logo

ప్రమాదాల విస్తరణే..

జాతీయ రహదారి వెంట పలు గ్రామాల్లో సర్వీస్‌ రహదారులు పూర్తయిన వినియోగంలోకి రావడం లేదు. ఆయా గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు జాతీయ రహదారిపైనే నిలుపుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Published : 13 Apr 2024 03:14 IST

న్యూస్‌టుడే, స్టేషన్‌ఘన్‌పూర్‌

ఘన్‌పూర్‌లో జాతీయ రహదారి పక్కన సర్వీస్‌ రోడ్డు వేయకుండా వదిలేసిన రోడ్డు..

జాతీయ రహదారి వెంట పలు గ్రామాల్లో సర్వీస్‌ రహదారులు పూర్తయిన వినియోగంలోకి రావడం లేదు. ఆయా గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు జాతీయ రహదారిపైనే నిలుపుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘన్‌పూర్‌లో వ్యాపారులు సర్వీస్‌ రోడ్లను ఆక్రమిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా యాదాద్రి-వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణ పనులను 2015లో ప్రారంభించారు. ఇందు కోసం జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు-4 పథకం కింద రూ. 1,920 కోట్లు మంజూరు చేశారు. 2016 జూన్‌ 1న అప్పటి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. మంజూరైన నిధులతో రహదారి విస్తరణకు రూ. 897.03 కోట్లు కేటాయించగా, మిగతా 1,022.97 కోట్లు భూసేకరణ, గృహాలు కోల్పోయిన వారికి పరిహారం కోసం కేటాయించారు. ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు చేపట్టింది. యాదాద్రి జిల్లాలో వంగపల్లి నుంచి వరంగల్‌ జిల్లా అరెపల్లి వరకు 99.10 కిలో మీటర్లు 30 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 1 వరకు పనులు పూర్తి చేయాలని గడువు ఇచ్చిన ఇప్పటి వరకు అనేక చోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

నిబంధనల ప్రకారం..

రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గ్రామాలు ఉన్న చోట ప్రజల సౌకర్యార్థం సర్వీస్‌ రోడ్లు వేయాలి. సర్వీస్‌ రోడ్డుకు జాతీయ రహదారికి మధ్యలో ఇనుప కంచెతో రెయిలింగ్‌ ఏర్పాటు చేసి, హైమాస్ట్‌ దీపాలు ఏర్పాటు చేయాలి. ప్రతి గ్రామంలో ప్రయాణికుల కోసం మినీ బస్‌ స్టేజీ ఏర్పాటు చేయాలి.

పెండింగ్‌ పనులు...

స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రాఘవాపూర్‌ నుంచి ఘన్‌పూర్‌ పరిధి ఇందరానగర్‌, చాగల్లు పరిధిలోని శివారెడ్డిపల్లె వద్ద జాతీయ రహదారికి రెండు వైపులా సర్వీస్‌ రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. సర్వీస్‌ రోడ్లు లేక అనేక ప్రమాదాలు జరిగాయి. రాఘవాపూర్‌ వద్ద సర్వీస్‌ రోడ్డు కోసం కంకర పోసి వదిలేశారు. రోడ్డు కోసం గ్రామంలో 100 ఫీట్లు తీసినప్పటికీ  పనులు చేపట్టలేదు. 

  • ఘన్‌పూర్‌ బస్టాండ్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లే దారిలో సర్వీస్‌ రోడ్డు నిరుపయోగంగా ఉంది. బస్టాండ్‌ నుంచి శ్రీవాణి గురుకులం వరకు సర్వీస్‌ రోడ్డు వేయాల్సి ఉన్న సబ్‌స్టేషన్‌ వరకు నిర్మించి వదిలేశారు.
  • చిల్పూర్‌ మండలం చిన్నపెండ్యాలలో రోడ్డు వేసినప్పటికీ హనుమకొండ, జనగామ వైపు సర్వీస్‌ రోడ్డు పక్కన డ్రైనేజీ పూర్తి చేయకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
  • ధర్మసాగర్‌ మండలం కరుణాపురం వద్ద హైమాస్ట్‌ దీపాలు ఏర్పాటు చేయలేదు.

సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయాలి

- బొడ్డు రమేష్‌ రాఘవాపూర్‌

జాతీయ రహదారిని అనుకొని ఉన్న గ్రామాల్లో వెంటనే సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయాలి. అధికారులు స్పందించి తక్షణమే పనులు పూర్తి చేయాలి.


అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా..

- తోట రమేష్‌, సీపీఐ మండల కార్యదర్శి

అధికారుల నిర్లక్ష్యంతోనే పనులు పూర్తి కాలేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో సర్వీస్‌ రహదారులు ఉన్న బస్సులు జాతీయ రహదారిపైనే నిలుపుతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని