logo

చాకిరీ చేసినా.. సొమ్ముల్లేవ్‌!

ఎన్నికల క్షేత్రంలో బూత్‌ స్థాయి అధికారులది కీలకపాత్ర. మిగిలిన ఉద్యోగులకు ఎన్నికల సమయంలోనే పని అప్పగిస్తారు.

Published : 21 May 2024 03:40 IST

బీఎల్వోలకు దక్కని గౌరవ వేతనం

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ఎన్నికల క్షేత్రంలో బూత్‌ స్థాయి అధికారులది కీలకపాత్ర. మిగిలిన ఉద్యోగులకు ఎన్నికల సమయంలోనే పని అప్పగిస్తారు. బీఎల్వోలు మాత్రం ఏడాది పొడవునా వివిధ బాధ్యతలు మోస్తున్నా వారి శ్రమను ఎవరూ గుర్తించడం లేదు. ఒక్కో బీఎల్వోకు నెలకు రూ.500 చొప్పున గౌరవ వేతనంగా ఎన్నికల సంఘం చెల్లించాలి. గతంలో మూడు నెలలకు ఓసారి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మూడేళ్లుగా ఈ సొమ్ము అందడం లేదు. అంటే ఒక్కొక్కరికి రూ.18 వేల చొప్పున బకాయిలు పేరుకుపోయాయి. కానీ ఉన్నతాధికారులు అప్పగించిన పనులను బాధ్యతగా నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇలాంటి సమయంలోనూ బకాయిల చెల్లింపుపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1,463 మంది బీఎల్వోలు ఉన్నారు. మొత్తం 9,681 మంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.

ఖర్చు బారెడు.. ఇచ్చేది మూరెడు

పోలింగ్‌ సమయంలో కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులు వీఆర్వోలకు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన సొమ్ము మాత్రం ఇవ్వలేదు. ఒక్కో కేంద్రానికి ముందస్తుగా రూ.5 వేలు మాత్రమే చెల్లించారు.   షామియానాల ఏర్పాటు విద్యుత్తు, నీరు ఇతరత్రా సౌకర్యాలు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు టీ, అల్పాహారం, భోజనాలకు కలిపి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చయినట్లు సమాచారం. తాజాగా కేంద్రాల పరిధిలో ఎంత ఖర్చయిందో వివరాలు తెలపాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో క్షేత్రస్థాయి ఉద్యోగులు వివరాలతో నివేదికలు పంపించారు. అసలు ఈ సొమ్ము ఇస్తారో ఇవ్వరో.. ఇస్తే ఎంతిస్తారో అర్థం కావడం లేదని వీఆర్వోలు తలలు పట్టుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని