logo

అడవిలో వైకాపా దొంగలు

వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది.

Published : 19 Apr 2024 04:42 IST

సహజ వనరుల్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు
చదును చేసి సాగు చేస్తున్న వైనం

ఉప్పేరు సమీపంలో  రూపం కోల్పోయిన వనం

జంగారెడ్డిగూడెం, కుక్కునూరు, బుట్టాయగూడెం, ఉంగుటూరు, న్యూస్‌టుడే: వైకాపా జమానాలో సహజ వనరుల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యం కలప అక్రమ రవాణా, అడవుల ఆక్రమణ, అటవీ భూముల్లో మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం.. ఒక్క కుక్కునూరు రేంజ్‌లోనే 14 వేల హెక్టార్లలో అడవులు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని చదును చేసి సాగు భూములుగా మార్చుతున్నారు.

మోదెల: నరికివేతకు గురైన వృక్షం


రిజర్వు అడవులు మైదాన ప్రాంతాలుగా మారుతున్నాయి. వందల ఏళ్లనాటి చెట్లను నరుక్కుపోతూ అటవీ దొంగలు రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. పలుచోట్ల ఏపీఎఫ్‌డీసీ జామాయిల్‌ కలపను ఇంటి దొంగలే కాజేస్తున్నారు. సామిల్లులు, కోత యంత్రాల అనుమతులకు, వాటిలో జరుగుతున్న కోత పనులకు పొంతన ఉండటం లేదు. కళ్ల ముందే అక్రమాలు జరుగుతున్నా ఆ శాఖ కళ్లప్పగించి చూస్తోంది. ఉన్నతాధికారులు, టాస్క్‌ఫోర్సు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లకు సమాచారం చేరుతున్న సందర్భాల్లోనే అక్రమ రవాణా వెలుగుచూస్తోంది. లేని పక్షంలో నామ మాత్రం కేసులతో సరిపుచ్చుతున్నారు.


ముడుపులిస్తున్నట్లు వాదన

కుక్కునూరు అటవీ పరిధి సీతానగరంలో దాదాపు 400 ఎకరాల్లో చెట్లను నరికి పత్తి, జామాయిల్‌ సాగుచేస్తున్నారు. వెంకటాపురంలో ఇటీవల అటవీ ఆక్రమణలపై గొడవ జరిగింది. దీనిపై విచారణకు వచ్చిన అధికారుల వద్ద ఆక్రమణ దారులు తాము అటవీ సిబ్బందికి ముడుపులు ఇస్తున్నట్లు బహిరంగంగానే వాదించారు. బంజరగూడెం నుంచి వేలేరు వరకు జామాయిల్‌ క్లోనల్‌ నర్సరీలు వెలిశాయి. పెదరాయిగూడెం, వేలేరు, ఇబ్రాంపేట క్రాస్‌రోడ్‌ సమీపంలోని అటవీ ప్రాంతాన్ని చదును చేసి నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. బడాబాబులు, ఉద్యోగులు కూడా ఉండటం విశేషం.     


పక్కదారి పట్టిన సంపద

  • ఉంగుటూరు వీఎస్‌ఎస్‌ల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో నారాయణపురం, వెంకట్రామన్నగూడెం తదితర గ్రామాల్లో హార్వెస్టు చేసిన జామాయిల్‌ కలప పక్కదారి పట్టింది. ఇందులో ఉంగుటూరుకి చెందిన వైకాపా నాయకుడు కీలక పాత్రధారి అన్న ఆరోపణలున్నాయి. కొందరు వీఎస్‌ఎస్‌ ప్రతినిధులు, అటవీ సిబ్బంది కుమ్మక్కై సొమ్ము చేసుకున్నారు.
  • గోపినాథపట్నం అటవీ ప్రాంతంలో కైకరానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి యంత్రాలతో మట్టి తవ్విస్తున్నారు. ఉద్యాన విశ్వవిద్యాలయం వెనుక భాగంలోనూ మట్టి తవ్వకాలకు అడ్డే లేదు.

విద్యుత్తు లైన్‌ ముసుగులో..

మారుమూల గ్రామం మోదెలకు విద్యుత్తు లైన్‌ నిర్మాణం ముసుగులో వేలేరుపాడు, బుట్టాయగూడెం మండలాల మధ్య వందల చెట్లను నేలకూల్చారు. అప్పటి జేసీ అరుణ్‌బాబు ఆ మార్గంలో ప్రయాణిస్తూ చెట్లు నరికి ఉండటాన్ని చూసి నిలదీశారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేశారు. అప్పట్లో ఇద్దరు అటవీ సిబ్బంది సస్పెండ్‌ అయ్యారు.  


ప్రత్యేక బృందాల దాడితో..

స్వాధీనం చేసుకున్న కలప ట్రాక్టర్లు(పాత చిత్రం)

కామయ్యపాలెం సెక్షన్‌లో నరికి రవాణా చేస్తున్న 5 ట్రాక్టర్ల మారుజాతి కలపను గత నవంబరులో ప్రత్యేక బృందం అధికారులు పట్టుకున్నారు. వందల ఏళ్ల నాటి నల్లమద్ది, తెల్లమద్ది, పాల, కొండ తంగేడు బిల్లి, ముసిని వంటి మారుజాతుల దుంగలు నరికేశారు.స్థానిక ఉద్యోగులు చేతులు కలుపుతుండటంతో అక్రమాలు వెలుగులోకి రావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని