logo

లెక్కకు మించి హాకర్లు.. అడ్డగోలు అమ్మకాలు!

కాజీపేట రైల్వే స్టేషన్‌లో అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి వందల సంఖ్యలో హాకర్లతో అమ్మకాలు సాగిస్తూ రైళ్లలోనూ, రైల్వే స్టేషన్‌లోనూ ప్రయాణికులను ఇబ్బంది కలిగిస్తున్నారు.

Updated : 03 Apr 2024 06:08 IST

కాజీపేట రైల్వే స్టేషన్‌లో అధిక ధరలకు నాసిరకం ఆహారం
న్యూస్‌టుడే కాజీపేట

కాజీపేట రైల్వే స్టేషన్‌లో అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి వందల సంఖ్యలో హాకర్లతో అమ్మకాలు సాగిస్తూ రైళ్లలోనూ, రైల్వే స్టేషన్‌లోనూ ప్రయాణికులను ఇబ్బంది కలిగిస్తున్నారు. ఎక్కువ ధరలకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారు. స్టేషన్‌లో కాకుండా బయట వంటలు చేయించడం వల్ల పర్యవేక్షణ లోపిస్తోంది. ఈ అంశంపై ఆన్‌లైన్‌లో రైల్వేకు అనేక ఫిర్యాదులు అందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇదేమని అడిగితే అంతే..

రైళ్లలోనూ, రైల్వే స్టేషన్‌లో హాకర్లు రాజ్యమేలుతున్నారు. వారి పెట్టిందే ధర, ఇచ్చిందే ఆహారం. ఇదేమిటంటే చాలు మీద పడిపోతారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు చెందిన హాకర్లు వచ్చి భయానక వాతావరణం సృష్టిస్తారు. స్టేషన్లలో అమ్మకాలు చేసే వ్యక్తికి రైల్వే ఇచ్చిన గుర్తింపుతో పాటు హెల్త్‌కార్డు ఉండాలి. రైల్వే ఆసుపత్రికి వెళ్లి అక్కడ వైద్యులతో పరీక్షలు చేయించుకుని వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. చాలా మందికి ఇలాంటి పత్రాలు లేవు. వీరిని నియంత్రించాల్సిన ఆర్పీఎఫ్‌, జీఆర్‌పీ పోలీసులు పట్టించుకోవడం లేదు.

నిబంధనలకు విరుద్ధంగా స్టాళ్లు..

స్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా స్టాల్స్‌ నిర్మాణం జరిగినా, ప్రయాణికులకు అడ్డుగా ఉన్నా పట్టింపు ఉండదు. రైల్వే నిబంధనల ప్రకారం 10శ్రీ6 ఫీట్ల సైజులో మాత్రమే స్టాల్స్‌ నిర్మాణం జరగాలి. ఈ నిబంధన పాటించడంలేదు. రెండు నెలల కిందట డివిజనల్‌ రైల్వే మేనేజర్‌కు అనుమానం కలిగి రెండు స్టాళ్లను దగ్గరుండి కొలిపిస్తే ఎక్కువగా ఉన్నట్లు రుజువు కావడంతో సదరు గుత్తేదారు లీజును రద్దు చేశారు. ఇంకా ఇలాంటి స్టాళ్లు ప్లాటుఫారం మీద ఉన్నాయి.

అపరిశుభ్రంగా వంట గదులు..

కాజీపేట రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం అమ్మే వంటకాలన్నీ కాజీపేటలోని వివిధ ప్రాంతాల్లో వండుకుని వస్తున్నారు. ప్రస్తుతం ఐదు చోట్ల ఇలాంటి వంటగదులు ఉన్నాయి. ఇవన్నీ అపరిశుభ్ర వాతావరణంలో ఉంటాయి. వంట గదులను ఎప్పటికప్పుడు రైల్వే కమర్షియల్‌ అధికారులు తనిఖీ చేయాలి.. వారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.  ఈ విషయాలపై అధికారులను వివరణ కోరగా స్పందించలేదు.


లీజుల మీద లీజులు..

కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఒకటో నెంబరు ప్లాటుఫారం మీద గల ఒక స్టాల్‌ను దక్షిణ మధ్య రైల్వేలో బడా కంపెనీగా పేరున్న సంస్థ దక్కించుకుని మరో వ్యక్తికి లీజుకు ఇచ్చింది. దీన్ని సబ్‌లీజు తీసుకున్న వ్యక్తి రోజుకు రూ.9 వేలు ఆ సంస్థకు చెల్లించాలి. సబ్‌లీజుదారు  సమోస, నీరు, తేనీరు.. ఇలా అన్ని రకాల అమ్మకాలను వేర్వేరుగా చేసి మరల లీజుకు ఇచ్చారు. సమోస, తేనీరు, తాగునీరు అమ్మేవారు రోజుకు రూ.3 వేలు, ఆలుబిర్యానీ, ఇతర టిఫిన్లు అమ్మేవారు రూ.5 వేలు ఆయనకు చెల్లించాలి. ఈ స్టాల్‌కు కేవలం ఏడుగురు హాకర్లు అమ్ముకోవడానికి మాత్రమే స్టేషన్‌లో అనుమతి ఉంది.. అలాంటిది 120 మందితో అమ్మకాలు చేయిస్తున్నారని తెలుస్తోంది.

ఇతర స్టాల్స్‌ వారు కూడా నిబంధనలు పక్కన పెట్టి వారికి ఇచ్చిన అనుమతి కంటే ఎక్కువ మంది హాకర్‌లతో అమ్మకాలు చేస్తున్నారు. వీరు ప్రతి రోజు రూ.వేలల్లో లీజుదారులకు డబ్బులు చెల్లించాల్సి రావడంలో ఎక్కువ ధరకు నాసిరకం అమ్మకాలు చేస్తున్నారు. సమోస రూ.10కి మాత్రమే అమ్మాలి.. రెండింటిని రూ.30కి విక్రయిస్తున్నారు. నీటి సీసా ధర రూ.15.. కానీ తప్పనిసరిగా రూ.20 తీసుకుంటున్నారు.  ఇలా శీతల పానీయాలు, బిస్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని