logo

అడవి తల్లిపై గొడ్డలి వేటు

అడవి తల్లిపై గొడ్డలి వేటు పడుతోంది. వందల ఎకరాల్లో అక్రమార్కులు అడవిని యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. కుక్కునూరు మండలం కొండపల్లి, ముత్యాలంపాడు మధ్య వాగుల చెంతన ఉన్న అడవి పెద్దల దాహానికి బలవుతోంది.

Published : 13 Apr 2024 04:53 IST

కొండపల్లి- ముత్యాలంపాడు మధ్య చెట్ల నరికివేత

కుక్కునూరు, న్యూస్‌టుడే: అడవి తల్లిపై గొడ్డలి వేటు పడుతోంది. వందల ఎకరాల్లో అక్రమార్కులు అడవిని యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. కుక్కునూరు మండలం కొండపల్లి, ముత్యాలంపాడు మధ్య వాగుల చెంతన ఉన్న అడవి పెద్దల దాహానికి బలవుతోంది. వాగుల్లో మార్చి వరకు నీరు ప్రవహిస్తుంటుంది. ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా ఆ భూములకు సాగునీరందించే అవకాశం ఉంది. నాణ్యమైన సాగుభూమి, పక్కనే నీటి వసతి ఉండటంతో ఈ భూములపై ఆక్రమణదారుల కళ్లు పడ్డాయి. అంతే తెరపైన ఆదివాసీలను పెట్టి.. తెరవెనుక వారు ఉంటూ ఈ భాగోతం నడిపిస్తున్నారు.

ప్రత్తి పంట సాగుకు

ఇప్పటికే వందల ఎకరాల్లో నరికివేత జరగ్గా.. ఆ వనమేథం ఇంకా కొనసాగుతూనే ఉంది. అడవిని నరుకుతున్న వ్యక్తులు చత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వచ్చిన ఆదివాసీలు కాగా.. వెనుక స్థానిక పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కొండపల్లి, కోయగూడెం, గుండంబోరు, ఎర్రబోరు, ముత్యాలంపాడు గ్రామాలకు చెందిన పశువులు ఆ అడవిలో మేతకు వెళ్లేవని.. ఇప్పుడు దానిని నరికి వేస్తుండటంతో వాటికి మేత దొరకక ఆకలితో అలమటిస్తున్నాయని వాపోతున్నారు. అక్రమార్కులు అటవీ అధికారులను తమ దారికి తెచ్చుకున్నట్లు స్థానికుల ఆరోపణ. ఇప్పటికే అడవిలో చాలా భాగం ఆక్రమణకు గురికాగా.. అక్కడక్కడా మిగిలినదాన్ని కూడా వదలడం లేదు. పత్తి పంటకు ఈ భూములు అనుకూలంగా ఉండటం, మార్కెట్‌లో మంచిధర పలుకుతుండటంతో అక్రమార్కులు అటవీ భూములపై దృష్టి సారించారు.  ఇప్పటికైనా ఆ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే మిగిలిన అడవి సైతం గొడ్డలివేటుకు బలయ్యే అవకాశం ఉంది.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

‘కొండపల్లి, ముత్యాలంపాడు మధ్య ఉన్న  అడవిలో పరిస్థితిని తెలుసుకునేందుకు వెంటనే సిబ్బందిని పంపిస్తా. ఆక్రమణలకు గురైన అటవీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని, ఆ ప్రాంతంలో మళ్లీ అడవులు పెంచేందుకు చర్యలు తీసుకుంటా. ఆక్రమణదారులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టకుండా వారిపై కేసులు నమోదు చేస్తాం’ అని అమరవరం రేంజి అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని