logo

రీ-సర్వేతో కొత్త కష్టాలు

భూ రికార్డుల స్వచ్ఛీకరణ పేరుతో ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రక్రియలో లోపాలతో ఇప్పటికే పలువురు రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

Published : 21 May 2024 03:30 IST

1బీ అడంగల్‌ పత్రాల్లో డిజిటల్‌ సంతకాలు లేక ఇబ్బంది
రుణాల కోసం రైతుల ఎదురు చూపులు 

నవుడూరులో సర్వే చేస్తున్న సిబ్బంది (పాత చిత్రం)

భీమవరం వన్‌టౌన్, టి.నరసాపురం, న్యూస్‌టుడే: భూ రికార్డుల స్వచ్ఛీకరణ పేరుతో ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రక్రియలో లోపాలతో ఇప్పటికే పలువురు రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సర్వే నిర్వహిస్తున్న గ్రామాల్లో రైతులకు తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకంతో కూడిన 1బీ అడంగళ్ల కాపీలు రాకపోవడంతో రుణాలు మంజూరు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రీ-సర్వే ప్రక్రియ పూర్తికాని గ్రామాల పరిధిలోని భూములకు 1బీ అండగల్‌ పత్రాలు రావడంలేదు. దీంతో రబీలో ఆయా గ్రామాల్లో కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసినవారు, రుణాలు రీషెడ్యూల్‌ చేసుకుందామనుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఈ పరిస్థితుల్లో పంట పెట్టుబడుల నిమిత్తం అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వచ్చిందని పలువురు రైతులు వాపోయారు. 

ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 293 రెవెన్యూ గ్రామాలకుగాను గత ఏడాది చివరి నాటికి 16  రెవెన్యూ గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకున్నారు. సహకార సంఘాలు, బ్యాంకుల్లో రైతులు రుణాలు పొందాలంటే తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకాలతో కూడిన 1బీ అండగల్‌ పత్రాలు తప్పనిసరి. ఈ జిల్లాలోని 122 సహకార సంఘాలు, సుమారు 354 ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ పత్రాలు లేనిదే రైతులకు రుణం మంజూరు చేయరు. పలు సహకార సంఘాల పరిధిలో ఇలాంటి పరిస్థితి ఉండటంతో రుణాలు పొందలేకపోయారు.

  • వీరవాసరం మండలం మత్స్యపురి సహకార సంఘంలో మొత్తం 1,600 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి కొంతమంది రైతులు కొత్త రుణాలు పొందారు. వీరిలో 30 మంది 1బీ అడంగళ్‌ పత్రాలపై తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం లేకపోవడంతో రుణం పొందలేకపోయారు. 
  • టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం పీఏసీఎస్‌ పరిధిలో ఆరుగురు, మధ్యాహ్నపువారిగూడెం పరిధిలో నలుగురు రైతులకు రుణాల కోసం ఇబ్బందులు  తప్పడం లేదు. వన్‌బీ, తహసీల్దారు డిజిటల్‌ సంతకాలు లేక, సర్వేలో భూములు తగ్గి, పాస్‌బుక్‌లపై ఫొటోలు సరిగా లేక తిప్పలు పడుతున్నారు. వాటితో సహకార సంఘాల్లో రుణాలు అందడం లేదు.

ఎల్‌పీ నంబర్‌తో సమస్య.. గ్రామాల్లో సాధారణంగా ఒక సర్వే నంబరులో ముగ్గురు, నలుగురు అంతకంటే ఎక్కువ మందికి భూములు ఉంటాయి. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పాత సర్వే నంబరు స్థానంలో ఎల్‌పీ నంబర్‌ తీసుకొచ్చారు. అసలు సమస్య ఇక్కడే మొదలైందని పలువురు సహకార సంఘాల అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకి ఏదైనా గ్రామంలో ఒక సర్వే నంబర్‌లో నలుగురు రైతులకు ఎకరం చొప్పున నాలుగెకరాల భూమి ఉందనుకుందాం. వారిలో ఒకరు ఆ సర్వే నంబర్‌ (ఎల్‌పీ)తో ఒక బ్యాంకులో రుణం తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు రైతులు రుణం పొందలేని పరిస్థితి. మరొక బ్యాంకుకు వెళ్లినా సదరు ఎల్‌పీ నంబర్‌తో రుణం తీసుకున్నారని సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని అధికారులు అంటున్నారు. సాంకేతిక సమస్యతో 1బీ అడంగల్‌ పత్రాలపై తహసీల్దార్ల డిజిటల్‌ సంతకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదు. 


అంతా తప్పుల తడక..

ఈ ప్రభుత్వ తీరుతోనే ఈ సమస్య. రీ-సర్వే అంతా తప్పులతడకగా సాగింది. మత్స్యపురి సహకార సంఘంలో ఫిబ్రవరిలో రుణం కోసం దరఖాస్తు చేశా. కాగితాలు సక్రమంగా లేవని, రుణాల మంజూరుకు అనుమతులు రావాలని చెబుతున్నారు. మూడు నెలలుగా రుణం కోసం ఎదురు చూస్తున్నా ఫలితం లేదు. 

జవ్వాది ఉదయ భాస్కరరావు, రైతు, మత్స్యపురి  


రుణం పొందలేకపోయా..

వన్‌బీ, డిజిటల్‌ సంతకాలు లేవు. దానికి తోడు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మా భూపత్రాలు చూపించడం లేదు. ఎకరన్నర భూమికి రూ.మూడు లక్షల రుణం కోసం దరఖాస్తు చేశా. దస్త్రాలు సరిగా లేకపోవడంతో పీఏసీఎస్‌ రుణం ఇచ్చేందుకు వీలు పడలేదు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. అవసరాలకు నగదు లేక ఇబ్బంది పడుతున్నాం. 

కూనమనేని హరింద్రనాథ్‌ చౌదరి, అప్పలరాజుగూడెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని