logo

చెరువులు ఎండిపోయి.. ఆశలు ఆవిరై..!

జిల్లాలో చెరువులు, కుంటల్లో నీరులేక నెర్రెలు బారుతున్నాయి.. భారీ వర్షాలతో నిండు కుండల్లా కనిపించే తటాకాలు గత ఏడాది ఆగస్టు తర్వాత వర్షాలు కురవకపోవడంతో సామర్థ్యాల మేర నీరు చేరలేదు.

Published : 13 Apr 2024 03:28 IST

 

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలో చెరువులు, కుంటల్లో నీరులేక నెర్రెలు బారుతున్నాయి.. భారీ వర్షాలతో నిండు కుండల్లా కనిపించే తటాకాలు గత ఏడాది ఆగస్టు తర్వాత వర్షాలు కురవకపోవడంతో సామర్థ్యాల మేర నీరు చేరలేదు. దీంతో రైతులు సాగునీటి కోసం పలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితులను గమనించడంతో పాటు ఇతర కారణాలతో చాలా మంది చెరువుల కింద యాసంగి వేయలేదు. సాగు చేసిన వారికి సాగునీటి ఎద్దడి నెలకొంది.

జిల్లాలో 1594 చెరువులున్నాయి. ఆ జలాశయాల పరిధిలో సుమారు 95,460 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. జిల్లాలోని సుమారు 11 వందలకు పైగా ఉన్న చెరువులు వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. వర్షాలు కురిస్తేనే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ఆ చెరువులు నిండి సాగునీటి అవసరాలు తీరుస్తాయి. ఈ ఏడాది నీరు ఎండిపోయి చాలా గ్రామాల్లో చెరువులు మైదానాలను తలపిస్తున్నాయి. ఎస్సారెస్పీ జలాలపై ఆధారపడిన సుమారు 400 చెరువుల్లోనూ కొన్ని నీరు లేక ఆ ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు సూర్యప్రతాపం పెరిగి 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండ వేడితో  చెరువులు, కుంటల్లో ఉన్న ఆ కొంచెం నీరు కూడా ఆవిరైపోతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో చల్లదనం తగ్గి వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చెరువులు, కుంటల్లో నీరులేక పశువులు, జీవాలు కూడా తాగునీటి కోసం అవస్థలు పడుతున్నాయి.

మరికొన్ని ఇలా

  • మహబూబాబాద్‌ పట్టణంలోని కంబాలచెరువులో నీటి మట్ట్టం 70 శాతం పడిపోయింది.
  • కురవి మండలంలోని సింగాయకుంట పూర్తిగా ఎండిపోయింది. సుమారు 100 ఎకరాల్లో ఆయకట్టు ఉన్న ఈ కుంటలో యాసంగి పంటకు సాగునీరు లేక ఇబ్బంది పడ్డారు.
  • కురవి మండలంలోని అయ్యగారిపల్లి పెద్ద చెరువు 80 శాతం మేరకు ఎండిపోయింది. ఆ చెరువు కింద ఉన్న వ్యవసాయ బావుల్లో కూడా భూగర్భ జలాలు పడిపోయాయి.
  • నెల్లికుదురు మండలంలోని మదనతుర్తి పెద్ద చెరువు పూర్తిగా అడుగంటి పోయింది.
  • మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలోని మున్నేరు, ఆకేరు వాగు పూర్తిగా అడుగంటి పరివాహక ప్రాంత రైతులకు సాగునీటికి పాట్లు తప్పడం లేదు.


పెద్దచెరువులో దిగువకు..

బయ్యారం: సుమారు 11 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న బయ్యారం పెద్దచెరువు గతంలో ఎన్నడూ లేనంతగా నీటి మట్టం ఈ ఏడాది పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం పెద్దచెరువులో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో 2.5 అడుగులకు చేరుకుంది. గతేడాది మే నెలలో సుమారు 6 అడుగుల వరకు నీరు నిలువ ఉంది. 2022లో 13 అడుగుల నీటి మట్టం ఉండటంతో ఈ చెరువు కింద సాగు చేసిన సుమారు 2వేల ఎకరాలకు యాసంగి సాగుకు నీరందించారు. ఈ ఏడాది ఆగస్టు తర్వాత వర్షాలు లేకపోవడం, నీటిని కొందరు అక్రమంగా విడుదల చేసి వృధా చేయడం వల్ల నేడు పూర్తిస్థాయిలో నీటిమట్టం తగ్గిపోయింది.  


అడుగంటిన నీరు...

మహబూబాబాద్‌ రూరల్‌: అమనగల్‌ పెద్ద చెరువులో నీరు అడుగంటింది. 15.89 ఎంసీఎఫ్‌టీ సామర్థ్యంగల చెరువు పరిధిలో సుమారు 153 ఎకరాల ఆయకట్టు ఉంది. నీరు పూర్తిగా చివరి దశకు రావడంతో రైతులు వ్యసాయ బావులపైనే ఆధారపడాల్సి వస్తోంది. చెరువు శిఖంలో కొంత స్థలం ఆక్రమణకు గురైనట్లు స్థానికులు తెలిపారు.


కందకాల్లోనే

కోడి చెరువులో

గూడూరు: మండల కేంద్రంలో సుమారు 131 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోడి చెరువు పూర్తిగా వర్షాలపైనే ఆధారపడి ఉంటుంది. వానాకాలం వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ప్రస్తుతం చెరువు పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈ చెరువు కింద 300 ఎకరాలు ఆయకట్టు ఉంది. నీటి వనరు లేకపోవడంతో ఈ యాసంగి సీజన్‌లో 30 ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నారు. చెరువుల్లో నీరు తగ్గిపోవడం వల్ల పరిసర వ్యవసాయ బావులు, ఇళ్లలోని బోరు బావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని