logo

‘స్వార్థ ప్రయోజనాలకే పార్టీ మార్పిడి’

భారాస పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు.

Published : 13 Apr 2024 03:08 IST

మాట్లాడుతున్న రాష్ట్ర మాజీ మంత్రి సత్యవతి రాథోఢ్‌

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: భారాస పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు. దుమ్ముగూడెం మండలం నడికుడిలోని ఓ ఫంక్షన్‌హాలులో మహబూబాబాద్‌ భారాస పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ తాతా మధు, భారాస పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవిత మాట్లాడారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావును నియోజకవర్గ భారాస పార్టీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి గెలిపించారని, చివరకు వారిని నట్టేటముంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని, ఆయన ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు వెనక భారాస పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ వెళ్లలేదని, భారాస నేతలపై ఎమ్మెల్యే లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎమ్మెల్యే సొంత మండలమైన దుమ్ముగూడెంలోనే సమావేశానికి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చాయని పేర్కొన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చి ఆ పథకాలను అమలు చేయడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు రాజకీయ కక్షతోనే భారాస అధినేత కేసీఆర్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భాజపా ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్‌, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్‌ కాలం చెల్లిన నాయకులని గతంలో వీరిద్దరు ఎంపీగా గెలిచినా అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఖమ్మం ఎంపీ సీటును వారి కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు  బాధపడుతున్నారని, ఇప్పటికే కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. సమావేశంలో భారాస పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్‌, మానే రామకృష్ణ, సాగి శ్రీనివాసరాజు, ఎంపీపీ రేసు లక్ష్మి, అన్నె సత్యనారాయణమూర్తి, కణితి రాముడు, ఎండీ.జానీపాషా, కొత్తూరి సీతారామారావు, మూడు మండలాల పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని