకొండ చౌరస్తా, న్యూస్‌టుడే : ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. అయితే ఈ జీరో టికెట్లు కొట్టడంలో ఆర్టీసీ కండక్టర్లు కొందరు తిరకాసు చూపుతున్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ప్రయాణించే మహిళలకు ఆధార్‌ కార్డు ఉంటే వారికి జీరో టికెట్‌ కొట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుంది. అయితే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో తక్కువ మంది మహిళలు ప్రయాణించినా కొందరు ఎక్కువ టికెట్లు జారీ చేస్తూ.. ఎక్కువ అక్యుపెన్సీ రేషియో చూపిస్తున్నారు.

కారణం ఇదీ..: ఆర్టీసీ సంస్థ కండక్లర్లు, డ్రైవర్లకు ఎక్కువ ఆక్యుపెన్సీ తీసుకురావాలని, ఇంధనాన్ని పొదుపుగా వాడాలని, సంస్థ ఆదాయాన్ని పెంచాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది వరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులు ఆటోలు, జీపుల్లో ఎక్కువగా ప్రయాణించేవారు. ఆర్టీసీ బస్సులు చాలావరకు పలు రూట్లలో ఖాళీగా కనిపించేవి. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమల్లోకి తేవడంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు కిక్కిరిసి పోతున్నారు. ఇదే అదనుగా కొందరు కండక్టర్లు ఎక్కువ టికెట్లు జారీ చేస్తూ లక్ష్యానికి మించి అక్యుపెన్సీ రేషియో చూపుతున్నారు. దీనిద్వారా జీరో టికెట్‌ డబ్బులు చెల్లించే సమయంలో ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఎలాగూ ఉచితమే కదా.. అని కొన్నిచోట్ల కండక్టర్లు ఒకటికి బదులు రెండు టికెట్లు జారీ చేస్తున్నట్లు సమాచారం.


ఇటీవల జరిగిన ఘటనలు కొన్ని..

  • ఇటీవల పరకాల నుంచి చర్లపల్లికి ఆర్టీసీ బస్సులో వెళ్తున్న మహిళా ప్రయాణికురాలికి కండక్టర్‌ ఒక టికెట్‌కు బదులు రెండు జీరో టికెట్లు ఇచ్చారు. నేను ఒక్కదాన్నే కదా.. రెండు ఎందుకంటే.. ఉచితమే కదా.. ఎన్ని ఇస్తే ఏంటి.. మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా.. అంటూ కండక్టర్‌ జవాబిచ్చారు.
  • వరంగల్‌ ఆర్టీసీ రీజియన్‌లోని ఓ డిపోలో కండక్టర్‌ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ అక్యుపెన్సీ కోసం అవసరం లేకున్నా రూ.లక్ష విలువైన జీరో టికెట్లు జారీ చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ కండక్టరును సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.
  • మరో డిపో పరిధిలో ఓ కండక్టర్‌ మహిళా ప్రయాణికులు తక్కువ ఉంటే.. స్టేజీ వచ్చే సమయానికి జీరో టికెట్లు కొట్టి చించి బయట పడేయడం చూసి ప్రయాణికులు ముక్కున వేలేసుకున్నారు.
  • మరికొందరు కండక్టర్లు మహిళా ప్రయాణికులు దిగాల్సిన స్టేజీ కంటే దూరానికి జీరో టికెట్‌ ఇస్తున్నారు. దీనిద్వారా ఎక్కువ ఆదాయం చూపుతున్నారు.

అలా జరగవు..

-జె.శ్రీలత, ఆర్టీసీ ఆర్‌ఎం, వరంగల్‌

మా రీజియన్‌ పరిధిలో ప్రయాణికులు తక్కువ ఉన్నా ఎక్కువ జీరో టికెట్లు జారీ చేయడం జరగదు. అలాంటి అవకాశం లేదు. డిపోల్లో అలాంటివి జరిగితే.. నిఘా పెట్టి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని