logo

జల్లేరును వదిలేసిన సర్కారు

గిరిజనుల భూములకు సాగునీటిని సరఫరా చేసేందుకు బుట్టాయగూడెం మండలం అలివేరు వద్ద నిర్మించిన గుబ్బలమంగమ్మ జల్లేరు జలాశయం వైకాపా ప్రభుత్వ హయాంలో చింతలమయంగా మారింది.

Published : 13 Apr 2024 04:51 IST

శివారు భూములకు అందని సాగునీరు
అస్తవ్యస్తంగా పంట కాలువల నిర్వహణ

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: గిరిజనుల భూములకు సాగునీటిని సరఫరా చేసేందుకు బుట్టాయగూడెం మండలం అలివేరు వద్ద నిర్మించిన గుబ్బలమంగమ్మ జల్లేరు జలాశయం వైకాపా ప్రభుత్వ హయాంలో చింతలమయంగా మారింది. ఆయకట్టు భూములకు పూర్తిస్థాయిలో నీటిని అందించలేని దుస్థితిలో పంట కాలువలు ఉన్నాయి. జలాశయం, హెడ్‌ స్లూయిస్‌, స్పిల్‌వే నిర్వహణ, మరమ్మతులకు అయిదేళ్ల కాలంలో నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు.

అడవి, కొండ ప్రదేశాల్లో కురిసిన వర్షపు నీటిని మదుపు చేసి భూగర్భజలాలు పెంచడంతో పాటు గిరిజన రైతుల భూములకు సాగునీటిని అందించేందుకు జల్లేరు జలాశయాన్ని నిర్మించారు. 6.09 కి.మీ. మేర ప్రధాన కాలువ, దానికి అనుసంధానంగా 17 పంట కాలువలు ఉన్నాయి. 4,200 ఎకరాల భూములకు నీరు అందించాల్సి ఉంది. కేఆర్‌పురం ఐటీడీఏలోని ప్రత్యేక చిన్నతరహా జలవనరుల విభాగం అధికారులు జలాశయం నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.

జలాశయంలో పూడిక పెరుగుతూ నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. ఏటా అక్టోబరు 15 నుంచి ఆయకట్టు భూములకు ఆరు నెలల పాటు సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఆ సమయంలోనే హెడ్‌ స్లూయిస్‌ లోపల దిగువ భాగంలో తరచూ మరమ్మతులకు గురవుతోంది. నిధుల్లేక బాగుచేయించడం జాప్యం అవుతోంది. ఈ ఏడాది అదే పరిస్థితి తలెత్తడంతో ఐటీడీఏ ద్వారా తాత్కాలిక నిధులతో చేయించారు.

అసలు పట్టించుకోలేదు

వైకాపా ప్రభుత్వం జల్లేరు జలాశయం మరమ్మతులు, పంట కాలువల్లో పూడిక తదితర సమస్యలు పరిష్కరించలేదు. దెబ్బతిన్న డ్రాపుల వద్ద షట్టర్లు బిగించి, మరమ్మతులు చేయించాలి. జలాశయంలో కూడా పూడిక తీయించాలి.

సోదెం మల్లారావు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు, చిన్నజీడిపూడి

గట్లపై పిచ్చిమొక్కలు

మాకు రెండెకరాల భూమి ఉంది. సాగునీరు పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నా. పంట కాలువల్లో పూడిక తీయించి, గట్లపై పిచ్చి మొక్కలు తొలగించాలి.

పూనెం బుచ్చిరాజు, రైతు, చిన్నజీడిపూడి

పంటకాలువల నుంచి బోదెలకు నీటిని సరఫరా చేసేందుకు అమర్చిన షట్టర్లు పలుచోట్ల దెబ్బతిని ఊడిపోయాయి. కాలువల్లో పూడిక పేరుకుపోవడం, గట్లపై పిచ్చిమొక్కలు పెరగడంతో నీటిని సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నాయి. పట్టుమని 1500 ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. శివారు భూముల పరిస్థితి దారుణంగా ఉంది.

టెండర్ల దశ దాటని పనులు

హెడ్‌ స్లూయిస్‌, స్పిల్‌వే గేట్లు తదితరాల వద్ద మరమ్మతులు, గ్రీజ్‌ పెట్టడం, రంగులు వేయించడం వంటి పనులు చేయించేందుకు రూ.26.12 లక్షల అంచనాతో పంపిన ప్రతిపాదనలకు ఏడాదిన్నర కిందట మంజూరు లభించినా పనులు టెండర్ల దశలోనే నిలిచిపోయాయి. హెడ్‌ స్లూయిస్‌ వద్ద రూ.6 లక్షలతో మరమ్మతులు చేయించామని ఐటీడీఏ పీవో మల్లవరపు సూర్యతేజ తెలిపారు. ఎప్పటికప్పుడు పనులు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు