logo

ఉప్పు.. నాణ్యత లేకపోతే ముప్పు!

సాధారణంగా ఇళ్లల్లో వాడే ఉప్పులో అయోడిన్‌ పరిమాణం ఎంత ఉందనే విషయమై వైద్య ఆరోగ్య శాఖ సర్వే చేయిస్తుంది. తీపి పదార్థాలు మినహా ఉప్పు వాడని వంటకాలు అనేవి ఉండవు.

Published : 13 Apr 2024 03:20 IST

న్యూస్‌టుడే, దేవరుప్పుల(జనగామ జిల్లా)

దేవరుప్పులలో అయోడిన్‌ పరీక్షలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు

సాధారణంగా ఇళ్లల్లో వాడే ఉప్పులో అయోడిన్‌ పరిమాణం ఎంత ఉందనే విషయమై వైద్య ఆరోగ్య శాఖ సర్వే చేయిస్తుంది. తీపి పదార్థాలు మినహా ఉప్పు వాడని వంటకాలు అనేవి ఉండవు. కీలకమైన ఉప్పులో అనుచితాలు ఉన్నా అవసరమైన ధాతువులు తగ్గినా పెరిగినా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని.. నాణ్యత తెలుసుకునేందుకు నేషనల్‌ అయోడిన్‌ డెఫిషియన్సీ డిసార్డర్స్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం పేరిట జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఉప్పులో సాంద్రత తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తోంది..

అయోడిన్‌ లోపిస్తే కలిగే రుగ్మతలు..

కాలానుగుణంగా వివిధ సంస్థలు ఉప్పును పొడిరూపంలో అందమైన ప్యాకింగ్‌లలో విక్రయిస్తున్నాయి. దానికే ప్రజలు అలవాటు పడి కొనుగోలు చేస్తున్నారు. కానీ అందులో అయోడిన్‌ సాంద్రత తెలుసుకోకపోతే ఎంతో ప్రమాదమని గ్రహించి పరీక్షలు ఏర్పాట్లు చేశారు. అయోడిన్‌ పరిమాణం 15 పీపీయం(పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉంటే బాగుందని వారు సూచిస్తున్నారు. దీనికన్నా తక్కువ మోతాదులో ఉంటే పలు సమస్యలు చుట్టుముడుతాయని  చెబుతున్నారు. ఈ లోపంతో హైపోథైరాయిడిజం, థైరాక్సిన్‌ హార్మోన్‌ విడుదలలో హెచ్చుతగ్గులుంటాయి. దీంతో పిల్లలలో ఎదుగుదల లోపించి.. నిస్తేజంగా ఉంటారు. దృష్టి మాంద్యం ఏర్పడుతుంది. గర్భిణులకు గర్భస్రావం తదితర ఇబ్బందులు ఉంటాయి.

ఇప్పుడేం చేస్తున్నారంటే..

జిల్లా స్థాయిలో వైద్యశాఖ ఆధ్వర్వంలో ఆశా కార్తకర్తలకు తగు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించి కిట్లు అందించారు. రెండురకాల ద్రావకాలున్న సీసాలున్న కిట్‌ ద్వారా వంద టెస్టుల వరకు నిర్వహించవచ్చు. ఆశా కార్యకర్తలు వారి ఆధీనంలోని గృహాలను సందర్శించి మహిళలతో మాట్లాడి వినియోగించే ఉప్పును సేకరించి అందులో రెండు రకాల ద్రావణాలను మూడు   నాలుగు చుక్కలు వేసి నిమిషం వ్యవధిలోనే ఫలితం తెలుసుకోవచ్చు. అది నీలం రంగులోకి మారితే వినియోగించడానికి అనువైన ఉప్పుగా పరిగణిస్తారు. వీధుల్లో లభించే గళ్ల ఉప్పు ప్రమాదకరమైనదని, వినియోగించడం మానుకోవాలని సూచిస్తున్నారు.


నాణ్యతగల ఉప్పునే వినియోగించాలి

-డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, ప్రభుత్వ వైద్యుడు, దేవరుప్పుల

వంటలు రుచికరంగా ఉండాలంటే వాడే ఉప్పు నాణ్యత గురించి.. మనం సాధారణంగా పట్టించుకోం. కానీ వాడే క్రమంలో ఇలాంటి పరీక్షలు తప్పనిసరి. అందులోని ధాతువుల లోపంతో అనేక శారీరక వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని