logo

మళ్లీ నరకం చూపించారు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు

Published : 19 Apr 2024 05:08 IST

సీఎం బస్సు యాత్రతో నిలిచిన ట్రాఫిక్‌

తణుకు వైజంక్షన్లో నిలిచిన ట్రాఫిక్‌

ఈనాడు డిజిటల్‌, భీమవరం, తణుకు, తణుకు గ్రామీణం, పెనుగొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమ జిల్లావాసులకు నరకం చూపించింది. మంగళవారం భీమవరం బహిరంగ సభ అనంతరం చిలకంపాడు మీదుగా తణుకు శివారు తేతలి చేరుకుని అక్కడే రాత్రి బస చేశారు. బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా ఒకరోజు విరామం ప్రకటించడంతో అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. అయితే ప్రజలను, స్థానిక వైకాపా నాయకులను కలిసేందుకు సుముఖత చూపలేదు. గురువారం ఉదయం యాత్ర మొదలవుతుందని పలువురు అక్కడికి చేరుకున్నా వారి బాధలు వినేందుకు ఆసక్తి చూపలేదు సరికదా,  వచ్చిన వారికి మంచినీళ్లు కూడా అందకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులను సైతం అనుమతించకపోవడంతో పోలీసులకు, వారికి మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటలకు యాత్ర మొదలవుతుందని ప్రకటించినా జన సమీకరణ జరగకపోవడంతో 11.10కి ఆరంభించారని స్థానిక నాయకులే గుసగుసలాడుకోవడం కనిపించింది.

ముందే వాహనాల్ని నిలిపేసి.. సీఎం ఎప్పుడు బయలుదేరుతున్నారో తెలియకపోవడంతో అటు ఇటు రాకపోకలను నిలిపివేశారు. దాంతో మండుటెండలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏఎస్‌ఆర్‌ కళాశాల సమీపంలో జనం లేకపోయినా బస్సులోంచి అభివాదం చేసుకుంటూ ముఖ్యమంత్రి ముందుకు సాగారు. ఉండ్రాజవరం దాటి షర్మిష్ట కూడలిలో రెండు నిమిషాలు బస్సు నిలిపి దివ్యాంగుల నుంచి వినతులు స్వీకరించారు. అయితే పోలీసులు అత్యుత్సాహంతో అరకిలోమీటరు ముందే ఉండ్రాజవరం కూడలిలో అరగంటకు పైగా వాహనాలను నిలిపివేశారు. దాంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు వాహనాల హారన్లు కొడుతూ నిరసన తెలిపారు. స్థానిక మహిళా కళాశాల, పెరవలి కూడళ్లలో బస్సులోంచి జగన్‌ బయటకొచ్చి అభివాదం చేయడం తప్ప ఎటువంటి వినతులు స్వీకరించలేదు.

 ఉండ్రాజవరం కూడలిలో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని