logo

శుద్ధ జలం.. అంతా అబద్ధం!

నగరంలో గల్లీకొక వాటర్‌ ప్లాంటు ఉంది. శుద్ధజలం(ప్యూరీఫైడ్‌) నీళ్ల వ్యాపారం ‘మూడు పువ్వులు- ఆరు కాయలు’గా సాగుతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే.. యథేచ్ఛగా ప్లాంట్లు నిర్వహిస్తున్నారు.

Updated : 03 Apr 2024 06:08 IST

నిబంధనలు పాటించని ప్లాంట్ల నిర్వాహకులు
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

నగరంలో గల్లీకొక వాటర్‌ ప్లాంటు ఉంది. శుద్ధజలం(ప్యూరీఫైడ్‌) నీళ్ల వ్యాపారం ‘మూడు పువ్వులు- ఆరు కాయలు’గా సాగుతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే.. యథేచ్ఛగా ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. ఏ వాడలో చూసినా వాటర్‌ ప్లాంట్ల దందా నడుస్తోంది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెర్డ్‌(బీఐఎస్‌) అనుమతులు, గ్రేటర్‌ వరంగల్‌ నుంచి ట్రేడ్‌ లైసెన్సులు పొందకుండా, జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అనుమతి లేకుండానే నీళ్ల వ్యాపారం సాగిస్తున్నారు. నగరంలోని 66 డివిజన్లలో సుమారు 1000 పైగా శుద్ధజలం ప్లాంట్లు నడుస్తున్నాయి. కేవలం 3-4 ప్లాంట్లకు మాత్రమే బీఐఎస్‌ అనుమతులున్నాయి. మిగిలినవన్నీ అనధికారికంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్‌, జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖల మధ్య  సమన్వయలోపం వారికి కలిసొస్తుంది.

వరంగల్‌ రామన్నపేటలో మురుగు కాలువ పక్కనే నీటి డబ్బాలు

సాధారణ డబ్బా రూ.10, చల్లనిది రూ.25

  • వాటర్‌ ప్లాంట్లలో శుద్ధజలం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని సామాజిక కార్యకర్తలంటున్నారు. కొందరు యజమానులు మినరల్‌ వాటర్‌ పేరుతో అమ్మకాలు సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మంచినీళ్ల వ్యాపారం నడుస్తుంటే ప్రభుత్వశాఖల అధికారులు పట్టించుకోవడం లేదు.
  • వీధికొక వాటర్‌ ప్లాంటు నడుస్తుంది. ప్రాంతాలను బట్టి ధర నిర్ణయిస్తున్నారు. సాధారణ(నార్మల్‌ వాటర్‌ క్యాన్‌) డబ్బా రూ.10, చల్లని నీళ్లడబ్బా(కూల్‌ క్యాన్‌) రూ.25 చొప్పున అమ్ముతున్నారు. పేదల బస్తీలు, విలీన గ్రామాల్లో కొందరు సాధారణ డబ్బాను రూ.5కే నింపుతున్నారు.

రోజూ 3-4 వేల డబ్బాలు..

  • గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో వెయ్యికి పైగా శుద్ధజలం ప్లాంట్లు కొనసాగుతున్నాయి. సాధారణ రోజుల్లో ప్రతి రోజూ 3-4 వేల డబ్బాలు అమ్ముతున్నారు. ః పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయాల్లో రోజుకి 6 వేల వరకు క్యాన్ల వినియోగం జరుగుతోంది.
  • మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో రోజుకు 5-6 వేలు అమ్ముడవుతున్నాయి.

ఉండాల్సింది ఇలా..

  • నిబంధనల ప్రకారం ప్రతి ప్లాంటుకు బీఐఎస్‌ ధ్రువపత్రం ఉండాలి. ట్రేడ్‌ లైసెన్సు, ఫుడ్‌ లైసెన్సు తప్పనిసరి. 10-20 ప్లాంట్లు మినహా మిగిలిన చోట్ల కనీస నిబంధనలు పాటించడం లేదు.
  • నీళ్ల నాణ్యతా ప్రమాణాలు పరిశీలించేందుకు ల్యాబ్‌, పరీక్షలు చేసేందుకు రసాయనాలు ఉండాలి.
  • స్టీల్‌ డ్రమ్ములు, అంతర్గత పైపులైన్లు, ఏసీలు తప్పనిసరి. పరిశుభ్రత పాటించాలి.
  • క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 3-4 ప్లాంట్లకే బీఐఎస్‌ అనుమతి ఉంది. కొందరు వ్యాపారులు అర్హత లేకున్నా.. బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు.
  • మురుగు కాలువల పక్కన, చెత్తాచెదారం దగ్గరే డబ్బాలు ఉంచుతున్నారు. స్టీల్‌ డ్రమ్ములు సరిగా శుభ్రం చేయడం లేదు. వ్యాపారులు, పనిచేసే సిబ్బంది అంతర్గత పరిశుభ్రత పాటించడం లేదు.

కనిపించని టీడీఎస్‌ పరికరాలు..

ఇక్కడ కనిపిస్తున్న వాటర్‌ ప్లాంట్‌ వరంగల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి కాశీబుగ్గకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉంది. ప్రతిరోజూ వేల లీటర్ల నీటిని శుద్ధజలం పేరుతో విక్రయిస్తున్నా.. అందులో ఖనిజాలు, లవణాలు, లోహాలను పరీక్షించే టీడీఎస్‌(టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) స్థాయిలను తెలుసుకునేందుకు ‘న్యూస్‌టుడే’ ప్రయత్నించగా.. నిర్వాహకులు అంగీకరించలేదు. అసలు వారి వద్ద టీడీఎస్‌ పరీక్షించే పరికరాలే లేకపోవడం గమనార్హం. నీటిలో 50 నుంచి 200లోపు టీడీఎస్‌ ఉన్న నీటిని తాగడమే ఆరోగ్యానికి మంచిది. అంతకన్నా మించితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గిర్మాజీపేట, న్యూస్‌టుడే


నోటీసులు ఇస్తాం
- డాక్టర్‌ రాజేష్‌, సీఎంహెచ్‌ఓ గ్రేటర్‌ వరంగల్‌

నగర పరిధిలో అనధికారికంగా నడుస్తున్న శుద్ధజలం ప్లాంట్లకు నోటీసులు జారీ చేస్తాం. కేవలం 3-4 ప్లాంట్లకే బీఐఎస్‌ అనుమతులున్నాయి. నగరంలో డివిజన్ల వారీగా సర్వే చేయించి, తగిన చర్యలు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని