logo

పిట్‌లైన్‌.. నిర్వహణ దారి తప్పింది..!

‘పిట్‌ అంటే గుంత అని అర్థం.. రైలు పట్టాల మధ్య పెద్ద గుంతను ఏర్పాటు చేసి ఆపైన రైలు నిలిచి ఉంటుంది. (ఉదా: కార్‌వాషింగ్‌ పిట్‌) ఇందులో రైళ్ల బ్రేకులు, విద్యుత్తు చక్రాలు, బ్యాటరీ ఇలా అనేక రకాలుగా చెక్‌ చేసి వాటిని సరిచేస్తారు.

Published : 13 Apr 2024 03:07 IST

కాజీపేట రైల్వేలో.. రూ.30 కోట్లు వృథా
న్యూస్‌టుడే, కాజీపేట

కాజీపేటలో గత సంవత్సరం నిర్మించిన 24 కోచ్‌ల పిట్‌లైన్‌

‘పిట్‌ అంటే గుంత అని అర్థం.. రైలు పట్టాల మధ్య పెద్ద గుంతను ఏర్పాటు చేసి ఆపైన రైలు నిలిచి ఉంటుంది. (ఉదా: కార్‌వాషింగ్‌ పిట్‌) ఇందులో రైళ్ల బ్రేకులు, విద్యుత్తు చక్రాలు, బ్యాటరీ ఇలా అనేక రకాలుగా చెక్‌ చేసి వాటిని సరిచేస్తారు. దీంతో పాటు రైలు కోచ్‌లను శుభ్రం చేసి ఓకే సర్టిఫికెట్‌ ఇస్తారు. ఇక్కడే శుభ్రం చేయడం వల్ల కాజీపేట నుంచే రైలు ప్రారంభం కావడానికి అవకాశం ఉంది.’

రైల్వే శాఖ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కాజీపేట డీజిల్‌షెడ్‌ ఏరియాలో 2021లో నిర్మించిన పిట్‌లైన్‌ వృథాగా మారింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల నిర్వహణ, శుభ్రం చేయడానికి రూ.30 కోట్లతో 24 కోచ్‌ల సామర్థ్యం గల రెండు పిట్‌లైన్లను నిర్మించారు. ప్రతి రోజు కనీసం నాలుగు రైళ్ల నిర్వహణ లోపాలను సరిదిద్దే సామర్థ్యం గల ఇందులో కేవలం ఒక్క రైలును మాత్రమే పరిశీలిస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ సామర్థ్యం సంఖ్య పెరిగితే కాజీపేట నుంచి అనేక రైళ్లు ప్రారంభమవుతాయి. 

ఉద్యమాల ఫలితం..

కాజీపేట రైల్వే స్టేషన్‌ను డివిజన్‌ కేంద్రంగా గుర్తించాలంటే ఇక్కడి నుంచి అనేక రైళ్లు ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం వాటి నిర్వహణ సైతం ఇక్కడే జరగాలి. దీంతో పిట్‌లైన్లు నిర్మించాలని స్థానికంగా డిమాండ్‌ వచ్చింది. అనేక సంవత్సరాల పోరాటం ఫలితంగా సికింద్రాబాద్‌ డివిజన్‌లో అతిపెద్ద పిట్‌లైన్లను కాజీపేటలో రూ.30 కోట్లతో నిర్మించారు. దీనిని క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ విభాగం నిర్వహిస్తోంది.

ఒకే ఒక రైలు నిర్వహణ

ప్రస్తుతం రెండు పిట్‌లైన్లలో రోజుకు కనీసం నాలుగు రైళ్ల నిర్వహణ చేపట్టాలి. ఇప్పుడు వారానికి ఒకసారి నడిచే 17013/14 నంబరు గల అడప్సర్‌ రైలును మాత్రమే నిర్వహిస్తున్నారు. పుణె ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాదు, డోర్నకల్‌ పుష్‌పుల్‌ రైళ్లు, రామగిరి ఎక్స్‌ప్రెస్‌లను శుభ్రం చేస్తున్నారు. ఇవి రోజు పిట్‌లైన్‌కు వచ్చి వెళుతుంటాయి. ఇంతకుముందు వారాంతంలో నడిచే తడోబా ఎక్స్‌ప్రెస్‌, ఎల్‌టీటీ, ఆనంద్‌వన్‌ ఎక్స్‌ప్రెస్‌ల నిర్వహణ కాజీపేటలోనే జరిగేది. కొన్ని రోజులు నడిచాక వీటిని రైల్వే శాఖ రద్దు చేసింది. దీంతో ఇప్పుడు పిట్‌లైన్‌ బోసిపోతోంది. 60 మంది ఉద్యోగులు, రెండు అధునాతన పిట్‌లైన్లను రైల్వే శాఖ వినియోగించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

బల్లార్ష పిట్‌లైన్‌ ప్రభావం

మహారాష్ట్రలోని బల్లార్షలో ఇటీవల ఒక పిట్‌లైన్‌ నిర్మించారు. ముంబయి (సెంట్రల్‌ రైల్వే)  నుంచి  దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేటకు గతంలో మూడు రైళ్లు (తడోబా, ఆనంద్‌వన్‌, దాదర్‌) ప్రవేశపెట్టారు. బల్లార్షలో పిట్‌లైన్లు లేని కారణంగా వీటిని కాజీపేట వరకు నడిపించి ఇక్కడ నిర్వహించి తిరిగి బల్లార్ష మీదుగా ముంబయికి నడిపారు. ఇప్పుడు బల్లార్షలో పిట్‌లైన్‌ రావడంతో సెంట్రల్‌ రైల్వే రైళ్లు కాజీపేట వరకు వచ్చే అవకాశం తగ్గింది. ఇటీవల ప్రవేశపెట్టిన ముంబయి కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా బల్లార్షలోనే  నిర్వహించే అవకాశం ఉంది.


జీఎం దృష్టికి తీసుకెళ్లాం

-చింతా మురళి, సంఘ్‌ సీడబ్ల్యూసీ సభ్యుడు

కాజీపేట పిట్‌లైన్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని, క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ విభాగంలో ఉద్యోగుల సంఖ్య పెంచి రైళ్లను ఇక్కడే నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వినతి పత్రం సమర్పించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. చర్లపల్లి టర్మినల్‌ ప్రారంభం తర్వాత అక్కడ నుంచి ప్రారంభమయ్యే రైళ్లను కాజీపేటకు పంపుతామని హామీ ఇచ్చారు.


మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలి

- పి.రవీందర్‌, మజ్దూర్‌ యూనియన్‌ డివిజనల్‌ కార్యదర్శి

కాజీపేటలో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడానికి రైల్వే ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ మరో ప్లాట్‌ఫారం నిర్మాణం జరిగితే పిట్‌లైన్‌లోకి రైళ్లను సులువుగా తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిడి ఉంటే పిట్‌లైన్‌ వినియోగంలోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని