logo

భారాసను వీడటం బాధగా ఉంది..

భారాస పార్టీని వీడినందుకు బాధగా ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీలో తనకు మాజీ సీఎం కేసీఆర్‌ అనేక అవకాశాలు కల్పించారని చెబుతూ..

Updated : 03 Apr 2024 06:09 IST

మాట్లాడుతున్న కడియం శ్రీహరి, చిత్రంలో వరంగల్‌ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: భారాస పార్టీని వీడినందుకు బాధగా ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీలో తనకు మాజీ సీఎం కేసీఆర్‌ అనేక అవకాశాలు కల్పించారని చెబుతూ.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హనుమకొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుమార్తె, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్యతో కలిసి మాట్లాడారు. అనేక మంది నేతలు పార్టీలు మారినా వారిపై స్పందించకుండా.. నిన్నటి వరకు తనతో ఉన్నవారు దిగజారి మాట్లాడం సరికాదన్నారు. మాజీ మంత్రి దయాకర్‌రావు తన సొంత నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో అభివృద్ధి చేసి..  మనుమరాలు వయసున్న యశస్వినీరెడ్డిపై ఓడిపోవడం సిగ్గుచేటన్నారు. రాజకీయంగా తనకు ఇవి చివరి ఎన్నికలని చెప్పారు. ఏఐసీసీ, పీసీసీ నాయకుల ఆహ్వానం మేరకే తాను పార్టీలో చేరానని పేర్కొన్నారు. గత పదేళ్లుగా భాజపా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను సీబీఐ, ఈడీ సంస్థలను ఉపయోగించుకొని కూలదొస్తున్నారని ధ్వజమెత్తారు.  

పల్లాతోనే భారాసకు ఈ దుస్థితి..: కేసీఆర్‌, భారాస పార్టీ ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం పల్లా రాజేశ్వర్‌రెడ్డి అని కడియం ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలను పల్లా ఆధారాలతో బయటపెట్టాలని, లేదంటే జనగామ చౌరస్తాలో ఆయన్ను నిలబెడతామని హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.  డా.కడియం కావ్య మాట్లాడుతూ.. తనకు వరంగల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి అవకాశం కల్పించిన కాంగ్రెస్‌ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. తండ్రిపేరు నిలబెట్టే విధంగా పని చేస్తానని, ఓటర్లు నిండు మనస్సుతో ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని