logo

ఎంత మోసం.. జగన్‌?

 రేవు దాటాక తెప్ప తగలేసినట్లు ఉంది హామీల విషయంలో సీఎం జగన్‌ తీరు..ఉమ్మడి పశ్చిమలో సీట్ల వేట కోసం ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసిన జగన్‌  అడుగడుగునా బూటకపు హామీలు ఇస్తూ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. 

Updated : 14 Apr 2024 05:26 IST

జనంతో ఓట్లాట
పాద యాత్ర హామీలు గోదారి పాలు
అయిదేళ్లయినా పట్టించుకోని సీఎం

 రేవు దాటాక తెప్ప తగలేసినట్లు ఉంది హామీల విషయంలో సీఎం జగన్‌ తీరు..ఉమ్మడి పశ్చిమలో సీట్ల వేట కోసం ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసిన జగన్‌  అడుగడుగునా బూటకపు హామీలు ఇస్తూ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు.  ఇచ్చిన వాగ్దానాలు విస్మరించారు. 13 స్థానాలు కట్టబెట్టిన ప్రజలను దారుణంగా మోసం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఓట్లు అడిగేందుకు వస్తున్న జగన్‌ను చూసి ‘ఎంత మోసగాడివయ్యా జగన్‌.. నువ్వెంత వేషగాడివయ్యా  జగన్‌’ అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.

ఈనాడు, భీమవరం


జగన్‌హామీ

‘నరసాపురంలో కుట్లు, అల్లికలపై ఆధారపడి 15 వేల మంది అక్కచెల్లెమ్మలు బతుకుతున్నారు. వారికి చాలా కష్టాలున్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేతి అల్లికలపై ఆధారపడి జీవించే ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా రూ.2వేల పెట్టుబడి రాయితీ ఇస్తాం’ అని జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు 2018 మే 30న నరసాపురం వచ్చినప్పుడు హామీ ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితి

హామీ ఇచ్చి ఆరేళ్లవుతున్నా.. అధికారంలోకి వచ్చి ఆయిదేళ్లు పూర్తి కావస్తున్నా అల్లికలపై ఆధారపడి జీవించే అక్కచెల్లెళ్లు గుర్తు రాలేదు జగనన్నకు. ప్రతి నెలా రూ.2వేల పెట్టుబడి రాయితీ ఇస్తానని 50 నెలలు దాటినా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు కనీసం ఈ రంగంపై ఆధార పడి జీవిస్తున్న మహిళల పరిస్థితి ఏమిటని ఆరా తీసిన పాపాన పోలేదు. జగనన్న ఓట్ల కోసం వాగ్దానం చేయలేదని ఆ రంగాలపై ఆధారపడుతున్న 15 వేలమంది ఆడపడుచులంతా  నమ్మి ఓట్లేసి గెలిపించారు. అంతా అయ్యాక గాని వారికి తత్వం బోధపడలేదు.

‘అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో సముద్ర తీరంలో ఆక్వా ఉత్పత్తులకు తగినట్లు శీతల గిడ్డంగులు, ప్రొసెసింగ్‌ యూనిట్లు పెట్టిస్తాం’ అని జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 2018 మే 27న  భీమవరం వచ్చినప్పుడు హామీ ఇచ్చారు.

జగన్‌ ఆక్వా రైతులు, మత్స్యకారులపై హామీల ఎరేసి బూటకపు మాటలతో వలేసి ఓటర్లను గంపగుత్తుగా కాజేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మీరెవరో నాకు తెలియదన్నట్లు వ్యవహరించారు.  జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. తీరంలో దాదాపు 33వేల మంది మత్స్యకారులున్నారు. వీరికి గిడ్డంగుల సౌకర్యం లేక.. గిట్టుబాబు కాకున్నా సరుకు అమ్ముకుంటున్నారు. శీతల గిడ్డంగులుంటే నిల్వ చేసుకుని ధర పెరిగినప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ప్రోసెసింగ్‌ యూనిట్లు   ఉంటే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుంది.  

‘పాలకొల్లులో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచి నీటిని అందిస్తాం’ అంటూ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో 2018 జూన్‌-2న పాలకొల్లు వచ్చినప్పుడు చెప్పారు.

వశిష్ఠ గోదావరి కూత వేటు దూరంలో ఉన్నా పాలకొల్లు పట్టణ ప్రజల దాహం కేకలు ఆగడం లేదు. సీఎం జగన్‌ ఉదాసీనతతో పట్టణంలో హౌసింగ్‌బోర్డు కాలనీ, రామయ్యహాల్‌ కాలనీ, పార్వతీనగర్‌ తదితర శివారు ప్రాంతాల్లో ప్రజల గొంతెండుతోంది. గోదావరి పక్కనున్నా తాగునీరు కొనుక్కుని తాగడానికి అసమర్థ ప్రభుత్వ పాలనే కారణమని పట్టణ ప్రజలు అంటున్నారు.

‘పాలకొల్లులో దమ్మయ్యపర్తి డ్రెయిన్‌ పొంగకుండా చూసుకుంటాం’ అంటూ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రలో 2018 జూన్‌-2న పాలకొల్లు వచ్చినప్పుడు హమీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి ఒక్క డ్రెయిన్‌లో పూడిక తీసి ఆధునికీకరణ పనులు చేపట్టలేకపోవటంతో పాలకొల్లు పట్టణ ప్రజలు నవ్వుతున్నారు. దమ్మయ్యపర్తిని డ్రెయిన్‌ పొంగకుండా చూసుకుంటానని చెప్పిన సీఎం ఏటా అది పొంగి పట్టణమంతా మురికి కూపంగా మారుతున్నా..చూస్తూనే ఉన్నారు. 80 వేల మంది జనాభా ఉన్న పట్టణం ఈ ఒక్క డ్రెయిన్‌తో ముంపు బారిన  పడుతోంది.  పట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

‘వెంకయ్య  వయ్యేరు కాలువ పనులు పునరుద్ధరిస్తాం’ అంటూ జగన్‌ ప్రజాసంకల్ప యాత్రలో 2018 మే-25న ఆకివీడు వచ్చినప్పుడు హమీ ఇచ్చారు.

పాలన పూర్తి కావస్తున్నా వయ్యేరు కాలువ పునరుద్ధరణ పనులు సీఎం సారుకు గుర్తు రాలేదు. పెంటపాడు, గణపవరం, ఆకివీడు మండలాల్లో దాదాపు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించే కాలువ తూడు, గుర్రపుడెక్కతో నిండిపోయింది. కొన్ని ప్రాంతాలకు నీరు వెళ్లడంలేదు.ఈ అయిదేళ్లలో దీని ఆధునికీకరణ పనులకు ప్రతిపాదనలు కూడా పంపిన దాఖలాలు లేవు.

‘పాలకోడేరు మండలం ఉప్పరగూడెంలో రహదారి వేయిస్తాం’ అంటూ జగన్‌ ప్రజాసంకల్ప యాత్రలో 2018 మే-25న ఆకివీడు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు.

జగన్‌ గత అయిదేళ్ల పాలనలో పాలకోడేరు మండలం ఉప్పరగూడెం రహదారి నిర్మాణాన్ని కూడా నెరవేర్చలేకపోయారు. పాలకోడేరు నుంచి ఉండి వెళ్లేందుకు దగ్గరి దారిగా దీన్ని వినియోగిస్తారు. నిత్యం వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇన్నేళ్ల పాలనలో ఆ రహదారిపై తట్టెడు మట్టి పోయలేదు. ఫలితంగా ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని