logo

దేనికి సిద్ధం.. మాయమాటలకా.. ముంచటానికా?

రైతన్నల కోసం అది చేశాం ఇది చేశామని.. తమ పార్టీ పేరులోనే రైతుకు ప్రాధాన్యమిచ్చామని చెప్పుకొనే సీఎం జగన్‌ అన్నపూర్ణగా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లాకు ఏం చేశారో చెప్పాలి. సాగు నీరందించే పంట కాలువల ఆధునికీకరణ పూర్తిచేశారా..

Updated : 15 Apr 2024 06:04 IST

అయిదేళ్లలో అటకెక్కిన ఆధునికీకరణ
డెల్టాను అస్తవ్యస్తం చేసిన జగన్‌ ప్రభుత్వం
రేపు జిల్లాలో సీఎం బస్సు యాత్ర
పాలకొల్లు, న్యూస్‌టుడే

రైతన్నల కోసం అది చేశాం ఇది చేశామని.. తమ పార్టీ పేరులోనే రైతుకు ప్రాధాన్యమిచ్చామని చెప్పుకొనే సీఎం జగన్‌ అన్నపూర్ణగా పేరొందిన పశ్చిమగోదావరి జిల్లాకు ఏం చేశారో చెప్పాలి. సాగు నీరందించే పంట కాలువల ఆధునికీకరణ పూర్తిచేశారా.. పంటలను ముంపు నుంచి రక్షించే డ్రెయిన్లలో పూడిక తీయించారా.. శిథిలావస్థకు చేరిన అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లకు మరమ్మతులు చేయించారా.. వరదల వేళ జిల్లాను వణికిస్తున్న వశిష్ఠ గోదావరి ఏటిగట్టు ఎత్తు పెంచారా అనేది స్పష్టం చేయాల్సి ఉంది. శిథిలస్థితికి చేరిన డెల్టా వ్యవస్థతో ప్రజలు నిత్యం యుద్ధం చేస్తుంటే ఏం పొడిచేశారని ఇప్పుడు సిద్ధం అంటూ జిల్లాలో అడుగు పెడుతున్నారో సమాధానం చెప్పాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.


గట్టెక్కించ  లేకపోయారు..

అస్తవ్యస్తంగా గోదావరి ఏటిగట్టు

జిల్లాలో 60 కి.మీ. మేర విస్తరించి ఉన్న వశిష్ఠ గోదావరి ఏటిగట్టు పటిష్ఠ తకు చర్యలు తీసుకుంటామని 2022 జులైలో చెప్పిన మాట ముఖ్యమంత్రి మరిచిపోయారని నదీ తీరాన ఎక్కడ   చూసినా గుర్తుకొస్తోంది. పనులు చేసింది ఎటూ లేదు. ఎనిమిది చోట్ల బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రూ.161 కోట్లతో ప్రతిపాదనలు చేశారు కదా.. వాటికైనా నిధులిచ్చి పనులు చేసి ఇప్పుడు సిద్ధమంటే బాగుండేదని చించినాడకు చెందిన సత్యనారాయణరాజు వాపోయారు. నరసాపురం పొన్నపల్లిలో గట్టు పనులకు రూ.26 కోట్లు విదిల్చి కావాల్సిన వారికి పనులు అప్పగించేసి నాణ్యతకు తిలోదకాలివ్వడంతో ఇప్పటికి రెండుసార్లు గట్టు జారిపోయి మూడోసారి మళ్లీ సిద్ధమవుతుందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. వరదలకు ఏటా ఏటిలో మునుగుతున్న నదీతీర వాసులను గట్టెక్కించలేని సీఎం దేనికి సిద్ధమంటున్నారో చెబితే బాగుంటుందనే విమర్శలు ఊళ్లలో రచ్చబండల దగ్గర రింగుమంటున్నాయి.


ఆధునికీకరణ అబద్ధం..

తణుకు మండలం ముద్దాపురం లాకుల నుంచి లీకవుతున్న సాగునీరు

డెల్టాలో ప్రధాన పంట వరి సాగు సకాలంలో ప్రారంభించి సరైన దిగుబడులు సాధించాలంటే కాలువలే ఆయువుపట్టు. అంతటి ప్రాముఖ్యం ఉన్న సాగునీటి కాలువల నిర్వహణ పనులకు నీళ్లొదిలేయడం తప్ప.. ఏ ఏడాదైనా పూర్తిస్థాయి నిధులు మంజూరు చేశారా?. జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో 11 ప్రధాన పంటకాలువల కింద సుమారు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ ఏడాది కూడా నిర్వహణ పనులకు రూ.17.14 కోట్లతో 150కు పైగా పనులు చేయడానికి జలవనరులశాఖ ప్రతిపాదనలు చేసింది. వీటికేమైనా మంజూరు చేశారా అంటూ డెల్టా రైతులు అడుగుతున్నారు. ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన లాకుల తలుపులు చాలాచోట్ల ఊడిపోయి సాగునీరు వృథాగా పోతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోతున్నాడు. ఉమ్మడి జిల్లాలో నీటితీరువా రూపేణా ఏటా రూ.20 కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. ప్రధాన పంటలన్నింటికీ మార్కెట్‌ కమిటీల ద్వారా శిస్తు రూపేణా మరో రూ.70 కోట్ల వరకు కడుతున్నాం కదా. వాటి నుంచి కొంత మంజూరు చేసినా దగ్గరుండి పనులు చేయించుకోవడానికి మేమంతా సిద్ధమని చెబుతున్నారు.


ముంచేయడానికి  డ్రెయిన్లు సిద్ధం

వడ్డిలంకలో నక్కల అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌పై మొరాయిస్తున్న గేట్లు

జిల్లాలో 21 మేజర్‌, 59 మీడియం, 500పైగా మైనర్‌ డ్రెయిన్లున్నాయి. అయిదేళ్లుగా వీటిలో బకెట్‌ మట్టి కూడా తీయకపోవడంతో మొత్తం పూడిపోయాయి. ఇప్పటికే అయిదారుసార్లు మీ పాలనలో దుఖఃదాయనులన్నీ పంటలను ముంచెత్తాయి. వందల కోట్లు విలువైన పంటలను నాశనం చేసి రైతులను అప్పుల ఊబిలోకి నెట్టాయి. రెండేళ్లుగా డ్రెయిన్ల అభివృద్ధికి మీరు పైసా ఇవ్వకపోవడంతో వచ్చే వర్షాకాలం మళ్లీ ముంచెత్తడానికి మొత్తం సిద్ధంగా ఉన్నాయంటే మీరేమైనా జవాబు ఇవ్వగలరా అని నష్టపోయిన అన్నదాతలు అడుగుతున్నారు. నక్కల, కాజ, తూర్పుకొక్కిలేరు, ముసికేపాలెం అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల మరమ్మతులకు ముందుకొచ్చిన గుత్తేదారులే లేరు. రెగ్యులేటర్ల మరమ్మతులు, అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల అభివృద్ధి పనులంటూ రెండేళ్లకు పైబడి రూ.500 కోట్లు మంజూరు చేయాలని డ్రెయిన్లశాఖ చేసిన ప్రతిపాదనలు కనీసం కన్నెత్తి చూడని మీరు.. ఎన్నికల జాతరలో సిద్ధమని ఎలా బయల్దేరారని రైతులు నిలదీస్తున్నారు. ఇన్ని అవస్థల మధ్య వ్యవస్థలు నిర్వీర్యమైపోతుంటే డెల్టాకొచ్చి ఎలా సిద్ధమంటున్నారని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు