logo

షో అదిరింది..!

నల్గొండ, భువనగిరి అనగానే సర్వాయి పాపన్నగౌడ్‌, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, బద్దం నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల దంపతులు, ధర్మభిక్షం, కొండా లక్ష్మణ్‌, బెల్లి లలిత తదితరులు గుర్తుకు వస్తారని.. భువనగిరి గడ్డ కాంగ్రెస్‌ అడ్డా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 22 Apr 2024 02:57 IST

భువనగిరి రోడ్‌షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వెంకట్‌రెడ్డి, విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి.

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, భువనగిరి: నల్గొండ, భువనగిరి అనగానే సర్వాయి పాపన్నగౌడ్‌, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, బద్దం నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల దంపతులు, ధర్మభిక్షం, కొండా లక్ష్మణ్‌, బెల్లి లలిత తదితరులు గుర్తుకు వస్తారని.. భువనగిరి గడ్డ కాంగ్రెస్‌ అడ్డా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ లోక్‌సభ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. తొలుత హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 6.40కి పట్టణానికి చేరుకొని అక్కడి నుంచి వినాయక్‌ చౌరస్తా వరకు రోడ్‌షో నిర్వహించారు. అనంతరం అక్కడ ప్రసంగించారు. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి భువనగిరికి రావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరయ్యారు. సభ విజయవంతం కావడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వెంకట్‌రెడ్డి, అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, అనిల్‌కుమార్‌రెడ్డి, వేముల వీరేశం, మల్‌రెడ్డి రంగారెడ్డి, మందుల సామేల్‌, యాదాద్రి భువనగిరి, జనగామ డీసీసీ అధ్యక్షులు సంజీవరెడ్డి , కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులకు ప్రజలు జేజేలు పలకగా.. వారికి అభివాదం చేస్తూ ముందుకుసాగారు. సీఎం ప్రసంగం చేయడానికి ముందు నల్గొండ గద్దర్‌ మూడురంగుల జెండా పట్టి పాట పాడి జోష్‌ నింపారు.

  • సామాజిక మాధ్యమాల్లో మోసపూరిత ప్రకటనలతో భారాస, భాజపా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. తప్పుడు కథనాలు ఇస్తున్నాయి.. కాంగ్రెస్‌ కార్యకర్తలు వాటిని తిప్పికొట్టాలి.. భాజపాను ఓడించి రాహుల్‌ను ప్రధానిని చేద్దామని భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని