logo

విషాదంలోనూ వీడని పేగుబంధం!

యలమంచిలి మండలం చించినాడ వశిష్ఠ గోదావరి వంతెనపై నుంచి బుధవారం గోదావరిలో దూకి గల్లంతయిన కుటుంబంలో బొంతు కిషోర్‌కుమార్‌ మృతదేహాన్ని గురువారం రాత్రే గుర్తించారు.

Updated : 13 Apr 2024 05:36 IST

గల్లంతైన వారి మృతదేహాల గుర్తింపు
చున్నీతో కుమార్తెను కట్టేసుకుని గోదావరిలోకి దూకిన వైనం

 

కిషోర్‌కుమార్‌, యోచన, నిధిశ్రీ (పాతచిత్రం)

యలమంచిలి, న్యూస్‌టుడే: యలమంచిలి మండలం చించినాడ వశిష్ఠ గోదావరి వంతెనపై నుంచి బుధవారం గోదావరిలో దూకి గల్లంతయిన కుటుంబంలో బొంతు కిషోర్‌కుమార్‌ మృతదేహాన్ని గురువారం రాత్రే గుర్తించారు. కోనసీమ జిల్లా సోంపల్లి రేవుకు సమీపంలో కిషోర్‌కుమార్‌ భార్య యోచన(24), రెండేళ్ల కుమార్తె నిధిశ్రీ మృతదేహాలను శుక్రవారం ఉదయం గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై కె.శివన్నారాయణ తెలిపారు. భీమవరం పట్టణానికి చెందిన కిషోర్‌కుమార్‌ కుటుంబం కొంత కాలంగా కోనసీమ జిల్లా అమలాపురంలో ఉంటున్న విషయం తెలిసిందే.

తలోదారిన మృతదేహాలు: ముగ్గురూ ఒకే ప్రాంతంలో నదిలోకి దూకినా భార్యభర్తలు తలోవైపునకు కొట్టుకుపోయారని మృతదేహాలు లభించిన ప్రాంతాలను బట్టి తెలుస్తోంది. గోదావరి ప్రవాహానికి అనువుగా కిషోర్‌కుమార్‌ మృతదేహం యలమంచిలి మండలం శివారునున్న బాడవలో గుర్తించగా అతడి భార్య, కుమార్తెల మృతదేహాలు దూకిన ప్రాంతానికి ఎగువన గోదావరి ప్రవాహానికి ఎదురెళ్లి సోంపల్లి దగ్గర ఒకే చోట గుర్తించారు. విషాదంలోనూ పేగుబంధం వీడకుండా యోచన కుమార్తెను తన చున్నీతో గట్టిగా కట్టేసుకుని గోదావరిలోకి దూకారని పోలీసులు భావిస్తున్నారు. ఎన్ని సమస్యలున్నా సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవాల్సిన యువ దంపతులు క్షణికావేశంలో పసి పాపల సహా తనువు చాలించిన ఉదంతం ఉభయ గోదావరి జిల్లాల్లో విషాదం నింపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని