logo

100 రోజులు.. ‘ఉపాధి’ కల్పించలే!

గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించాలనే ఉద్దేశంతో 20 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.

Published : 13 Apr 2024 03:34 IST

రాష్ట్ట్ర్ర స్థాయిలో అట్టడుగున జిల్లాలు
న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌

ఉపాధి పని చేస్తున్న కూలీలు

గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించాలనే ఉద్దేశంతో 20 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలన్నదే లక్ష్యం.. కానీ, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కుటుంబాలకు వంద రోజుల పని కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. పనులు, నిధులు పుష్కలంగా ఉన్నా అమలుతీరు సరిగా లేకపోవడంతో కొందరికే పరిమితమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి కూలీలు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

ములుగు 31వ స్థానం

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి 7.38 లక్షల జాబ్‌కార్డులు ఉండగా అందులో 15.38 లక్షల మంది కూలీలు ఉన్నారు. ప్రతి జాబ్‌కార్డుకు వంద రోజుల పని కల్పించాల్సి ఉండగా కేవలం 15,098 కుటుంబాలకు మాత్రమే కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలు ఉండగా అందులో ములుగు జిల్లా 31వ స్థానంలో, వరంగల్‌ 30వ స్థానంలో, భూపాలపల్లి 29వ స్థానం, జనగామ 22వ స్థానంలో ఉన్నాయంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహబూబాబాద్‌ జిల్లా ఎంతో మెరుగ్గా రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో ఉండగా హనుమకొండ 17వ స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలు ఉపాధి హామీ పథకంలో చాలా వెనుకబడ్డాయి.

ప్రతి మండలానికి లక్ష్యం

గ్రామీణ ప్రజలకు భరోసా కల్పిస్తున్న ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పనులు చేపడుతుంటారు. అలాగే జాబ్‌కార్డులు కలిగిన కుటుంబాలకు ప్రతి మండలానికి సంవత్సర కాలంలో వెయ్యి కుటుంబాలకు వంద రోజుల పని కల్పించాలనే ఆదేశాలు ఉన్నా నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారు. మరోవైపు పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదని, వేసవిలో మూడు నెలలే కూలీలు వస్తారని అధికారులు అంటున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే రారని చెబుతున్నారు.


లోపాలను అధిగమిస్తాం

- నరేశ్‌, భూపాలపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి

జాబ్‌కార్డు గల కుటుంబాలకు వంద రోజుల పని కల్పించడంలో కాస్త వెనుకబడి ఉన్నాం.. జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పనులకు రావడం లేదు. వ్యవసాయ పనులు ఉన్న సమయాల్లో మరీ తక్కువగా వస్తుంటారు. లోపాలను అధిగమించి ముందుకెళ్తాం.. వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో కుటుంబాలు వంద రోజులు పూర్తి చేసుకునేలా కార్యక్రమాలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని