logo

వసంతోత్సవం వచ్చేసింది..!

వరంగల్‌ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వసంతోత్సవానికి వేళైంది. స్ప్రింగ్‌స్ప్రీ - 24ను ఏప్రిల్‌ 5 నుంచి 7 వరకు మూడురోజుల పాటు కోలాహలంగా జరిపేందుకు నిట్ యాజమాన్యం సిద్ధమైంది.

Updated : 03 Apr 2024 06:12 IST

5 నుంచి 7 వరకు నిట్లో స్ప్రింగ్‌స్ప్రీ
ఈనాడు, వరంగల్‌, నిట్క్యాంపస్‌, న్యూస్‌టుడే

వరంగల్‌ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వసంతోత్సవానికి వేళైంది. స్ప్రింగ్‌స్ప్రీ - 24ను ఏప్రిల్‌ 5 నుంచి 7 వరకు మూడురోజుల పాటు కోలాహలంగా జరిపేందుకు నిట్ యాజమాన్యం సిద్ధమైంది.

యానిమేషన్‌ ఆధారంగా థీమ్‌.. రాసెంగన్‌

ఈసారి వేడుకల థీమ్‌గా విద్యార్థులు ‘రాసెంగన్‌’ను ఎంపిక చేశారు. జపనీస్‌ యానిమేషన్‌లోని ‘నరుటో’ అనే క్యారెక్టర్‌ వద్ద ఉండే మహిమగల ఓ బంతిని రాసెంగన్‌ అంటారు. ఇది ఎన్నో అద్భుతాలు సృష్టించగలదు. అలా ఈ వేడుకల్లో విద్యార్థులు కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతాలు చేస్తారని చెప్పేందుకు ఈ థీమ్‌ను ఎంపిక చేశారు.

బోలెడు ఈవెంట్లు

వేడుకల్లో మూడు రోజుల పాటు విద్యార్థులు అనేక ఈవెంట్లలో మునిగితేలనున్నారు.

  • అల్యూర్‌ పేరుతో నిర్వహించే ఫ్యాషన్‌ ప్రదర్శనలో విద్యార్థినీ విద్యార్థులు ర్యాంప్‌ వాక్‌ చేస్తూ సరికొత్త హొయలతో మెరవనున్నారు.
  • నిట్లో అనేక రకాల క్లబ్‌లు ఉన్నాయి. ఫిల్మ్‌ క్లబ్‌ వాళ్లు ‘పోస్టర్‌ రిక్రియేషన్‌’ పోటీలను నిర్వహించనున్నారు.
  • క్విజ్‌ పోటీలను నిర్వహించేందుకు ‘క్యూ ఫ్యాక్టర్‌’ ద్వారా బోలెడు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబడుతారు.  
  • ఈసారి సరికొత్తగా ‘రోర్‌ రీల్‌ రీవోల్ట్‌’ పోటీని నిర్వహిస్తున్నారు. డ్యాన్స్‌, డ్రామా క్లబ్‌ వారు నిర్వహించే ఇది ఆన్‌లైన్‌ పోటీ. ఇందులో మెప్పించే రీల్స్‌ చేసి విజేతలుగా నిలిచినవారికి రూ.10 వేల నగదు బహుమతి ఉంటుంది.  
  • ఫేస్‌ పెయింటింగ్స్‌ కాంపిటీషన్‌ నిర్వహిస్తారు. కుండలు చేసే కళను విద్యార్థులు నేర్చుకుంటారు. రకరకాల హర్రర్‌ గేమ్స్‌ అలరిస్తాయి. అనేక రకాల వంటకాలతో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయడంతో కావాల్సిన రుచులను ఆరగించవచ్చు.

గాయకులు హరిచరణ్‌, నకాశ్‌ ప్రదర్శనలు

ఈసారి వేడుకల్లో ప్రముఖ గాయకుల ప్రదర్శనలు అలరించనున్నాయి. వేడుకల మొదటి రోజే ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు హరిచరణ్‌ శేషాద్రి, ‘చౌరస్తా’ బ్యాండ్‌తో కలిసి తన పాటలతో ఉర్రూతలూగించనున్నారు. ఆయన తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో వేలాది పాటలు పాడారు. 6వ తేదీన ఏఆర్‌ రహమాన్‌తో కలిసి పనిచేసిన ప్రముఖ పాప్‌ గాయకుడు నకాశ్‌ అజీజ్‌ తన ప్రదర్శనతో అలరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని