logo

ఇంటర్‌ ఫలితాల్లో 9వ స్థానం

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. గతేడాది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా ఈసారి విభజిత జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరిగాయి.

Published : 13 Apr 2024 05:06 IST

ద్వితీయ సంవత్సరంలో 80 శాతం ఉత్తీర్ణత

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. గతేడాది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికారుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా ఈసారి విభజిత జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరిగాయి. ప్రథమ సంవత్సరంలో 69, రెండో ఏడాదిలో 80 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆర్‌ఐవో కె.చంద్రశేఖర్‌బాబు తెలిపారు. నూతన విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్‌ ప్లస్‌ పేరిట ఇంటర్‌ తరగతులు ప్రారంభించారు.   మొత్తం 15 కళాశాలల నుంచి ప్రథమ సంవత్సర విద్యార్థులు 227 మంది పరీక్షలకు హాజరుకాగా 63 మంది, ద్వితీయ ఏడాది నుంచి 114 మందికి గాను 31 మంది ఉత్తీర్ణులయ్యారు. ః  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 14 ఉన్నాయి. ప్రథమ సంవత్సరంలో 876 మందికి 351 మంది, రెండో ఏడాదిలో 694కు 460 మంది ఉత్తీర్ణత సాధించారు.

అధ్యాపకుల కొరతతో గాడితప్పి..

ఈనాడు, ఏలూరు: ప్రభుత్వ విద్యను కొత్త పుంతలు తొక్కిస్తామంటూ సీఎం జగన్‌ మొదలు వైకాపా నాయకులు వరకు ప్రసంగాల్లో ఊదరకొట్టారు. తీరా శుక్రవారం విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో మాత్రం ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత శాతం దారుణంగా దిగజారిపోయింది.  అధ్యాపకుల కొరత, ల్యాబుల్లో ఇబ్బందులు తదితర సమస్యలతో  ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోనట్లు తెలుస్తోంది.ఉమ్మడి జిల్లాలో రెగ్యులర్‌ అధ్యాపకులు పోస్టులు 250కి పైగా ఖాళీగా ఉండటంతో చాలా కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులతో నడిపించేస్తున్నారు. ఫలితాలు బాగా పడిపోయాయి. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో 2728కి 1458 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 53.45 మాత్రమే. పశ్చిమలోనూ ఇదే స్థాయిలో ఫలితాలున్నాయి.

సదుపాయాల్లేక ఇక్కట్లు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రయోగశాలల సమస్య వేధిస్తోంది. చాలా విద్యా సంస్థల్లో అసలు లేనే లేవు. కొన్ని చోట్ల ఉన్నా పరికరాల కొరత ఉంది. ఉన్న అరకొర పరికరాలతో ప్రయోగాలు చేసినా ప్రయోజనం ఉండటం లేదు. కళాశాలల్లో పర్యవేక్షణ సవ్యంగా లేదు. విద్యార్థుల హాజరును పట్టించుకునే పరిస్థితి లేదు. మూలాల్లో మార్పులు చేయనంత కాలం ఇదే ఫలితాలు పునరావృతమవుతాయని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఉండాల్సిన రెగ్యులర్‌ అధ్యాపకులు 450
ప్రస్తుతం ఉన్నవారు 190 మంది
విధుల్లో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులు 210
ఖాళీలు  50

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు