logo

ఆ సర్కిల్‌లో అంతే!

పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఉన్న సిబ్బంది సరిపోక అదనంగా పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కొంతమంది తీరు చర్చనీయాంశంగా మారింది. వారు విధులకు హాజరు కారు..

Published : 21 May 2024 03:16 IST

జీతం తీసుకుంటారు.. విధులకు హాజరుకారు

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఉన్న సిబ్బంది సరిపోక అదనంగా పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కొంతమంది తీరు చర్చనీయాంశంగా మారింది. వారు విధులకు హాజరు కారు.. జీతాలు మాత్రం నెలనెలా తీసుకుంటారు. ఇందుకు వేతనంలో సగం ఇచ్చి మేనేజ్‌ చేస్తుంటారు. ఆ సొమ్ము కొంతమంది జేబుల్లోకి వెళ్లిపోతోంది. ఇంకేముంది వారు రాకపోయినా మస్తర్లు వేసి మొత్తం జీతం వచ్చేలా అక్కడి బాధ్యులు చక్రం తిప్పుతుంటారు. ఏలూరు నగరంలోని ఆర్‌ఆర్‌పేట పారిశుద్ధ్య విభాగం 11వ సర్కిల్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. అక్కడ మొత్తం 45 మంది సిబ్బంది పని చేయాల్సి ఉండగా సుమారు 15 మంది కొంతకాలం నుంచి విధులకు హాజరుకావడం లేదు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులైన వీరికి నెలకు రూ.20 వేలు వస్తుంది. వీరు విధులకు హాజరు కానందున రూ.10 వేలిస్తారు. మిగిలిన మొత్తం అక్కడి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ దగ్గర నుంచి సంబంధిత అధికారుల వరకు ఎవరి వాటాలు వారికి చేరిపోతుంటాయని అంటున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడని ఈ బాగోతం తెలిసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఫలితంగా పారిశుద్ద్యం పై ఆ ప్రభావం పడుతుంది. 

పెరుగుతున్న పని భారం.. మరో వైపు సిబ్బందిపై పనిభారం పడుతోంది. 45 మంది సిబ్బంది పని చేయాల్సి ఉండగా.. 15 మంది రాకపోవడంతో ఉన్న 30 మంది ఆ పని అంతా చేయాల్సి వస్తోంది. వీరు నిత్యం డ్రెయిన్లలో పూడిక తీయడం, చెత్త సేకరించడం, రహదారుల్ని ఊడ్చటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.  సిబ్బంది కొరత ఉండటంతో పనులు సజావుగా సాగడం లేదు. ఆర్‌ఆర్‌పేటలోని పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతోంది. డ్రెయిన్లలో మురుగు పారక దోమల బెడద వెంటాడుతోంది. 

పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. ‘ఆ సర్కిల్‌లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. సిబ్బంది విధులకు రాకుండా జీతాలు తీసుకోవడం కుదరదు’ అని నగర కమిషనర్‌ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని