logo

పర్యాటక సమాచారం.. క్యూఆర్‌ కోడ్‌లో నిక్షిప్తం

కాకతీయుల కట్టడాలున్న ఖిలావరంగల్‌ కోటలో పర్యాటకులకు డిజిటల్‌ విధానంలో సమాచారం అందించేందుకు శ్రీకారం చుడుతున్నారు. కేంద్ర పురావస్తు శాఖ చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

Published : 13 Apr 2024 03:22 IST

ఖిలావరంగల్‌లోని కీర్తి తోరణం

ఖిలావరంగల్‌, న్యూస్‌టుడే: కాకతీయుల కట్టడాలున్న ఖిలావరంగల్‌ కోటలో పర్యాటకులకు డిజిటల్‌ విధానంలో సమాచారం అందించేందుకు శ్రీకారం చుడుతున్నారు. కేంద్ర పురావస్తు శాఖ చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ-టికెట్‌ విధానంతో ఆన్‌లైన్‌ ద్వారా చరవాణిలో కోట ప్రవేశ టికెట్లను కొనుగోలు చేసే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. వరంగల్‌ జిల్లాలో ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉన్న ఖిలావరంగల్‌లో రాష్ట్ర రాజముద్ర కీర్తితోరణం ఇక్కడే ఉండటంతో పెద్దఎత్తున సందర్శకులు నిత్యం వస్తుంటారు.  పర్యాటకులు మధ్యకోటలోని కీర్తితోరణాల నడుమ శిల్పాలను, ఖుష్‌మహల్‌, ఏకశిలగుట్ట, స్వయంభూ దేవాలయం, రాతి, మట్టికోటలను మాత్రమే తిలకించి వెళ్తున్నారు. ఇవేకాకుండా ఇక్కడ ఉన్న ఇతర అపూర్వ కట్టడాలు, బావులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని భావించిన అధికారులు వాటి విశిష్ఠత, కాకతీయుల చరిత్ర, నగరంలోని, జిల్లాలోని, కోట పరిసర ప్రాంతాల్లోని తిలకించాల్సిన పర్యాటక ప్రదేశాలు తెలిపే సమాచారం తెలిసే విధంగా నూతనంగా క్యూఆర్‌ కోడ్‌లతో బోర్డులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఓ ప్రైవేటు డిజిటల్‌ సంస్థతో సూచికలు తయారు చేయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో సందర్శన ప్రదేశాలు, వెళ్లే మార్గాలు(రూట్‌మ్యాప్‌), ఎంత దూరంలో ఉంటుందనే సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సంస్థ ప్రతినిధులు, కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ఖిలావరంగల్‌కోట ప్రాంతాన్ని సందర్శించారు. నూతనంగా రూపొందించాల్సిన క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన సమాచార బోర్డుల్లో పొందుపర్చాల్సిన అంశాలపై సమీక్ష జరిపారు. దీంతో త్వరలోనే సందర్శకులు ఎటువంటి గైడ్‌ సాయం లేకుండానే తమ చరవాణిలో పూర్తి పర్యాటక సమాచారం తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని