logo

ఆదేశాలున్నా.. కోతలు ఆగలే!

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. అవేవీ పట్టించుకోని ప్రైవేటు ఆసుపత్రులు ధనార్జనే ధ్యేయంగా ఎక్కువ మొత్తంలో శస్త్ర చికిత్స ప్రసవాలనే చేపడుతున్నాయి.

Updated : 03 Apr 2024 06:10 IST

భూపాలపల్లి ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవాల వివరాలు పరిశీలిస్తున్న ప్రోగ్రాం అధికారులు

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌: సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచిస్తున్నా.. అవేవీ పట్టించుకోని ప్రైవేటు ఆసుపత్రులు ధనార్జనే ధ్యేయంగా ఎక్కువ మొత్తంలో శస్త్ర చికిత్స ప్రసవాలనే చేపడుతున్నాయి. భవిష్యత్తులో మహిళలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారని తెలిసినా అటువైపే మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2023 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ప్రసవాల లెక్కలను పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 47 వేలకు పైగా ప్రసవాలు జరిగితే అందులో 33 వేలకు పైగా శస్త్రచికిత్సలే ఉన్నాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు 41.04 శాతం ఉండగా సీ సెక్షన్‌ ఆపరేషన్లు 58.95 శాతం ఉంటున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిశీలిస్తే.. 87.12 శాతం సీ సెక్షన్‌ ప్రసవాలు చేస్తుంటే.. కేవలం 12.87 శాతం మాత్రమే సాధారణ కాన్పులు జరుగుతున్నాయి. జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహించి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సాధారణ కాన్పులు చేయడం ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆదేశాలు జారీచేసింది. మొదటి కాన్పు కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగాలని.. ప్రైవేటులో చేస్తే అందుకు తగిన కారణాలను వెల్లడిస్తూ సాధారణ ప్రసవం చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని చెబుతున్నా ప్రైవేటు ఆసుపత్రులు పెడచెవిన పెడుతున్నాయి.


భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయి...
- డాక్టర్‌ శ్రీదేవి, ప్రోగ్రాం అధికారిణి

అవసరం లేకున్నా ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు చేయడంతో మహిళల్లో భవిష్యత్తులో పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆపరేషన్‌ చేసిన ప్రదేశంలో గాయం మానకపోడవం, అనస్థీషియా సమస్యలు, తల్లి కోలుకునే వరకు ఎక్కువ సమయం పట్టడం, మరీ ముఖ్యంగా శస్త్రచికిత్స సమయంలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం జరుగుతుంటాయి. గర్భాశయ ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంటారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సీ సెక్షన్‌ ప్రసవాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం.


అనవసరంగా చేసే ఆసుపత్రులపై చర్యలు
- డాక్టర్‌ మధుసూదన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భూపాలపల్లి

రాష్ట్ర ప్రభుత్వం సాధారణ కాన్పులకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. జనవరిలో హైదరాబాద్‌లో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగిన ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేసే ప్రసవాలపై సదరు ఆసుపత్రులు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. శస్త్రచికిత్స ఆపరేషన్లకు సరైన కారణం లేకుంటే నోటీసు అందిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని