logo

సూర్యకిరణ ఉషస్సు.. శ్రీనివాసుని తేజస్సు

ద్వారకాతిరుమల శేషాచల పర్వతంపై కొలువుతీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి.

Published : 21 May 2024 03:33 IST

కనులపండువగా కల్యాణ మహోత్సవాలు
యోగశ్రీనివాసుని అలంకారంలో స్వామివారు

సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శేషాచల పర్వతంపై కొలువుతీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. మూడో రోజు సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత  శ్రీనివాసుని గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. అంతకుముందు స్వామి, అమ్మవార్లను సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి విశేషంగా అలంకరించారు. ఆపై ఆలయ అర్చకులు విశేష హారతులు సమర్పించారు. ఉదయం సూర్యకిరణాలు ప్రసరిస్తుండగా- ఉభయ దేవేరుల సమేత శ్రీవారు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి తేజోవిరాజితుడై పుర వీధుల్లో విహరించారు. భక్తులు స్వామివారికి కర్పూర హరతులతో నీరాజనాలు పలికారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు.. ఆలయ తూర్పు వైపున శ్రీహరి కళా తోరణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ ప్రదర్శనలను తిలకిస్తూ భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం పొందుతున్నారు. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శేషాచల పర్వతం విద్యుద్దీప శోభతో అలరారుతోంది. ఆలయంపై వివిధ విద్యుద్దీప అలంకరణలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారు విహరించనున్నారు. రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, 8.30 గంటలకు వెండి శేష వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరగనుంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని