logo

విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదు

వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల  జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది.

Published : 19 Apr 2024 04:24 IST

జగన్‌ హయాంలో పింఛనుదార్లకు పాట్లు


ఉమ్మడి జిల్లాలో విశ్రాంత ఉద్యోగుల సంఖ్య  : 15,300  
ప్రతి నెలా పింఛను  చెల్లింపులు  రూ.60 కోట్లు (సుమారుగా)


కుక్కునూరు, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో విశ్రాంత ఉద్యోగుల  జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. విశ్రాంత సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాల్సిన వారి జీవననౌక ఆర్థిక ఆటుపోట్లకు గురవుతోంది. జగన్‌ గద్దెనెక్కాక వారి కష్టాలు మొదలయ్యాయి. 10- 15 తేదీలు వస్తేగాని పింఛను అందడం లేదు. కరవుభత్యం ఒక్కసారే చెల్లించారు. క్వాంటమ్‌ పింఛనులో కోత, డీఏల తగ్గింపు వంటి చర్యలతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని పింఛనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
2019 నుంచి.. 2019లో జగన్‌ పీఠం ఎక్కగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ కొంతకాలం ఇచ్చారు. తర్వాత పీఆర్‌సీ కమిషన్‌ నివేదికను పట్టించుకోకుండా 23 శాతం రివర్స్‌ పీఆర్సీ అమలు ఇస్తున్నారు. ఒకటో తేదీన పింఛను సొమ్ము అందుకున్నది ఈ అయిదేళ్లలో ఒక్కసారీ లేదు. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 డిసెంబరు వరకూ 21 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు. 2018 జులై నుంచి ఇప్పటివరకూ 185 నెలల కరవుభత్యం పెండింగులో ఉన్నాయి. 70 ఏళ్లలోపు పింఛనుదారులకు అదనపు భృతి గతంలో 10 శాతం ఉండగా.. దానిని 7కు కుదించారు. 75 ఏళ్లవారికి 15 శాతం ఉండగా.. 12కు తగ్గించారు. పింఛనుదారులు చనిపోతే వారికి చెల్లించాల్సిన మట్టిఖర్చులుపింఛను మంజూరు చేసే విధానాన్ని మార్పు చేసి రూ.25 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు.


దీనస్థితిలో బాధితులు

విశ్రాంత ఉద్యోగులు కాలం చేస్తే.. ఆ కుటుంబానికి ఆ ఉద్యోగికి వచ్చే పింఛనుపై 60 శాతం మాత్రమే చెల్లిస్తారు. దీంతో వారికి నెలకు రూ.15-20 వేలకు మించిరావు. ప్రతి నెలా వీరికి పింఛన్లు ఆలస్యంగా అందుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.


గత ప్రభుత్వంలో..

రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంటుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పదో పీఆర్సీ ఇచ్చారు. జూన్‌ 2014 నుంచి మార్చి 2015 వరకు 10 నెలల పీఆర్సీ బకాయిలు ఒకేసారి పింఛనుదారులందరికీ చెల్లించారు. ఉద్యోగ విరమణ తేదీకి 15 రోజులు ముందుగానే ట్రెజరీలో బిల్లుల చెల్లింపు కోసం ప్రత్యేక జీవో తెచ్చారు. ఉద్యోగ విరమణ రోజే పింఛను గ్రాట్యుటీ, కమ్యుటేషన్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, జీపీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంటు తదితరాలు ఉద్యోగులకు సకాలంలో అందించారు. ప్రతినెలా 31వ తేదీ లేదా ఒకటో తేదీన పింఛను ఇచ్చేవారు.


ఆరోగ్య కార్డులు చెల్లవు

ఆరోగ్య (ఈహెచ్‌ఎస్‌) కార్డులను నిర్వీర్యం చేశారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళితే ఆ కార్డులతో నగదు రహిత సేవలు అందటం లేదు. అప్పు చేసి ఆ బిల్లులను రీయింబర్స్‌మెంట్‌ చేస్తే ఆ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. ఇక డీఏలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చూపి ఆదాయపు పన్ను వసూలు చేస్తుండటం గమనార్హం.


మొదటి  తేదీ పింఛను  అందుకుని చాలా కాలమైంది

పింఛను మొదటి తారీఖున అందుకొని చాలా కాలమైంది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. 2019 నుంచి పింఛనుదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. క్వాంటమ్‌ పింఛనులో కూడా కోత విధిస్తే.. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడేవారు వైద్యఖర్చులు ఎలా భరిస్తారు. ఆరోగ్యకార్డులను ప్రైవేటు ఆసుపత్రులు పరిగణనలోకి తీసుకోవడం లేదు.    

గాదిరాజు వెంకటసూరపరాజు, విశ్రాంత ఉపాధ్యాయుడు


వాయిదాల పద్దతిలో డీఏల చెల్లింపు

కేంద్రప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులతో సమానంగా రాష్ట్రప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఆరునెలలకోసారి డీఏ ఇవ్వడంలేదు. వాయిదా పద్దతిలో చెల్లిస్తున్నారు. పీఆర్సీ ఏరియర్స్‌ 2020 నుంచి ఇవ్వటం లేదు. ఆరు డీఏలు రావాలి. పింఛను సొమ్ములపై ఆధారపడి ఈఎంఐలు చెల్లిస్తుంటాం.  

టీవీ సుబ్బారావు, విశ్రాంత ఉపాధ్యాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని