logo

పేదలకు కిలో కందిపప్పు ‘ఇవ్వలేవా జగన్‌’?

జగన్‌ ప్రభుత్వం పేదలకు కందిపప్పు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా పంపిణీ చేయాల్సింది కొండంత ఉంటే..సరఫరా   గోరంత కూడా ఉండటం లేదు. ఫలితంగా రాయితీతో రూ.67కి వచ్చేది మార్కెట్లో రూ.160కి కొనుగోలు చేస్తున్నారు.

Updated : 13 Apr 2024 05:40 IST

ఏడాదిన్నరగా 14,683 టన్నులు ఎగవేత
లబ్ధిదారులపై రూ.125.9 కోట్ల భారం

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే ఏలూరు కలెక్టరేట్‌, భీమవరం అర్బన్‌: జగన్‌ ప్రభుత్వం పేదలకు కందిపప్పు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా పంపిణీ చేయాల్సింది కొండంత ఉంటే..సరఫరా   గోరంత కూడా ఉండటం లేదు. ఫలితంగా రాయితీతో రూ.67కి వచ్చేది మార్కెట్లో రూ.160కి కొనుగోలు చేస్తున్నారు. అయిదేళ్లుగా విసిగిపోయిన ప్రజలు ‘కందిపప్పు కూడా ఇవ్వలేవా జగన్‌’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు ఆ కిలోకీ దిక్కులేదు..

2019 వరకు రాయితీపై కిలో రూ.40 చొప్పున కార్డుకు నెలకు రెండు కిలోలు ఇచ్చేవారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర రూ.67కి పెంచింది. రెండుకు బదులు కిలోకు కుదించారు. ఇప్పుడు ఆ కిలోకి కూడా దిక్కులేదు. సరఫరా లేకపోవటంతో బయట కొనుగోలు చేయాల్సి ఉంది. రూ.93 అధికంగా ఖర్చు చేయాల్సి ఉంది.

ప్రతిపక్షంలో ఆర్బాటం ఎక్కువ:

2014 ముందు రేషన్‌ దుకాణానికి  వెళ్తే బియ్యంతో పాటు పంచదార,  కందిపప్పు, కిరోసిన్‌, పామాయిల్‌, గోధుమ పిండి, కారం, పసుపు, ఉప్పు తదితర తొమ్మిది రకాల వస్తువులు  లభించేవి.  నాలుగేళ్ల   చంద్రబాబు పాలనలో రేషన్‌ దుకాణానికి వెళ్తే బియ్యం తప్ప ఏమైనా దొరుకుతుందా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి’’

ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి

అధికారం వచ్చాక ఇదీ పరిస్థితి

ప్రతిపక్షంలో ఉండి జగన్‌ చెప్పినవన్నీ మర్చిపోయారు. తొమ్మిది రకాల సరకులిచ్చే మాట దేవుడెరుగు. 2019లో ఆయన అధికారంలోకి వచ్చాక..అత్యవసరమైన కందిపప్పు పంపిణీలో కూడా అడ్డంగా కోత పెట్టారు. ప్రతి నెలా 50-70 శాతం కార్డుదారులకు  అందని ద్రాక్షగా మార్చేశారు. రూ.125.9 కోట్ల భారాన్ని ప్రజలపై   మోపి రూ.234.9 కోట్ల సొమ్ము  మిగుల్చుకున్నారు.

రూ.234.9 కోట్లు  మిగుల్చుకున్నారు:

ఉమ్మడి జిల్లాలో 11.87 లక్షల మంది కార్డుదారులున్నారు. 755 ఎండీయూ వాహనాల ద్వారా నెలకు 1181 టన్నుల కందిపప్పు అవసరముంది. 2023 జనవరి నుంచి 2024 ఏప్రిల్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వం అరకొరగానే సరఫరా చేస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్డుదారులకు 16 నెలల్లో కార్డుదారులందరికీ కలిపి 18,716 టన్నులు కిలో రూ.67 చొప్పున రాయితీపై అందించాల్సి ఉంది. ఇప్పటి వరకు 4033 టన్నులు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకొన్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.160-180 వరకు పలుకుతోంది. కందిపప్పు సరఫరాను పూర్తిగా తగ్గించేసింది. ప్రభుత్వం గుత్తేదారులకు చెల్లింపులు చేయకపోవటంతోనే సరఫరా ఇంత హీనంగా ఉందని తెలుస్తోంది. మొత్తం మీద గత ఏడాదిన్నరగా 14,683 టన్నులు పంపిణీ చేయలేదు. ఇలా ప్రభుత్వం రూ.234.9 కోట్లు మిగుల్చుకుంది.

బయట కొనుక్కోవాల్సిందే

నిబంధనల ప్రకారం కార్డుదారుకు కిలో చొప్పున పంపిణీ చేస్తారు. ఉమ్మడి జిల్లాలో 11.98 లక్షల మంది కార్డుదారులుండగా.. నెలకు మొత్తం 1198 టన్నులు అవసరం. ప్రభుత్వం కిలో రూ.67కే సరఫరా చేసేది. బహిరంగ మార్కెట్‌లో రూ.160 వరకు పలుకుతోంది. ఈ లెక్కన రెండు జిల్లాల లబ్ధిదారులపై ఏడాదిన్నరగా 125.9 కోట్ల భారం పడుతోంది.

కందిపప్పే ఇవ్వడం లేదు:

ఏలూరు శ్రీరామ్‌నగర్‌లో ఈ నెల మొదటి వారంలో ఎండీయూ వాహనం వచ్చింది. రేషన్‌ తీసుకునేందుకు కార్డుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. కందిపప్పు ఉందా అని కార్డుదారులు అడిగితే రావటం లేదండి బయట కొనుక్కోండి అని చెప్పారు. ఉగాది సమయంలోనూ ఇవ్వరా అంటూ నాగలక్ష్మి, శిరీష, రవళి, తదితర గృహిణులు పెదవి విరిచారు. ఇంటింటికీ వెళ్లి రేషన్‌ ఇవ్వాల్సి ఉన్నా వీధి చివర పెట్టి అందరినీ అక్కడికే రావాలంటున్నారని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని