logo

గోరంత ఇచ్చి గొప్పలా..

అధికారంలోకి వస్తే ఆటో, ట్యాక్సీలు నడుపుతున్న డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తానంటూ జగన్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు.

Updated : 13 Apr 2024 05:41 IST

లాక్కున్నదే ఎక్కువంటున్న వాహనమిత్ర లబ్ధిదారులు
పైగా కొర్రీలతో కోత

భీమవరం అర్బన్‌, ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: అధికారంలోకి వస్తే ఆటో, ట్యాక్సీలు నడుపుతున్న డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తానంటూ జగన్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. దీనిగురించి ఎంతో ఆర్భాటంగా చెప్పి.. ఆ తర్వాత ఆంక్షలు విధించడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోపక్క వాహనాలకు విధించే పన్నులు నాలుగు రెట్లు పెంచేశారు. ప్రభుత్వం ఇస్తున్నదాని కంటే పన్నుల రూపంలో లాగుతున్నదే ఎక్కువగా ఉందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల పేరుతో కొర్రీ! 

ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 30 వేల ఆటోలు ఉండగా.. 40 వేల వరకు ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌లు ఉన్నట్లు అంచనా. వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం కింద 2019 నుంచి 2023 వరకు అయిదు విడతలుగా రూ.10 వేల చొప్పున డ్రైవర్లకు అందించారు. కుటుంబంలో మరో వ్యక్తికి కారు, మరేదైనా వాహనం ఉన్నా, వాహన రిజిస్ట్రేషన్‌, యజమానికి చోదక అనుమతి పత్రం లేకపోయినా, విద్యుత్తు బిల్లు నెలకు 300 యూనిట్లు దాటినా ఇలా.. పలు నిబంధనలతో లబ్ధిదారుల జాబితా కుదించారు.

ఏటా రూ.28 వేల భారం

జిల్లాలో ప్రస్తుతం లీటరు డీజిల్‌ ధర రూ.97.75 ఉండగా..పక్క రాష్ట్రం కర్ణాటకలో మాత్రం రూ.87కు విక్రయిస్తున్నారు. అంటే లీటరుకు అదనంగా రూ.10కి పైగా వసూలు చేస్తున్నారు. పెట్రోల్‌ ధర కూడా రూ.9 ఎక్కువ. ఒక ఆటో డ్రైవర్‌ రోజుకు సగటున 5 లీటర్లు కొట్టించినా నెలకు రూ.1500, ఏడాదికి  రూ.18 వేల అదనపు భారం పడుతోంది. కానీ వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పేరుతో ఇచ్చేది  రూ.10 వేలు మాత్రమే. అది కూడా కొంతమందికే. అంటే జగనన్న ప్రభుత్వం ప్రతి డ్రైవర్‌ నుంచి అదనంగా రూ.8 వేలు లాగుతోంది. దీనికితోడు గతుకుల రోడ్లపై వాహనాలు మరమ్మతులకు గురవుతుండటంతో నెలకు రూ.వేలల్లో వెచ్చించాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. మొత్తంగా పెరిగిన ఇంధన ధరలు, పన్నులతో ఒక్కో ఆటో, ట్యాక్సీ డ్రైవర్‌పై ఏడాదికి రూ.28 వేల చొప్పున భారం పడుతోంది.

నాలుగు రెట్లు అదనంగా

వాహనమిత్ర పథకంలో ఏడాదికి రూ.10 వేలు చెల్లిస్తున్నారు. అంతే మొత్తంలో ఏటా వాహన బీమా, కాలుష్యం వంటి వాటికి కట్టాల్సి వస్తోంది. రహదారులు దారుణంగా ఉండటంతో తరచూ ఇంజిన్‌, పంపింగ్‌ బెడ్లు మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని వేయించడానికి కనీసం రూ.4 వేలు వెచ్చించాలి. వీటన్నింటికీ కలిపి ఏడాదికి రూ.40 వేలకు పైగా ఖర్చవుతోంది. ప్రభుత్వం ఇచ్చినదాని కంటే నాలుగురెట్లు అదనంగా అవుతోంది.

బాతు నరేష్‌, ఆటోడ్రైవర్‌, భీమవరం

నామమాత్రమే..

అర్హత ఉన్నా పథకంలో గత ఏడాది నాకు రూ.10 వేలు ఇవ్వలేదు. ఆటో నిర్వహణ రోజురోజుకూ భారంగా మారుతోంది. కట్టాల్సిన పన్నులు పెద్ద మొత్తంలో ఉంటున్నాయి. ఆటో, కుటుంబ నిర్వహణ కలిసి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం చేస్తున్న సాయం నామమాత్రంగా ఉంది.

కేతా శ్రీనివాసు, ఆటోడ్రైవర్‌, భీమవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని