logo

సాహసవీరులు.. ఆపదలో ఆప్తులు

ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రాణాలు, ఆస్తులను రక్షించడానికి అగ్నిమాపక శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ఆపద వేళల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తుంటారు ఆ శాఖ సిబ్బంది.

Published : 13 Apr 2024 03:26 IST

రేపటి నుంచి అగ్నిమాపక శాఖ వారోత్సవాలు
న్యూస్‌టుడే, మట్టెవాడ(వరంగల్‌)

ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రాణాలు, ఆస్తులను రక్షించడానికి అగ్నిమాపక శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. ఆపద వేళల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తుంటారు ఆ శాఖ సిబ్బంది. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రతిఒక్కరూ ఘటనా స్థలం నుంచి పరుగు తీస్తుంటే.. అగ్నిమాపక సిబ్బంది మాత్రం ప్రమాదాన్ని నివారించడానికి ముందుకు సాగుతుంటారు. ఏప్రిల్‌ 14న జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నుంచి ఈ నెల 20 వరకు అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

1944 ఏప్రిల్‌ 14 ముంబై విక్టోరియా యార్డులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బంది కలిపి మొత్తం 66 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి స్మారకార్థం ఏటా ఏప్రిల్‌ 14న జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 12 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. ఏటూరునాగారంలో ఒకటి ఉంది. మరిపెడ, గొర్రెకుంటలో ఔట్పోస్టులు ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో  సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన నియామకాల్లో ఫైర్‌మెన్లు, డ్రైవర్లను ఎంపిక చేశారు. ప్రస్తుతం వారు శిక్షణలో ఉన్నారు. వారు విధుల్లోకి వస్తే కొంత మేర సమస్య పరిష్కారం కానుంది.

ఇటీవల వరంగల్‌లో జరిగిన షాపింగ్‌మాల్‌ అగ్ని ప్రమాదంలో మంటలు ఆర్పుతూ..

బ్రాడ్‌ ప్రో స్కై లిఫ్ట్‌ అవసరం

హైదరాబాద్‌ తర్వాత రెండో అతిపెద్ద నగరం ఓరుగల్లు కేంద్రంగా అనేక బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. షాపింగ్‌మాల్స్‌, వాణిజ్య భవనాలు, అపార్టుమెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం  24 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణదశలో ఉంది.  వరంగల్‌ డివిజన్‌ అగ్నిమాపక శాఖకు ఒక బ్రాడ్‌ ప్రో స్కై లిఫ్ట్‌ అవసరం ఉంది. గతంలో హనుమకొండలోని ఓ షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగినప్పుడు స్కైలిఫ్ట్‌ను హైదరాబాద్‌ నుంచి తెప్పించారు. అవసరమైన అత్యాధునిక పరికరాల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు.

గణాంకాల్లో సేవలు..

2023 జనవరి నుంచి డిసెంబరు 31 వరకు వరంగల్‌ డివిజన్‌లో పరిధిలో 528 ఫైర్‌ కాల్స్‌, 63 రెస్క్యూ కాల్స్‌ వచ్చాయి. ఆస్తినష్టం రూ.7,20,90,500. కాపాడిన ఆస్తి విలువ రూ.39,58,91,500 ఉంది. రెస్క్యూ కాల్స్‌లో ఆస్తినష్టం రూ.15,20,000. కాపాడింది రూ.3,70,000. చనిపోయినవారు 26 మంది.

అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది

ఇలాంటి వారెందరో

వరంగల్‌ అగ్నిమాపక కేంద్రంలో గిరిబాబు ఫైర్‌ హోంగార్డుగా పనిచేస్తున్నారు. ఇటీవల పోచమ్మమైదాన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సేవలందిస్తూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వివిధ కేంద్రాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇలాంటి సేవలందించి సత్కారాలు పొందిన వారిలో ఉమ్మడి జిల్లా నుంచి చాలామంది ఉన్నారు. పరకాలలో విధులు నిర్వహిస్తున్న తిర్జేసి సత్యం 2021కి ఉత్తమ ఫైర్‌మెన్‌గా, 2023లో రాష్ట్రస్థాయి సేవా పతకానికి ఎంపికయ్యారు. హనుమకొండ అగ్నిమాపక కేంద్రం ఫైర్‌ ఆఫీసర్‌ ఎ.నాగరాజు 2022లో ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. ఉత్తమ లీడింగ్‌ ఫైర్‌మెన్‌గా శ్యాంసుందర్‌ నిలిచారు. అగ్నిప్రమాదాలు, వరదలు, తుపాన్లు, ఇతర విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు విపత్తు, స్పందన, అగ్నిమాపక సేవల శాఖ అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలకు సలాం కొట్టాల్సిందే.

వారోత్సవాల కార్యక్రమాలు

  • 14న విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళి.
  • 15న బస్టాండ్స్‌, రైల్వేస్టేషన్స్‌ తదితర ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలపై మాదిరి ప్రదర్శనలు
  • 16న అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల్లో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లు, షార్ట్‌ సర్య్కూట్ ప్రమాదాలపై అవగాహన
  • 17న ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు నివారించే పద్ధతులపై సదస్సు
  • 18న పెట్రోల్‌ పంపులు, గ్యాస్‌ గోదాముల వద్ద  ప్రదర్శన, అవగాహన
  • 19న విద్యా సంస్థలు, షాపింగ్‌మాల్స్‌, వాణిజ్య భవనాలు వద్ద ప్రదర్శన,  అవగాహన
  • 20న అగ్నిమాపక కేంద్రాల్లో ముగింపు వేడుకలు.

సామాజిక బాధ్యత

-  భగవాన్‌రెడ్డి, వరంగల్‌  డివిజన్‌ అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి

‘అగ్నిభద్రతను నిర్ధారించండి.. దేశ అభివృద్ధికి సహకరించండి’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అగ్నిప్రమాదాలపై అవగాహన, నివారణ చర్యలు ప్రతిఒక్కరి సామాజిక బాధ్యత. అవగాహనలోపం, నిర్లక్ష్యంతోనే అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు