logo

సంబరాలు చేస్తే సరిపోతుందా?

జగనన్న క్రీడా సంబరాలు, ఆడుదాం ఆంధ్రా పేరుతో ఒకసారి క్రీడలు నిర్వహించి జగన్‌ ప్రభుత్వం చేతులు దులుపుకోవడంతో ఉమ్మడి జిల్లాలో క్రీడల అభివృద్ధి దాదాపు కుంటుపడింది.

Updated : 13 Apr 2024 05:34 IST

క్రీడా మైiదానాల అభివృద్ధి ఏదీ
కేవీకే  నిర్మాణాలనూ విస్మరించారు
ఆటలపై జగన్‌ సర్కారు నిర్లక్ష్యం

జగనన్న క్రీడా సంబరాలు, ఆడుదాం ఆంధ్రా పేరుతో ఒకసారి క్రీడలు నిర్వహించి జగన్‌ ప్రభుత్వం చేతులు దులుపుకోవడంతో ఉమ్మడి జిల్లాలో క్రీడల అభివృద్ధి దాదాపు కుంటుపడింది.

భీమవరం టూటౌన్‌, పాలకోడేరు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో క్రీడా మైదానాల అభివృద్ధికి గత ప్రభుత్వం పునాది వేయగా గడిచిన నాలుగున్నరేళ్లలో వైకాపా ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో క్రీడాభ్యుదయం పడకేసింది. గ్రామీణ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు సౌకర్యాలు కల్పించి తద్వారా జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని గత ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. దీని కోసం క్రీడా మైదానాల అభివృద్ధితో పాటు క్రీడా వికాస కేంద్రాలు(మినీ స్టేడియం) నిర్మాణాలకు పెద్ద పీట వేశాయి. ప్రభుత్వం మారడంతో ఇవి అన్నీ దాదాపు మూలకు చేరాయి.

అస్తవ్యస్తంగా మైదానాలు

ఉమ్మడి జిల్లాలో 430 ఉన్నత పాఠశాలలు, 32 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఎక్కడా పూర్తిస్థాయిలో ఆటల కోర్టులు, ఇతర వసతులు అందుబాటులో లేవు. పలుచోట్ల మైదానాలు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. మరికొన్ని చోట్ల పిచ్చిమొక్కలు, తుప్పలు పెరిగిపోయి చిట్టడవిని తలపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు సైతం ఆటలు ఆడుకునేందుకు నానాయాతన పడాల్సిన దుస్థితి నెలకొంది.

ఒక్కటీ పూర్తికాలేదు.. గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు(మినీ స్టేడియం) ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. కేంద్రానికి రూ.2 కోట్లు చొప్పున కేటాయించి ఉమ్మడి జిల్లాలోని 15 నియోజవర్గాలతో పాటు అదనంగా మరో ఆరు చోట్ల మొత్తం 21 కేంద్రాలను మంజూరు చేసింది. వీటి నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణశాఖకు అప్పగించింది. అప్పట్లో పాలకొల్లు, ఉండిలో తప్ప మిగతా చోట్ల నిర్మాణాలు చేపట్టారు. కానీ నేటికీ ఒకటి కూడా పూర్తికాలేదు. 2019 సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో నిర్మాణాలు దాదాపుగా ఆగిపోయాయి. ఆచంట, చింతలపూడి, వీరవాసరం, మొగల్తూరు తదితర చోట్ల కనీసం 50 శాతం పనులు కూడా పూర్తికాలేదు. మరికొన్నిచోట్ల బిల్లుల మంజూరు జాప్యంతో పూర్తిగా నిలిచిపోయాయి.

రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు

21 కేవీకేల నిర్మాణానికి సుమారు రూ.40 కోట్ల వరకు మంజూరయ్యాయి. పలుచోట్ల చేసిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారులు మధ్యలోనే నిలిపివేయడం పరిపాటిగా మారింది. దీంతో పనుల పురోగతి కూడా కుంటుపడింది. పలు సంవత్సరాల తరబడి బిల్లులు మంజూరు కాకపోవడంతో పలువురు గుత్తేదారులు కూడా కోర్టులకు వెళ్లారు. మొత్తమ్మీద వీటి నిర్మాణాలకు సుమారు రూ.5 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు  అంచనా.

క్రీడా వికాస కేంద్రాల్లో ఉండేవి..

  • 200 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌
  • కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, షటిల్‌, బ్యాడ్మింటన్‌ తదితర కోర్టులు
  • క్రికెట్‌ సాధనకు అనువైన నెట్‌లు ఏర్పాటు
  • జిమ్నాజియం కోర్టు
  • క్రీడాకారులు దుస్తులు మార్చుకునేందుకు గదులు
  • మరుగుదొడ్లు

నిర్మించే ప్రదేశాలు

ఆచంట, దేవరపల్లి, భీమడోలు, తాడేపల్లిగూడెం, తణుకు, మొగల్తూరు, వీరవాసరం, కొవ్వూరు, ఏలూరు, గోపన్నపాలెం, నిడదవోలు, చింతలపూడి, కోటరామచంద్రపురం

జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం వద్ద జలక్రీడల అకాడమీ భవనాల నిర్మాణంలో అయిదేళ్లుగా కదలిక లేదు. క్రీడాభివృద్ధిలో భాగంగా తెదేపా ప్రభుత్వం 2108లో రూ.3 కోట్లతో జల క్రీడల అకాడమీని ఏర్పాటు చేయగా..2019లో వచ్చిన వైకాపా ప్రభుత్వం శ్రద్ధ వహించక నిర్మాణాలు ఆగిపోయాయి. బకాయిలుండటంతో గుత్తేదారు పనులు ఆపేశారు. క్రీడాకారులకు వసతి లేకపోయింది. కానీ ఇక్కడ జలక్రీడల్లో శిక్షణ పొందుతున్న పలువురు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలోనూ ఈత, కెనోయింగ్‌, కాయకింగ్‌లో పతకాలు సాధించారు. నిర్మాణాలు పూర్తయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్న క్రీడాకారులకు అవకాశాలు దక్కేవి.

పునాదుల్లోనే : నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడిలో రూ.2 కోట్లతో మొదలైన క్రీడా వికాస కేంద్ర నిర్మాణం గోడల స్థాయిలో ఆగిపోయింది. తెదేపా హయాంలో ఈ భవనం మంజూరు చేశారు. రెండేళ్ల కిందట కదలిక వచ్చినా కొంత మేర చేసి బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులు ఆపేయడంతో అసంపూర్తిగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని