logo

ధాన్యం అంచనా.. 1.20 లక్షల మె.ట

అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు కేంద్రాల్లో ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Published : 13 Apr 2024 03:10 IST

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌

ధాన్యం కాంటా వేస్తున్న హమాలీలు (పాతచిత్రం)

అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు కేంద్రాల్లో ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 189 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 1.20 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు అంచనా వేశారు. పీఏసీఎస్‌  164, ఐకేపీ 8, డీసీఎంఎస్‌ 13, జీసీసీ ద్వారా 4 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గతేడాది యాసంగి కొనుగోలుకు సంబంధించి 1.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో 20 లక్షల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. 14 లక్షలు కొత్త సంచులు కాగా 6 లక్షలు పాతవి ఉన్నాయి. సరిపడా టార్పాలిన్లు, ధాన్యం తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ కాంటాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

కొనుగోలు కేంద్రాలకు సంబంధించి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణ సహాయం, సూచనలు, సలహాలు అందించేలా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో 7995050787 నంబరును అందుబాటులో ఉంచారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ నంబర్‌ పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.

కౌలు రైతుల వివరాలు నమోదు

కొనుగోలు కేంద్రాలకు సంబంధించి దళారుల ప్రమేయం లేకుండా నూతనంగా ఐరిస్‌ విధానం అమలు చేయనున్నారు. ధాన్యం విక్రయించే రైతు కొనుగోలు కేంద్రానికి వచ్చి ఐరిస్‌(కనుపాప) గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. గతంలో రైతుల పేరుతో దళారులు ధాన్యం విక్రయించి సొమ్ము చేసుకున్న ఘటనలు ఉన్నాయి. నూతన విధానంలో కౌలు రైతులకు కూడా అవకాశం కల్పించారు. వ్యవసాయశాఖ అధికారులను కలిసి కౌలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే కౌలు రైతుకు ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. దీంతో సంబంధిత రైతు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే అవకాశం కలగనుంది.

ఈ లోపాలను అధిగమించాలి..

  • తేమ, తాలు ధాన్యంపై రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో ధాన్యాన్ని నేరుగా కేంద్రాలకు తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్నారు.
  • విక్రయించిన ధాన్యం డబ్బులను రెండు రోజుల్లో సంబంధిత రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నా అలా చేయడం లేదు.
  • కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యంతో జాప్యం చేయడంతో రైతులకు సకాలంలో నగదు జమ కావడం లేదనే విమర్శలు ఉన్నాయి.
  • సరైన తేమ వచ్చేలా ధాన్యం ఆరబెట్టుకునేందుకు, అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా ఉండేలా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉండటం లేదు.
  • గతంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన తర్వాత కూడా మిల్లర్లు ఏవేవో సాకులు చూపి ఎక్కువ మొత్తంలో తరుగు తీయడంతో రైతులు చాలా నష్టపోయారు.
  • కొనుగోలు చేసిన ధాన్యం సంబంధిత మిల్లులకు తరలించేందుకు సరిపడా లారీలు, ఇతర వాహనాలను సమకూర్చుకోవడంలో విఫలమయ్యారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాం

- రాఘవేందర్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నందున రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు