logo

‘సొమ్ము’సిల్లిన పనులు

నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి ఎన్ని కబుర్లు చెప్పినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం చతికిలపడ్డాయి.

Published : 21 May 2024 03:14 IST

నిధుల్లేక కొలిక్కి రాని నాడు-నేడు రెండో విడత నిర్మాణాలు
మరో 23 రోజుల్లో బడులు ప్రారంభం
ఈ సారీ అవస్థలే స్వాగతం

ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే-జంగారెడ్డిగూడెం, కైకలూరు, నిడమర్రు: నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి ఎన్ని కబుర్లు చెప్పినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం చతికిలపడ్డాయి. మరో 23 రోజుల్లో వేసవి సెలవులు ముగిసి  పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో పూర్తి కాని పనులు.. ప్రభుత్వ, అధికారుల  వైఫల్యాలను వెక్కిరిస్తున్నాయి. విద్యా సంవత్సరాలు మారుతున్నా.. పాఠశాల రూపురేఖల్లో మాత్రం మార్పు లేదు.  

జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరానగర్‌ కాలనీలోని ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ఎన్నికలకు ముందు రూ.1.50 లక్షలు వచ్చినా ఇసుక, సిమెంట్‌ కొరతతో పనులు ముందుకు సాగలేదు. మంచి నీటి ట్యాంకులు మంజూరైనా పునాదుల్లోనే ఆగిపోయాయి. ఈ పాఠశాలలో మొత్తం 163 మంది విద్యార్థులుండగా అయిదు గదులు మాత్రమే ఉన్నాయి .వరండాలో పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. 
 ఏవీ పూర్తి కాక.. నాడు-నేడు రెండో విడత పనులు 2021-22 విద్యా సంవత్సరంలో మొదలు పెట్టారు. వేసవి సెలవుల అనంతరం 2022-23లో బడులు తెరిచే నాటికి పూర్తి చేస్తామంటూ వైకాపా సర్కారు బాకాలూదింది. గడువు ముగిసి ఏడాది కావస్తున్నా పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి కావటం దాదాపు అసాధ్యం. ఈ ఏడాది కూడా విద్యార్థులు అవస్థల బడికే వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరుగుదొడ్లు, వంటగదులు, ప్రహరీలు, విద్యుత్తు సౌకర్యం..ఇలా ఏ పనులూ పూర్తి కాలేదు. ఈ అంశమై సమగ్రశిక్షా జిల్లా అధికారి సోమశేఖర్‌ను వివరణ కోరగా సాధ్యమైనంత మేరకు వేగంగా చేస్తున్నామని..పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

నిధుల గ్రహణం

గతేడాది నవంబరు నుంచి నిధుల సమస్యతో కొన్ని, ఇసుక, సిమెంట్‌ అందుబాటులో లేక మరికొన్ని పనులు నిలిచిపోయాయి. జరుగుతున్నాయనిపించుకునేందుకు అక్కడక్కడా చేయిస్తున్నారు. జిల్లాలో రూ.285 కోట్ల పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికి ఖర్చు చేసింది..రూ.147 కోట్లు కాగా అందులో దాదాపు 30 శాతం బిల్లులు పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 245 అదనపు తరగతి గదులు నిర్మించాల్సి ఉండగా గత రెండేళ్లలో పూర్తి చేసింది 37 మాత్రమే. వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడాల్సిందే. చిన్నా పెద్దా అన్నీ కలిపి మరమ్మతులకు 923 ఎంపిక కాగా ఇంకా 368 పాఠశాలల్లో పూర్తి కాలేదు. మరమ్మతులైనా పూర్తి చేస్తే విద్యార్థులకు కొంత ఇబ్బంది లేకుండా ఉండేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.


జంగారెడ్డిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు నేడు రెండో విడతలో 17 తరగతి గదులు నిర్మించాల్సి ఉండగా ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్‌ పని మాత్రమే జరుగుతోంది. ఆరు గదులు మాత్రమే కడుతున్నారు. మొదటి, రెండు అంతస్తుల్లో ఇంకో 11 గదులు కట్టాలి. పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి కావటం దాదాపు అసాధ్యమే. నిధుల సమస్యతో పనులు సాగడం లేదు. జిల్లాలోనే అతి పెద్ద పాఠశాలల్లో ఒకటైన ఇందులో తరగతి గదుల కొరతతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 


కైకలూరు మండలం సీతనపల్లి ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణం  శ్లాబు వరకు పూర్తి అయింది. దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు చేసినా బిల్లులు మాత్రం మరో రూ.6 లక్షలు రావాల్సి ఉంది. పనుల పూర్తికి మరో రూ.6 లక్షల వరకు అవసరమవుతాయి. దీంతో నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది.బడి  తెరిచే నాటికి పూర్తి చేసే అవకాశం కనిపించటం లేదు..


నిడమర్రు మండలం పెదనిండ్రకొలను ఉన్నత పాఠశాలను హైస్కూల్‌ ప్లస్‌గా ఉన్నతీకరించారు.  అదనంగా నాలుగు గదులు నిర్మించేందుకు రూ.33 లక్షలు మంజూరయ్యాయి. ఒక గది పనులు కొలిక్కి రాగా మిగిలిన మూడు గదుల నిర్మాణం నిధుల్లేక అసంపూర్తిగా నిలిచిపోయింది. మరో మూడు వారాల్లో తరగతులు మొదలవుతున్నాయి. తరగతులు నిర్వహించే మార్గం కనిపించడంలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని