logo

మళ్లీ వరండాలు.. అరుగులే!

గతేడాది నవంబరు నుంచి నిధుల సమస్యతో కొన్ని, ఇసుక, సిమెంట్‌ అందుబాటులో లేక మరికొన్ని పనులు నిలిచిపోయాయి. జరుగుతున్నాయనిపించుకునేందుకు అక్కడక్కడా పనులు చేయిస్తున్నారు.

Updated : 21 May 2024 06:08 IST

తరగతుల నిర్వహణకు ఈ సారీ అవస్థలే
వచ్చే విద్యాసంవత్సరానికి సమస్యల స్వాగతం
అసంపూర్తిగా నాడు-నేడు రెండోదశ నిర్మాణాలు

ఈనాడు, భీమవరం, న్యూస్‌టుడే-పెనుమంట్ర, తణుకు గ్రామీణ, పాలకొల్లు గ్రామీణ: నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఎన్ని కబుర్లు చెప్పినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం  చతికిలపడ్డాయి. మరో 23 రోజుల్లో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు  తెరుచుకోనుండగా పూర్తి కాని పనులు.. ప్రభుత్వం, అధికారుల వైఫల్యాలను వెక్కిరిస్తున్నాయి. విద్యా సంవత్సరాలు మారుతున్నా..పాఠశాల రూపురేఖల్లో మాత్రం మార్పు లేదు.

గతేడాది నవంబరు నుంచి నిధుల సమస్యతో కొన్ని, ఇసుక, సిమెంట్‌ అందుబాటులో లేక మరికొన్ని పనులు నిలిచిపోయాయి. జరుగుతున్నాయనిపించుకునేందుకు అక్కడక్కడా పనులు చేయిస్తున్నారు. జిల్లాలో రూ.261.4 కోట్ల పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికి ఖర్చు చేసింది..రూ.141 కోట్లు కాగా అందులో దాదాపు 40 శాతం బిల్లులు పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 521 అదనపు తరగతి గదులు నిర్మించాల్సి ఉండగా గత రెండేళ్లలో పూర్తి చేసింది 293 మాత్రమే. వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడాల్సిందే. ఈ పనుల్లో 13 కళాశాలలుగా ఉన్నతీకరించిన బడులు కూడా ఉన్నాయి. ఈ ఏడాది నుంచైనా తరగతులు మొదలవడం ప్రశ్నార్థకమే. చిన్నా పెద్దా అన్ని మరమ్మతులకు 348 ఎంపిక కాగా ఇప్పటి వరకు 228 పాఠశాలల్లో పనులు పూర్తికాగా ఇంకా 121 చోట్ల కాలేదు. 

పెనుగొండ మండలం చెరుకువాడ జడ్పీ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులు చేపట్టి రెండేళ్లు కావస్తున్నా పూర్తి కాలేదు. 17 గదులకు 13 నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలినవి మొదలు కాలేదు. నిధుల సమస్యతో 4 నెలల క్రితమే ఆగిపోయాయి. 

ఇరగవరం

మండలం కాకిలేరు జడ్పీ పాఠశాలలో మొత్తం 150 మంది విద్యార్థులకు నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులు కూర్చొనేందుకు కూడా ఖాళీ లేక ఇబ్బంది పడుతున్నారు. వరండాలో, అరుగుపైనా కూర్చోబెడుతున్నారు. నాడు-నేడులో చేపట్టిన అదనపు భవన నిర్మాణం శ్లాబ్‌ దశకు వచ్చి ఆరు నెలల క్రితం నిలిచిపోయింది. మరో 23 రోజుల్లో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరానికి పనులు పూర్తి కావటం దాదాపు అసాధ్యమే.

పాలకొల్లు

మండలం దిగమర్రు జడ్పీ పాఠశాలలో నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని రెండేళ్ల క్రితం మొదలుపెట్టి శ్లాబు పూర్తి చేసి ఆరు నెలలుగా నిధుల సమస్యతో పనులు నిలిపేశారు. 450 మంది విద్యార్థులుండగా మొత్తం ఆరు గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఇరుకు గదులతో ఇబ్బంది పడాల్సిందే.


పెనుమంట్ర

ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం అసంపూర్తిగా ఆగింది. ఇక్కడ మొత్తం 450 మంది విద్యార్థులుంటే 12 గదులున్నాయి. రూ.1.18 కోట్లతో పనులు జరగాల్సి ఉన్నా నిధుల సమస్యతో దాదాపు ఆరు నెలల క్రితం ఈ పనులు నిలిచిపోయాయి.  స్థానిక పాఠశాలలో గతేడాది ఇంటర్‌ విద్య ప్రారంభించినా సౌకర్యాలు లేక విద్యార్థులు రాలేదు. ఆ సారైనా అదనపు గదులు పూర్తి చేస్తే ఇంటర్‌ విద్య గాడిన పడుతుందనుకుంటే  ఆ పరిస్థితి కనిపించటం లేదు.


అవే అవస్థలు 

నాడు-నేడు రెండో విడత పనులు 2021-22 విద్యా సంవత్సరంలో మొదలు పెట్టారు. వేసవి సెలవుల అనంతరం 2022-23 విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి పూర్తి చేస్తామంటూ వైకాపా సర్కారు బాకాలూదింది. గడువు ముగిసి ఏడాది కావస్తున్నా పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి కావటం సాధ్యం కాదు. మరుగుదొడ్లు, వంటగదులు, ప్రహరీలు, విద్యుత్తు సౌకర్యం ఇలా ఏవీ పూర్తికాలేదు. ఈ విషయమై సమగ్రశిక్షా జిల్లా అధికారి శ్యామ్‌సుందర్‌ను వివరణ కోరగా సాధ్యమైనంత వేగంగా చేస్తున్నామని..పాఠశాలలు తెరిచే నాటికి పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని