logo

నోటు తీసుకున్నోళ్లు బటన్‌ నొక్కలేదే!

ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ.

Updated : 18 May 2024 07:04 IST

బూత్‌స్థాయిలో ఆరా తీస్తున్న నేతలు

ఈనాడు డివిజన్, భీమవరం: ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. ఓటుకు ఇచ్చిన నోటు లెక్కలు, వచ్చిన ఓట్ల లెక్కలు మాత్రం వారిలో కొంత అసంతృప్తిని మిగిల్చాయి. ఏ ప్రాంతంలో ఎవరు ఓటు వేసేందుకు రాలేదో అన్న లెక్కలను బూత్‌స్థాయి నుంచి ఆరా తీస్తున్నారు. బూత్‌స్థాయిలో కొన్ని చోట్ల 30 శాతం  ఓట్లు తగ్గడంపై తర్జనభర్జన పడుతున్నారు. తగ్గిన ఓట్ల కోసం వారి వారి లెక్కల ప్రకారం ఒక్కో పార్టీకి సుమారు రూ.2 కోట్ల చొప్పున ఖర్చయ్యింది.  

పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా ఉదయం ఆరున్నరకే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్‌ అంతా ఉదయం 12 గంటల్లోపు పూర్తయిందనేది అన్ని రాజకీయ పక్షాల విశ్లేషణ. స్థానికులు మాత్రం తర్వాత వేద్దాంలేం అని ఊరుకున్నారు. వీరిలో మరీ ఆలస్యంగా బూత్‌కి వెళ్లిన వారంతా రాత్రి 12 గంటల వరకు నిలబడి ఓటేయాల్సి వచ్చింది. ఓపిక లేని  కొంతమంది వెనుదిరిగారు. వారే బటన్‌ నొక్కనివారు కావచ్చని ప్రాథమికంగా బూత్‌కమిటీలు అంచనాకు వచ్చినట్లు సమాచారం.

డిమాండ్‌ చేసి తీసుకెెళ్లినా

ఓటుకు ఓ పార్టీ రూ.2 వేలు పంపిణీ చేయగా, డ్వాక్రా సభ్యులకు, ఉద్యోగులకు రూ.వెయ్యి నుంచి 2 వేలు అదనంగా చేతులు తడిపారు. నెలరోజుల పాటు బూత్‌ కమిటీల నిర్వహణకు రూ.20 వేల నుంచి రూ.30 వేల చొప్పున ఖర్చు చేశారు. ఈ లెక్కలన్నీ వేస్తే కోట్ల రూపాయలని తేలింది. అయితే ఇంకా 20 శాతం వరకు ఓట్ల నమోదు తగ్గడం వారిని అసంతృప్తికి గురిచేసింది. ముఖ్యంగా ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటూ ఆరా తీసి..వారి జాబితాల్లో చూసుకొని మరీ సొమ్ములిచ్చారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోని కొంతమంది ఓటర్లు మా ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయంటూ నాయకులను డిమాండ్‌ చేసి మరీ తీసుకున్నారు. పంపిణీ ఆలస్యమైతే ఆయా ప్రాంతాల్లో బూత్‌కమిటీల వారిని నిలదీశారు. కొందరైతే ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వానికి తిట్ల దండకం అందుకున్నారు. బాబోయ్‌ వీరితో పడలేమని మరుసటి రోజు తెల్లవారుజామున కూడా భీమవరంలో నగదు పంపిణీ చేశారు.

ఎందుకు తగ్గింది

ఓట్ల నమోదు తేల్చాక ఇదేం దారుణమంటూ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొన్నిచోట్ల ఏ వార్డుల్లో ఓటర్లు వేయలేదనే గణాంకాలను రహస్యంగా సేకరిస్తున్నారు. భీమవరంలో కొన్ని వార్డుల్లో 70 శాతమే నమోదైంది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన, తొలగించిన, పొరుగు బూత్‌లకు మళ్లిన వారు ఎవరెవరనే వివరాలను సైతం తెలుసుకుంటున్నారు. ఎందుకు ఓట్ల శాతం తగ్గిందంటూ అంచనాలు వేస్తున్నారు. అనుచరగణంతో సమాచార సేకరణలో కాస్త కటువుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన సొమ్ము రూ.కోట్లలో ఉంది. మరీ 30 శాతం పైగా ఓట్లు రాలేదంటే ఆ సొమ్ము లక్షల్లో ఉంటుంది. అదంతా బూడిదలో పోసిన పన్నీరే అన్న ఆగ్రహాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో వార్డుల వారీ సమాచారాన్ని సేకరించి, ఎవరు ఓట్లు వేశారు, ఎవరు వేయలేదనే దానిపై ఆరా తీసేందుకు సిద్ధమవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు