logo

ఉండి నాయకులతో చంద్రబాబు భేటీ

ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని మార్చనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానిక తెదేపా నాయకులు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

Published : 13 Apr 2024 05:03 IST

ఈనాడు, రాజమహేంద్రవరం, పాలకోడేరు, న్యూస్‌టుడే: ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని మార్చనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానిక తెదేపా నాయకులు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిశారు. భీమవరంలోని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటి వద్ద పార్టీ శ్రేణులు గురువారం ఆందోళన నిర్వహించడంతో అధిష్ఠానం నుంచి ఇక్కడి నాయకులకు పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో నాలుగు మండలాల నుంచి సుమారు 100 మంది నాయకులు చంద్రబాబు బస చేసిన అమలాపురం కిమ్స్‌ వైద్య కళాశాల ప్రాంగణానికి వెళ్లారు. చంద్రబాబు భేటీకి 25 మందిని అనుమతించగా ఇద్దరు ముఖ్య నాయకులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రెండు రోజుల్లో ఉండి సీటుపై స్పష్టత ఇస్తామని, ఎమ్మెల్యే రామరాజుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీలో ఎమ్మెల్యే రామరాజుతో పాటు పార్టీ మండల అధ్యక్షులు దెందుకూరి ఠాగూర్‌కోటేశ్వరరాజు, జీవీ నాగేశ్వరరావు, నాగరాజు, కామన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించామని అన్నారు. ఇప్పటి వరకు పార్టీ ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదని, దీనిపైన నియోజకవర్గంలోని శ్రేణులతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని