logo

పాఠశాలల అభివృద్ధికి రూ.10 కోట్లు

మన ఊరు- మన బడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. భవిష్యత్తులో పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకే ప్రాధాన్యం ఇవ్వనుంది.

Published : 13 Apr 2024 03:15 IST

వెంకటాపూర్‌ మండల కేంద్రంలో స్లాబు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉన్న బాలికల ప్రాథమిక పాఠశాల

ములుగు, న్యూస్‌టుడే: మన ఊరు- మన బడి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. భవిష్యత్తులో పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలన్నింటినీ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకే ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. గత ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాల్లో దశల వారీగా పాఠశాలలను ఎంపిక చేసి పలు అభవృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. వాటిలో కొన్ని పనులు మాత్రమే పూర్తయ్యాయి. చాలా పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు చెల్లించడం లేదని పాఠశాల యాజమాన్య కమిటీలు, గుత్తేదారులు పనులు నిలిపివేశారు. పనులు నిలిచిపోయి సుమారు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఈ లోగా ప్రభుత్వం మారింది. మన ఊరు మన బడి కార్యక్రమాన్ని శాశ్వతంగా తీసేసి స్వయం సహాయక సంఘాల మహిళలతో పాఠశాలలకు అమ్మ ఆదర్శ కమిటీలను వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు.

ఆగిపోయిన పనులూ పూర్తిచేసేలా..

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ములుగు జిల్లాకు రూ.10 కోట్లు కేటాయించింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు కేటాయించారు. నూతనంగా చేపట్టనున్న అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా మన ఊరు మన బడి కార్యక్రమం కింద  చేపట్టి ఆగిపోయిన పనులను కూడా పూర్తి చేసేందుకు నిర్ణయించారు. మే చివరి వారంలోగా ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అధికారులు పనులు గుర్తించారు.

ప్రాధాన్యాల వారీగా నిధులు

పాఠశాలల అభివృద్ధిలో ప్రధానంగా తాగునీరు, చిన్న చిన్న మరమ్మతులు, ఇప్పటికే నిర్మించి వినియోగంలో లేని టాయిలెట్లు, విద్యుత్తు సరఫరా, తదితర పనులు చేపట్టనున్నారు. ఇందులో 306 పాఠశాలల్లో తాగునీటి సరఫరాకు రూ. 3.06 కోట్లు, 130 పాఠశాలల్లో మైనర్‌ రిపేర్ల కోసం రూ.2.60 కోట్లు, ఇప్పటికే నిర్మాణం జరిగి నిరుపయోగంగా ఉన్న 761 టాయిలెట్ల మరమ్మతులకు రూ. 2.66 కోట్లు, 279 పాఠశాలల్లో విద్యుత్తు సౌకర్యం కల్పించేందుకు రూ.69.75 లక్షలు కేటాయించారు. వీటితో పాటు పట్టణ, గ్రామీణ పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిర్మాణం, మరమ్మతులకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని