logo

ఇంకా మేల్కోపోతే.. ఏమనాలా?

నాలాలు, వరదనీటి కాలువలు, కాలనీల్లో ప్రధాన అంతర్గత మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌, సీడీఎంఏ దివ్య దేవరాజన్‌ ఇటీవల ఆదేశించారు.

Published : 13 Apr 2024 03:31 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

వరంగల్‌ ఎల్బీ కళాశాల నాలాలో పేరుకుపోయిన పూడిక

నాలాలు, వరదనీటి కాలువలు, కాలనీల్లో ప్రధాన అంతర్గత మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌, సీడీఎంఏ దివ్య దేవరాజన్‌ ఇటీవల ఆదేశించారు. అయినా నగరంలో ఎలాంటి చర్యలు లేవు.

నగరంలోని ప్రధానమైన నాలాల్లో పూడికతీత పనులు సరిగా చేపట్టక పోవడంతో గతేడాది వర్షాకాలంలో వరద నీరు కాలనీలను ముంచెత్తింది. అనంతరం ఆగమాగం పూడికతీత పనులు చేసి మమ అనిపించారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారైనా ముందస్తుగా పూడికతీత పనులు చేపట్టడం లేదు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లోని నాలాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలకు నిలయాలుగా మారాయి. ఏ నాలాలో చూసినా పచ్చదనం పరిచినట్లుగా అడవి తుంగ, గడ్డి, పిచ్చిచెట్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. వచ్చేది వర్షాకాలమైనా గ్రేటర్‌ వరంగల్‌ అధికారులు మేల్కొనడం లేదు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో గతేడాది ముంపునకు ప్రధాన కారణమైన నాలాలపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం..

ఎనుమాముల ప్రధాన డ్రైనేజీ దుస్థితి

వరంగల్‌ ప్రాంతంలో..

  • ఉర్సు విమ్స్‌ ఆసుపత్రి ముందు నుంచి బొందివాగు రైల్వేట్రాక్‌, బొందివాగు నాలా నుంచి భద్రకాళి బండ్‌ వరకు కాలువలో అడవి తుంగ, పిచ్చిచెట్లు మొలిచాయి.
  • కరీమాబాద్‌ సాకరాశికుంట నుంచి ఎస్‌ఆర్‌ఆర్‌తోట వరకు, శివనగర్‌, చింతల్‌, ఉర్సుగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నాలాల్లో వ్యర్థాలున్నాయి.
  • ఎనుమాముల నుంచి కాశీబుగ్గ, దేశాయిపేట చిన్నవడ్డేపల్లి మత్తడి నాలా నుంచి డాక్టర్స్‌ కాలనీ వరకు, తుమ్మలకుంట నుంచి ఆటోనగర్‌, కాశీబుగ్గ సిద్ధయ్య హోటల్‌, అబ్బనికుంట, ఎల్బీనగర్‌, దేశాయిపేట ప్రధాన మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి.
  • హంటర్‌రోడ్‌ 12 మోరీల నుంచి పోతననగర్‌ వరకు, కేఎంజీ పార్కు నుంచి రంగంపేట, ఎల్బీ కళాశాల నాలాల్లో పూడిక తీయక చాలా రోజులవుతోంది.

హనుమకొండ అలంకార్‌ పెద్ద మోరీలో..

హనుమకొండ పట్టణంలో..

  • అలంకార్‌ పెద్ద మోరీ, భద్రకాళి కాపువాడ మత్తడి నుంచి అలంకార్‌, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ, మచిలీబజారు, రాయపురా, సుధానగర్‌ నాలాల్లో వ్యర్థాలున్నాయి.
  • గోపాల్‌పూర్‌ నుంచి కేయూ వంద అడుగుల రోడ్డు, వడ్డేపల్లి మత్తడి నుంచి సమ్మయ్యనగర్‌, విద్యానగర్‌, అంబేడ్కర్‌ భవన్‌ రోడ్‌ నాలాల్లో పూడిక ఉంది.
  • హనుమకొండలో ప్రధానమైన నయీంనగర్‌ నాలాలో పూడికతీత పనులు చేపట్టాల్సి ఉంది.
  • కాజీపేట రామకృష్ణ కాలనీ, సోమిడి రోడ్డు, డీజిల్‌ కాలనీ, దర్గా రోడ్‌, ప్రగతినగర్‌ మురుగు కాలువల్లో వ్యర్థాలున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని