logo

జగ న్‌..కర్షకుల కన్నీళ్లు పట్టవా?

ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.

Published : 19 Apr 2024 04:10 IST

అనాథగా ఎర్రకాలువ ప్రాజెక్టు
నిర్వహణను పట్టించుకోని వైకాపా ప్రభుత్వం

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఎర్ర కాలువ ప్రాజెక్టు నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో మెట్ట రైతులకు శాపంగా మారింది. 24,700 ఎకరాల ఆయకట్టు లక్ష్యం కాగా.. ప్రస్తుతం 14 వేలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నారు. కేవలం డీఈ, ఏఈ, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఏడుగురు లస్కర్లతో ఇంత పెద్ద ప్రాజెక్టును నెట్టుకొస్తున్నారు. 83.50 మీటర్ల గరిష్ఠ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో 4.428 టీ©ఎంసీల నీరు నిల్వ చేయవచ్చు. కానీ భద్రత లేని కారణంగా ప్రస్తుతం 82.63 మీటర్లకే పరిమితం చేస్తున్నారు. ఈ కారణంగా 2.26 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంటోంది.


కుడి, ఎడమ ప్రధాన కాలువలకు లైనింగ్‌ లేదు. తూడు పెరిగింది. ఎక్కడికక్కడ గట్లకు గండ్లు పడ్డాయి. షట్టర్లు కొట్టుకుపోయాయి. గేట్లు తుప్పుపట్టాయి. సుమారు 60 ఓటీ స్లూయిజ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. క్రాస్‌ రెగ్యులేటర్లు బాగోలేక ఉప కాలువల్లో నీరుపారక శివారు భూములకు చేరడం లేదు. కాలువలు, ఉపకాలువల తవ్వకాలు అసంపూర్తి మిగిలాయి.


ఎర్రకాలువ ఆధునికీకరణకు రూ.25 కోట్లు కేటాయించగా ఏ పనీ జరగలేదు. కుడి ప్రధాన కాలువపై ఉప కాలువల నిర్మాణ పనులకు ఏడు పర్యాయాలు టెండర్లు పిలవగా.. గత పనుల బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో గుత్తేదారులెవరూ స్పందించలేదు. ఈ పరిస్థితుల్లో నీటి నిర్వహణ చేయడానికి జలవనరుల శాఖ అష్టకష్టాలు పడుతోంది.


ఎడమ ప్రధాన కాలువ పరిధిలో అదనంగా 3వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు బయనేరుపై నిర్మించిన అక్విడక్టు ఆరేళ్ల కిందట కూలింది. పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరైనా గుత్తేదారులు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. ఫలితంగా ఆయకట్టుకు సాగునీటి సరఫరా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని