logo

మాటలు తప్ప.. ఆటల్లేవ్‌!

‘ఆడుదాం.. ఆంధ్రా’ పేరిట ప్రచార ఆర్భాటం చేసిన వైకాపా సర్కారు గత అయిదేళ్లలో క్రీడాకారుల కోసం చేసిందేమీ లేదు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలకు నిధులు ఆపేసి నిర్వీర్యం చేసింది.

Published : 13 Apr 2024 04:49 IST

క్రీడా సదుపాయాలకు నిధులు ఆపేసిన వైకాపా సర్కారు

భీమవరం పట్టణం, వీరవాసరం, న్యూస్‌టుడే: ‘ఆడుదాం.. ఆంధ్రా’ పేరిట ప్రచార ఆర్భాటం చేసిన వైకాపా సర్కారు గత అయిదేళ్లలో క్రీడాకారుల కోసం చేసిందేమీ లేదు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలకు నిధులు ఆపేసి నిర్వీర్యం చేసింది. 40 శాతానికి పైగా ఉన్న యువత క్రీడా సాధనకు అవసరమయ్యే సదుపాయాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇండోర్‌ స్టేడియంల నిర్మాణాలకు గతంలో నిధులు కేటాయించారు. భీమవరం 4వ వార్డులో, వీరవాసరంలో నిర్మాణాలు ప్రారంభించగా వైకాపా అధికారంలోకి వచ్చాక ఎక్కడికక్కడ పనులు నిలిపేశారు. క్రీడా సాధనకు తగిన వసతులు కల్పించకుండా జాతీయ, అంతర్జాతీయంగా క్రికెట్‌, అథ్లెట్లను రాష్ట్రం నుంచి తయారు చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం విడ్డూరమని క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు. ఆడుదాం..ఆంధ్రా పేరుతో అరకొర వసతులు, పర్యవేక్షకులు లేకుండానే మొక్కుబడిగా పోటీలు నిర్వహించి పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఆరోపిస్తున్నారు.

భీమవరం నర్సయ్య అగ్రహారంలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో గత పాలక మండల హయాంలో టెన్నిస్‌ కోర్టు నిర్మాణాన్ని చేపట్టి కొంత మేర పూర్తిచేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మిగిలిన పనులు జరగలేదు. అధునాతన భవనాల మధ్య ఇది నిరుపయోగంగా మిగిలింది.

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే యోచనతో తెదేపా ప్రభుత్వ హయాంలో వీరవాసరం ఎంఆర్‌కే జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్మాణం చేపట్టిన ఇండోర్‌ స్టేడియం ఇది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

నైపుణ్యాలకు దూరం

క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం పూర్తయి ఉంటే వాలీబాల్‌, షటిల్‌, కబడ్డీ వంటి క్రీడల్లో నైపుణ్యం పెంచుకునేందుకు ఉపయోగపడేవి. నేను ఒక ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. నిత్యం వ్యాయామం చేసే అలవాటు ఉంది. నాతో పాటు చుట్టుపక్కల యువతకు క్రీడల్లో శిక్షణ ఇస్తుంటా. క్రీడా వికాస కేంద్రం నిర్మాణం పూర్తయి ఉంటే గ్రామీణ యువతకు మెరుగైన నైపుణ్యాలు వచ్చేవి.

పాలా కృష్ణ, వీరవాసరం

అయిదేళ్లుగా ఎదురుచూపులు

క్రీడా వికాస కేంద్రాలు యువతకు ఎంతో అవసరం. మా ప్రాంతంలో ఇండోర్‌ స్టేడియం ఎప్పుడు పూర్తవుతుందోనని అయిదేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నా. కబడ్డీ, వాలీబాల్‌, బాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ వంటి క్రీడల్లో నైపుణ్యం సాధించాలంటే తగిన వసతులుండాలి. నేను సాధన చేయాలనుకున్న సమయంలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పూర్తి కాలేదు. భావి తరానికైనా ఉపయోగపడేలా నిర్మాణాలు పూర్తి చేయాలి.

దగ్గు శ్రీధర్‌, వీరవాసరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని