logo

ఓటరు జాబితాలో మీ పేరుందా..?

ఓటరు నమోదు, సవరణలకు ఈనెల 15న గడువు ముగయనుంది. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని, పేర్లలో తప్పులున్న వారు సవరణలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Published : 13 Apr 2024 03:04 IST

ఒక్కసారి సరిచూసుకుంటే మేలు

జాబితాలో పేరు ఉందో లేదో పరిశీలిస్తున్న బీఎల్‌వో రమేష్‌

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ఓటరు నమోదు, సవరణలకు ఈనెల 15న గడువు ముగయనుంది. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని, పేర్లలో తప్పులున్న వారు సవరణలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

భూపాలపల్లి పట్టణంలోని కృష్ణాకాలనీకి చెందిన రాజేందర్‌ సింగరేణి ఉద్యోగి. ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు స్లిప్పు రాలేదు. పదేళ్లుగా ఓటు వేస్తున్నానని ఓటు స్లిప్పు ఎందుకు రాలేదని ఆయన బీఎల్‌వోను ప్రశ్నించగా.. జాబితాలో పేరు లేదని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక వెనుతిరిగారు. జిల్లా కేంద్రంలోని పలు కార్మిక కాలనీల్లో నివాసం ఉంటున్న వేలాది మంది పేర్లు ఓటరు జాబితాల్లో లేవు. ఎన్నికల ముందు ఎన్నికల సంఘం జాబితాలో సవరణలు చేస్తోంది. ఈ మేరకు తమ ఓటు ఉందో లేదో చూసుకొని, లేకపోతే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

అలసత్వం వద్దు..

కొత్తగా ఓటు హక్కు నమోదు, మార్పులు, చేర్పులకు ఈనెల 15వ తేదీ వరకు ఎన్నికల సంఘం గడువు ఇచ్చింది. జిల్లాలోని ఓటర్లందరూ ఒక్కసారి జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలి. నియోజకవర్గాలు, చిరునామాలు మారిన వారు, తప్పులున్న పేర్లను సవరించుకునే అవకాశం ఇప్పుడు కల్పించింది. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం చేసిన అమూల్యమైన ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముంది. స్మార్ట్‌ఫోన్‌లో ఓటరు యాప్‌ ద్వారా ఓటర్ల పేర్లు ఉన్నాయో లేదో చూసుకునే అవకాశం కల్పించింది.

25న తుది జాబితా..

ఈ నెల 15వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులను బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఈ నెల 25న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. అర్హుల పేర్లు అందులో లేకుంటే వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం, బీఎల్‌వోలకు తమ దరఖాస్తులను అందించాలని అధికారులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని